బీజేపీ పోరాటాలతో బీఆర్‌ఎస్ గుండెలు గుభేల్ మంటున్నాయ్
ఈ నెల 23న చేవెళ్ల బహిరంగ సభను సక్సెస్‌తో సత్తా చాటుదాం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
చేవెళ్ల బహిరంగ సభకు ‘‘విజయ సంకల్ప సభ’’గా నామకరణం..
జన సమీకరణ, సభ ఏర్పాట్లపై నేతలతో చర్చ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : నిన్నటి దాకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో పాల్గొంటామని, ప్లాంట్‌ను కాపాడుకుంటామని కోతలు కోసిన కేసీఆర్ ఇయాళ తోక ముడిచిండని బిసెపి రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. వైజాగ్ స్టీల్ బిడ్డింగ్‌లో పాల్గొనలేదని, ఎప్పుడేం మాట్లాడతారో ఆయనకే అర్ధం కావడం లేదని, చెప్పిన మాట ఒక్కటీ నిలబెట్టుకోని కోతల రాయుడు కేసీఆర్ అన్నారు. పంజాబ్ పోయి ఇచ్చిన చెక్కులన్నీ బౌన్స్ చేసిండని, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, రేయాన్ ఫ్యాక్టరీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్దరిస్తానని ఇచ్చిన హామీలన్నీ కోతలేనని తేలిపోయిందని విమర్శించారు. సొంత రాష్టంలో ఇచ్చిన హామీలనే అమలు చేయనోడు వైజాగ్ స్టీల్‌ను కాపాడుకుంటానంటే నమ్మేదెవరని, ప్రచారం కోసం కేసీఆర్ కోతలే తప్ప ఆయన చేసిందేమీ లేదని, కేసీఆర్‌ను చూసి దేశమంతా నవ్వుకుంటుందని విమర్శించారు బండి సంజయ్. ఇట్లాంటోడు సీఎంగా కొనసాగుతున్నందుకు తెలంగాణ ప్రజలు తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈనెల 23న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రానున్న నేపథ్యంలో చేవెళ్లలో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లపై స్థానిక పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో గురువారం సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశానికి బండి సంజయ్ తోపాటు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ తోపాటు మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లుతోపాటు చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ మల్లారెడ్డితోపాటు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని వివిధ జిల్లాల అధ్యక్షులు, కన్వీనర్లు, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చేవెళ్ల బహిరంగ సభ ఏర్పాట్లు, జన సమీకరణపై చర్చించారు. చేవెళ్ల సభ సందర్భంగా సంబంధిత పార్లమెంట్ నియోజకవర్గ పరిధి నుండే జన సమీకరణ చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా జిల్లాల వారీగా జన సమీకరణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ…చేవెళ్ల నియోజకవర్గంలోని నాయకులు దమ్మున్న నాయకులు, కార్యకర్తలని, పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లను బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయమని అన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, కేసీఆర్ సర్కార్‌ను బొంద పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అందరం కలిసి కొట్లాడి కేసీఆర్ గడీలు బద్దలు కొట్టి రామరాజ్యాన్ని స్థాపిద్దామంటూ పిలుపేనిచ్చారు. నిన్నటి దాకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో పాల్గొంటాం. వైజాగ్ స్టీల్ ను కాపాడుకుంటామని కోతలు కోసిన కేసీఆర్ ఇయాళ తోక ముడిచారన్నారు.
వైజాగ్ స్టీల్ బిడ్డింగ్‌లో పాల్గొనలేదని, కేసీఆర్ ను చూసి దేశ ప్రజలంతా నవ్వుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఏం మాట్లాడతారో ఆయనకే అర్ధం కావడం లేదని, చెప్పిన మాట ఒక్కటీ నిలబెట్టుకోడని, పంజాబ్ పోయి ఇచ్చిన చెక్కులన్నీ బౌన్స్ చేసిండని బండి సంజయ్ మండిపడ్డారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, రేయాన్ ఫ్యాక్టరీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్దరిస్తానని ఇచ్చిన హామీలన్ని అమలు చేయనోడు వైజాగ్ స్టీల్ ను కాపాడుకుంటానంటే నమ్మేదెవరని, ప్రచారం కోసం కేసీఆర్ కోతలే తప్ప ఆయన చేసిందేమీ లేదన్నారు. టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ కేసులో ఐటీ శాఖ విఫలమైందని, నాలాలో పడి పసిపిల్లలు చనిపోయారని, దానికి మున్సిపల్ శాఖ వైఫల్యమేకారణమని, రాజీనామా చేయమంటే కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు రాజీనామా చేయకుండా ప్రజలను దారి మళ్లిస్తున్నరని విమర్శించారు. మరి ఈటల రాజేందర్ ఏం తప్పు చేశారని మంత్రి పదవి నుండి తొలగించారని, ప్రశ్నిస్తే తట్టుకోలేని వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. లిక్కర్ కేసు, పేపర్ లీకేజీ విషయంలో కేసీఆర్ బిడ్డ, కొడుకు పాత్ర బయటపడటంతో దారి మళ్లించేందుకు టెన్త్ పేపర్ లీకేజీ కుట్ర కేసు నాపై నమోదు చేసి తనను జైలుకు పంపారని, లిక్కర్, లీకు వీరులు కేసీఆర్ కుటుంబమేనని, దోచుకోవడంలో వాళ్లను మించినోళ్లు లేరంటూ విమర్శించారు.
తెలంగాణ ప్రజలంతా పిచ్చోళ్లరనే భావనలో కేసీఆర్ ఉన్నరని, తాను ఏం చెప్పినా, చేసినా నమ్ముతారనే అహంకారంతో విర్రవీగుతున్నరని బండి అన్నారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, మజ్లిస్, కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసేందుకు కేసీఆర్ సిద్ధమైండని, కాంగ్రెస్-బీఆర్‌ఎస్ రెండూ ఒక్కటేనని, వొచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నయని ఆ పార్టీ నేతలే బహిరంగ ప్రకటనలు చేశారని బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్‌ను ఎదిరించే పార్టీ బీజేపీ మాత్రమేనని, ప్రజాసమస్యలపై పోరాడుతున్న పార్టీ బీజేపీయేనని, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై నిరుద్యోగుల తరపున ఉద్యమిస్తున్నామని, వరంగల్‌లో జరిగిన నిరుద్యోగ మార్చ్‌కు వేలాది మంది తరలిరావడంతో బీఆర్‌ఎస్ నేతల గుండెలు గుభేలుమంటున్నాయన్నారు. ఈ నేపథ్యలో చేవెళ్లేలో బహిరంగ సభ నిర్వహిస్తన్నామని, దీనికి విజయ సంకల్ప సభ అని నామకరణం చేస్తున్నామని, విజయానికి సంకేతంగా చేవెళ్ల బహిరంగ సభను నిర్వహించి విజయవంతం చేద్దామని, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోనే పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి ఈ ప్రాంతంలో బీజేపీ సత్తాను చాటుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా చేవెళ్ల బహిరంగ సభపై మీడియా, సోషల్ మీడియాలో విస్త్రతంగా ప్రచారం నిర్వహించాలని, ఊరూరా ఈ అంశంపై ప్రచారం చేయాని బండి సంజయ్ పిలుపునిచ్చారు.