Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్‌, బీజేపీ .. ఒక చైనా..!

“వాస్తవంగా 1948లో ప్రైమినిష్టర్స్‌ నేషనల్‌ రిలీఫ్‌ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. ఎటువంటి వైపరిత్యాలు వచ్చినా ప్రభుత్వానికి చేయూత ఇవ్వాలనుకునే సంస్థలు, వ్యక్తులు ఈ ఫండ్‌కు విరాళాలు ఇస్తుంటారు. గత ఏడాది డిసెంబర్‌ నాటికి ఈ నిధిలో 3వేల 800 కోట్ల రూపాయలు ఉన్నాయి. దీని వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు వచ్చిన నిధులు, చేసిన ఖర్చుల వివరాలు పొందుపరుస్తూ ఉంటారు. ఈ ఏడాది మార్చి నెలలో ప్రధాని “పీఎమ్‌ కేర్స్‌ ఫండ్‌” పేరుతో మరో వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ నిధికి ప్రధాని ఎక్స్‌ అఫీషియో ఛైర్మన్‌ కాగా, హోమ్‌, విదేశాంగ, ఆర్ధిక శాఖా మంత్రులు ఎక్స్‌ అఫీషియో ట్రస్టీ సభ్యులు. పీఎమ్‌కేర్స్‌ వెబ్‌ సైట్‌ ఇది ఒక పబ్లిక్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌గా పేర్కోంది. దేశం ఏర్పడినప్పటి నుంచి ఎటువంటి ఆరోపణలు లేకుండా కొనసాగుతున్న పీఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్‌ ను పక్కన పెట్టి పీఎమ్‌ కేర్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏం వచ్చిందన్న ప్రశ్నలు తలెత్తాయి.”

rehanaకరోనా వైరస్‌ ప్రపంచం పై పంజా వేయటం మొదలు పెట్టినప్పటి నుంచే ప్రపంచం అంతటా చైనా గురించిన చర్చ మొదలయ్యింది. వుహాన్‌ వైరాలజీ ల్యాబ్‌ నుంచే ఈ వైరస్‌ లీకయ్యిందని కొన్ని స్టేట్‌మెంట్లు, కాదని మరికొన్ని వ్యాఖ్యానాలు, అక్కడి వెట్‌ మార్కెట్‌ నుంచి పుట్టుకు వచ్చిందని, అసలు చైనీయుల తిండి అలవాట్లే ఈ ముప్పుకు కారణం అని ఇలా అనేక కోణాలు, అనేక వాదనలు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోటి మందికి పైగా ఈ వైరస్‌ బారిన పడటంతో సహజంగానే చైనా చర్చ అనివార్యం అయ్యింది. ఆ దేశంతో ఆర్ధిక సంబంధాల అంశాలు దీనికి కొనసాగింపు.

సరిహద్దు వివాదం-రాజకీయ రంగు:
ప్రత్యేకించి మన దేశానికి సరిహద్దు వివాదం అనే మరో కోణం తోడయ్యింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ రంగు కూడా పులుముకుంది. లద్దాక్‌ సరిహద్దులోని గాల్వాన్‌ లోయలో వాస్తవాధీన రేఖ వివాదం ముదిరి ఏకంగా మన జవాన్లు 20 మందిని చైనా పొట్టన పెట్టుకోవటంతో ఇరు దేశాల మధ్య ఘర్షణ తీవ్ర స్థాయికి చేరింది. మరోసారి భారత్‌-చైనా యుద్ధం వస్తుందన్న ప్రచారం, మీడియాలో వేడి వేడి డిబేట్లు చూస్తూనే ఉన్నాం. చైనా వస్తువులను బ్యాన్‌ చేయాలన్న డిమాండ్లు సోషల్‌ మీడియాలో వెల్లువెత్తాయి. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడో, మరో కారణం వల్లనో కేంద్రం 59 చైనా యాప్‌లను నిషేధించింది. వీటిలో యువతలో బాగా క్రేజ్‌ సంపాదించుకున్న టిక్‌టాక్‌ వంటి వీడియో షేరింగ్‌ యాప్‌, యూసీ బ్రౌజర్‌, హాయ్‌ వంటివి కూడా ఉన్నాయి. పాకిస్థాన్‌ విషయంలో బీజేపీ నేతలు, కేంద్రం చూపించే దూకుడు వైఖరికి, చైనాతో తాజా వ్యవహారానికి మధ్య స్పష్టమైన తేడా ఉంది. ప్రభుత్వానికి ఉండే వ్యూహాలు ప్రభుత్వానికి ఉండొచ్చు. కాని విపక్షాలకు మాత్రం ఇది ఒక ఆయుధం అయ్యింది. పైగా భారత భూభాగంలోకి డ్రాగన్‌ సైన్యం జోరబడిందా లేదా అన్న విషయంలోనూ అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చైనాతో ప్రధాని మెతక వైఖరి అంటూ కాంగ్రెస్‌ నేతలు ధ్వజమెత్తారు. దీనికి కౌంటర్‌గా బీజేపీ నేతలు పదిహేనేళ్ళ నాటి రికార్డులు తవ్వి తీశారు. 2005-06 కాలంలో రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌కు చైనా నుంచి విరాళాలు వచ్చిన విషయాన్ని బయటపెట్టారు. రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌కు సోనియాగాంధీ ఛైర్‌పర్సన్‌ కాగా రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ, చిదంబరం వంటి వారు ట్రస్టీలు.

ఓ వైపు బ్యాన్‌లు, మరోవైపు విరాళాలు?
కాంగ్రెస్ మరో ఆసక్తికర ఆరోపణను తెర మీదకు తీసుకువచ్చింది. మీడియా కథనాలు దీనికి అదనంగా తోడయ్యాయి. ఓ వైపు చైనాతో సరిహద్దు ఘర్షణ వాతావరణం నెలకొని ఉన్న సందర్భంలోనే ప్రధాని నరేంద్ర మోడి ప్రారంభించిన పీఎమ్‌ కేర్స్‌ ఫండ్‌కు చైనా కంపెనీల నుంచి విరాళిలు చేరాయి అన్నది తాజా ఆరోపణ. కొన్ని మీడియా రిపోర్ట్స్‌ ప్రకారం చైనా ఆధారిత టిక్‌టాక్‌ కంపెనీ పీఎమ్‌ కేర్స్‌ ఫండ్‌కు 30 కోట్ల విరాళం ఇచ్చింది. చైనా నెట్‌వర్కింగ్‌, టెలికామ్‌ దిగ్గజం హువాయ్‌ 7 కోట్ల విరాళంగా ఇచ్చింది. ఈ కంపెనీకు పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీతో సంబంధాలు ఉన్నాయని అంటారు. చైనా మోబైల్‌ ఫోన్‌ కంపెనీ గ్జియోమి తాను పీఎమ్‌ రిలీఫ్‌ ఫండ్‌కు, భారతదేశంలోని పలు రాష్ట్రాలకు పదికోట్ల విరాళం ఇచ్చినట్లు ట్వీట్‌ చేసింది. మరోక చైనా ఫోన్‌ కంపెనీలు వన్‌ ప్లస్‌, అప్పో చెరో కోటి రూపాయలు విరాళం ఇచ్చాయి.

వాస్తవంగా 1948లో ప్రైమినిష్టర్స్‌ నేషనల్‌ రిలీఫ్‌ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. ఎటువంటి వైపరిత్యాలు వచ్చినా ప్రభుత్వానికి చేయూత ఇవ్వాలనుకునే సంస్థలు, వ్యక్తులు ఈ ఫండ్‌కు విరాళాలు ఇస్తుంటారు. గత ఏడాది డిసెంబర్‌ నాటికి ఈ నిధిలో 3వేల 800 కోట్ల రూపాయలు ఉన్నాయి. దీని వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు వచ్చిన నిధులు, చేసిన ఖర్చుల వివరాలు పొందుపరుస్తూ ఉంటారు. ఈ ఏడాది మార్చి నెలలో ప్రధాని “పీఎమ్‌ కేర్స్‌ ఫండ్‌” పేరుతో మరో వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ నిధికి ప్రధాని ఎక్స్‌ అఫీషియో ఛైర్మన్‌ కాగా, హోమ్‌, విదేశాంగ, ఆర్ధిక శాఖా మంత్రులు ఎక్స్‌ అఫీషియో ట్రస్టీ సభ్యులు. పీఎమ్‌కేర్స్‌ వెబ్‌ సైట్‌ ఇది ఒక పబ్లిక్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌గా పేర్కోంది. దేశం ఏర్పడినప్పటి నుంచి ఎటువంటి ఆరోపణలు లేకుండా కొనసాగుతున్న పీఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్‌ ను పక్కన పెట్టి పీఎమ్‌ కేర్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏం వచ్చిందన్న ప్రశ్నలు తలెత్తాయి. పీఎమ్ కేర్స్‌ అంటే…ప్రైమినిష్టర్స్‌ సిటిజిన్‌ అసిస్టెంటెట్స్‌ అండ్‌ రిలీఫ్‌ ఇన్‌ ఎమర్జెన్సీ సిట్యుయోషన్‌ ఫండ్‌. పేరులోనే కాదు లక్ష్యాల్లోనూ కరోనా కట్టడి చర్యల కోసమే ప్రత్యేకంగా ఉద్దేశించిన నిధిగా పేర్కోనలేదు. కచ్చితంగా ఆడిటింగ్‌ చేయాలన్న నిబంధన కూడా లేదు. అయితే వ్యక్తిగత ఆడిటర్‌ లెక్కలు ఆడిట్‌ చేస్తారు. ఆడిటింగ్‌ కాలానికి కూడా నిర్దిష్టత లేదు అని ఈ వెబ్‌ సైట్‌ పేర్కోంటోంది. విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎంత వచ్చాయి, ఎవరి కోసం ఆ నిధి ఖర్చు చేశారు, ఉద్దేశించిన లక్ష్యాల కోసం ఖర్చు చేశారా లేదా అనే విషయాలను ఇంత వరకు పీఎమ్‌ఓ బహిర్గతం చేయలేదు. సమాచార హక్కు చట్టం కింద ఆర్టీఐ యాక్టివిస్ట్‌లు అడిగిన వివరాలను ఇవ్వటానికి పీఎమ్‌ఓ నుంచి సరైన సమాధానం రాలేదట. ఏప్రియల్‌లో భారత-చైనా సైన్యం తలపడిన రోజే చైనా నుంచి విరాళం పీఎమ్‌ కేర్‌లో జమ అయ్యిందని కూడా కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

సరిహద్దున చైనా కాలు దువ్వుతూ దేశ సార్వభౌమాధికారాన్నే సవాలు చేస్తుంటే దేశంలోని రాజకీయ పక్షాలు ఏకతాటి పైకి వచ్చి డ్రాగన్‌ దేశానికి ఖంగు తినే సమాధానం ఇవ్వాల్సింది పోయి…ఆ దేశ విరాళాలు నువ్వు తీసుకున్నావు అంటే నువ్వు తీసుకున్నావు అని ఆరోపణలు, ప్రత్యారోపణలు గుప్పించుకోవటమే సగటు భారతీయుడికి అసలు విషాదంగా కనిపిస్తోంది.

Leave a Reply