Take a fresh look at your lifestyle.

కోకాపేట భూముల వద్ద ఆందోళనకు కాంగ్రెస్‌ ‌పిలుపు

  • ముందు జాగ్రత్తగా పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌గృహనిర్బంధం
  • తనను పార్లమెంట్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారన్న రేవంత్‌

రాష్ట్రంలో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. పార్లమెంట్‌ ‌సమావేశాలు జరుగుతున్న వేళ పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్టు చేయడం ఇప్పుడు హాట్‌ ‌టాపిక్‌గా మారింది. మరోవైపు తనను గృహనిర్బంధం చేయడంపై రేవంత్‌ ‌స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. సీఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ‌సర్వీస్‌పై ప్రధాని, హోంమంత్రికి ఫిర్యాదు చేయాలని రేవంత్‌ ‌నిర్ణయించారు. కోకాపేట భూముల అమ్మకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, వేయికోట్ల గోల్‌మాల్‌ ‌జరిగిందన్నారు. ఈ క్రమంలో భూముల వద్ద కాంగ్రెస్‌ ఆం‌దోళనకు పిలుపునిచ్చింది. అదే సమయంలో అక్కడికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే రేవంత్‌ను ఢిల్లీకి వెళ్లకుండా అడ్డుకోవడానికే హౌస్‌ అరెస్టు చేసినట్లు ఆయన వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సోమవారం కోకాపేట భూముల వద్దకు వెళ్లేందుకు వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహా, మహేష్‌గౌడ్‌ ‌నేతృత్వంలోని టీపీసీసీ కమిటీ పిలుపు ఇచ్చింది.

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కోకాపేటలో వేలం వేసిన భూముల వద్ద నిరసన తెలిపేందుకు కాంగ్రెస్‌ ‌సిద్ధమైంది. దీంతో సోమవారం తెల్లవారుజామునుంచే పోలీసులు కాంగ్రెస్‌ ‌నేతలను హౌస్‌ అరెస్టులు చేశారు. కాగా తనను హౌస్‌ అరెస్టు చేయడంపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయాలని రేవంత్‌ ‌రెడ్డి నిర్ణయించారు. పార్లమెంట్‌ ‌సమావేశాలకు హాజరవ్వకుండా అడ్డుకోవడంపై రేవంత్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్పీకర్‌ ‌దృష్టికి తీసుకుని వెళతామన్నారు. తాను పార్లమెంటుకు హాజరు కాకుండా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. ఇదిలా వుంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అరెస్టు విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని తెలంగాణా కాంగ్రెస్‌ ‌వ్యవహారాల ఇంఛార్జి మాణికం టాగూర్‌ ‌ఢిల్లీలో తెలిపారు.

కోకాపేట భూములను పరిశీలించేందుకు కాంగ్రెస్‌ ‌నేతలు రేవంత్‌, ‌జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ, మహేష్‌గౌడ్‌ ‌నేతృత్వంలోని పీసీసీ కమిటీ కలిసి వెళ్లాలని నిర్ణయించింది. అయితే ఈ పర్యటనను అడ్డుకునేందుకు రేవంత్‌రెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్ట్ ‌చేశారు. రేవంత్‌రెడ్డి ఇంటి దగ్గరికి పోలీసులు భారీగా మోహరించారు. తెల్లవారు జాము నుంచే కాంగ్రెస్‌ ‌నేతలను పోలీసులు హౌస్‌ అరెస్ట్ ‌చేశారు.

Leave a Reply