Take a fresh look at your lifestyle.

యువ నాయకులను దూరం చేసుకుంటున్న కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ ‌పార్టీ క్రమేణ యువనాయకులను దూరం చేసుకుంటోంది. మొన్న జ్యోతిరాధిత్య, ఇవ్వాళ సచిన్‌ ‌పైలెట్‌. ఇలా పార్టీ ఒక్కొక్క నాయకుడిని పార్టీని వీడిపోయేట్లుగా పొమ్మనకుండా పొగపెడుతోంది. వీరిద్దరు కూడా ఆయా రాష్ట్రంలో తమకంటూ ప్రత్యేక వర్గాన్ని, బలాన్ని, పలుకుబడిని సాధించుకున్నవారే. కాంగ్రెస్‌ ‌పార్టీలో యువరాజుగా పేరున్న రాహుల్‌గాంధీకి వీరిద్దరూ అత్యంత సన్నిహితులు కూడా. అయినా వందేళ్ళకు పైపడిన కాంగ్రెస్‌ ఇం‌కా వృద్ధనాయకులపైన చూపిస్తున్న మమకారానికి యువనాయకత్వం బలైపోతున్నదనడానికి వీరిద్దరిపట్ల కాంగ్రెస్‌ అనుసరించిన వైఖరే ప్రత్యక్ష నిదర్శనం. జ్యోతిరాధిత్య ఇప్పటికే కాంగ్రెస్‌ను వీడి, ఆపార్టీకి బద్ధ శత్రువుగా భావిస్తున్న భారతీయ జనతాపార్టీలో ఇప్పటికే చేరిపోగా, సచిన్‌ ‌విషయం మాత్రం ఇంకా ఎటూ తేలలేదు. బిజెపిలో చేరుతాడని వస్తున్న వందంతులను ఆయన ఇప్పటికైతే కొట్టిపారేస్తున్నాడు. బిజెపిపై పోరాటం చేసి గెలిచిన తాను ఆ పార్టీలో చేరుతున్నట్లుగా జరుగుతున్నదంతా ఒట్టి ప్రాచారం మాత్రమేనని చెబుతున్నప్పటికీ రాజకీయాల్లో ఏది కూడా అసాధ్యంకాదన్నది తెలియంది కాదు. మొదట్లో కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని చేపట్టేముందు రాహుల్‌గాంధీ చెప్పిన మాటలను కాంగ్రెస్‌ ‌పెద్దలెవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాంగ్రెస్‌ ‌పార్టీకి పూర్వపు వైభవాన్ని తీసుకురావాలంటే పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్న రాహుల్‌ ‌షరతులపై పెద్ద చర్చే జరిగింది.

ఆ విషయంలో ఆయన మొండి పట్టుదలకు చివరకు సోనియా మధ్యే మార్గంగా వృద్ధ, యవనాయకుల కలగలుపుగా పార్టీని కొనసాగించాలన్న అభిప్రాయానికి వచ్చారు. గాంధీ, నెహ్రూ కుటుంబాలకు చెందినవారి నాయకత్వంలోనే కాంగ్రెస్‌ ‌పార్టీకి మనుగడ ఉంటుందన్న గట్టి విశ్వాసాన్ని ప్రకటించడంవల్ల రాహుల్‌ ‌గాంధీ అయిష్టంగానైనా ఎఐసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు. జాతీయ అద్యక్షుడిగా కొంతకాలమే కొనసాగినా, తన లక్ష్యం మేరకు జ్యోతిరాదిత్య, సచిన్‌ ‌పైలెట్‌ ‌లాంటి యువ నాయకులనేకమందిని ఆయన ప్రోత్సహించి ముందు నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అయినా వృద్ధ నాయకుల హస్తాల నుండి పార్టీ వేరుకాలేక పోయింది. కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత విభేదాలైతేనేమీ, క్రమశిక్షణా రాహిత్యమైతేనేమీ, పార్టీలో ఉన్న నైరాశ్యవల్ల నైతేనేమీ గత పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. దానికి నైతిక బాధ్యతవహిస్తూ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాహుల్‌ ‌రాజీనామా చేయడంతో యువనాయకత్వం ఎదిగే అవకాశాలు మరోసారి సన్నగిల్లాయి. నెహ్రూ, గాంధీ కుటుంబాల నుంచి కాకుండా ఇంకా ఎవరైనా నాయకత్వ బాధ్యత చేపట్టవచ్చని రాహుల్‌ ‌బహిరంగంగానే ప్రకటించినప్పటికీ పార్టీ అధినాయకత్వం మాత్రం మరోసారి సోనియా గాంధీకే పట్టంకట్టింది. ఆమె కూడా జోడు గుర్రాలమీద స్వారీ చేయాలని భావించినప్పటికీ సీనియర్ల దాటికి యువనేతలు తట్టుకోలేకపోవడమే పై పరిణామాలకు కారణంగా మారింది.

అటు పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న కాంగ్రెస్‌, ఒక్కో రాష్ట్రాన్ని కూడా కోల్పోతూ వచ్చింది. కాంగ్రెస్‌ ‌చెప్పుకోవడానికి బలమైన రాష్ట్రాలుగా ఉన్న మద్యప్రదేశ్‌, ‌రాజస్థాన్‌లలో స్వీయపార్టీ నాయకుల మధ్య పొరపొచ్చాలే ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఎదుటి పార్టీలో విభేదాలను తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం ఇటీవల కాలంలో సిద్ధంగా ఉన్న బిజెపి విసిరిన పాచికలో జ్యోతిరాధిత్య సింధియా పడిపోయాడు. కాంగ్రెస్‌లో ఇముడలేక పోతున్న ఆయనకు రాజ్యసభ సభ్యత్వంతో పాటు, ఆయన వర్గానికి కీలక మంత్రి పదవులను ఇవ్వడం ద్వారా ఓ బలమైన వర్గాన్ని , నాయకుడిని బిజెపి తన పార్టీలో కలిపేసుకుంది. ఇప్పుడు సచిన్‌ ‌పైలెట్‌ ‌తిరుగుబాటు జంఢా వెనుక కూడా బిజెపి హస్తం ఉందన్న ప్రచారం జరుగుతున్నది. ఇక్కడ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని కూలదోయడానికి బిజెపి చేస్తున్న కుట్రలో సచిన్‌ ‌పావులా మారాడని కాంగ్రెస్‌ ఆరోపిస్తున్నది. అయితే అలాంటిదేమీలేదని, తాను పార్టీని వీడి పోవటంలేదని సచిన్‌ ఒక పక్క చెబుతున్నా పార్టీ నాయకత్వం మాత్రం ఆయన మాటలను నమ్మటంలేదు. సచిన్‌ ‌పైలెట్‌ను డిప్యూటీ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్ష పదవుల నుండి తొలగిస్తూ, మరో సీనియర్‌నేత రణదీప్‌సింగ్‌ ‌సుర్జేవాలను ఆ పదవుల్లో నియమిస్తున్నట్లు కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటించడంతో సచిన్‌ ఇక ఎట్టి పరిస్థితిలోనూ పార్టీ వీడటం ఖాయమని తెలుస్తున్నది. అయితే అందరూ అనుకున్నట్లు ఆయన బిజెపిలో చేరుతారా లేక పోటీ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేస్తాడా అన్నది ఇంకా తేలకుండా ఉంది. ఏది ఏమైనా కాంగ్రెస్‌లో యువనాయకత్వం ఎదగడానికి చాలా అవరోధాలుంటాయన్నది వీరిద్దరు కాంగ్రెస్‌ను వీడడం ద్వారా అర్థమవుతున్నది.

Leave a Reply