Take a fresh look at your lifestyle.

జగన్‌, ‌కేసీఆర్‌ ‌విద్వేషాలు రెచ్చగొడుతున్నారు

  • తిరుమల ఎంకన్న అందరివాడు…
  • సిఫార్సు లేఖలకు అనుమతి లేదనడం సబబు కాదు
  • జగన్‌, ‌షర్మిల కలిసే నాటకాలాడుతుండ్రు…
  • కాంగ్రెస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు జగ్గారెడ్డి ఫైర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆం‌ధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి జగన్‌, ‌వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు షర్మిలపై తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి తనదైన శైలిలో ఫైర్‌ అయ్యారు. సిఎంలు ఇద్దరు జల వివాదాల పేరుతో మరోసారి ప్రాంతాల మధ్య విద్వేశాలు రెచ్చగొడుతున్నారనీ మండిపడ్డారు. జగ్గారెడ్డి శనివారం గాంధీభవన్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…ఏపి సిఎం జగన్‌, ‌తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఇద్దరూ కలిసి నదీ లాల పేరుతో మళ్లీ నాటి ఉద్యమ సమయ పరిస్థితులు తీసుకువొస్తున్నారని ఆరోపించారు. కృష్ణా నదీ జలాల విషయమై సిఎంలు కూర్చోని మాట్లాడుకుంటే సమస్యలన్నీ సమసిపోతాయనీ, కానీ, వారు అలా మాట్లాడుకోకుండా సమస్యను సర్దుబాటు చేసుకోకుండా మరింత వివాదాన్ని పెంచుతున్నారని, ఇద్దరూ రాజకీయ లబ్ది కోసమే వివాదాన్ని పెంచుతున్నట్లు స్పష్టంగా కనబడుతుందన్నారు. జల వివాదాల నేపథ్యంలో ఇరు ప్రాంతాలకు చెందిన మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ సమస్యను మరింత జఠిలం చేస్తున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్‌, ‌జగన్‌ ఇద్దరూ రాజకీయ ప్రయోజనాల కోసం జల రగడను పెద్దది చేస్తున్నారే తప్ప మరొకటి కాదన్నారు. ప్రస్తుతం కొరోనాతో ప్రజలు కష్టాల్లో ఉన్నారనీ, గత కొన్ని నెలలుగా మహమ్మారితో ప్రజలందరూ బాధపడుతుంటే…వైరస్‌ను అరికట్టడంలో విఫలమైన పాలకులు దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి జల వివాదాన్ని వాడుకుంటున్నారనీ జగ్గారెడ్డి అన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఆంధ్ర సిఎం జగన్‌ ‌సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ అంటూ కొత్త డ్రామాకు తెరలేపారనీ, షర్మిల తెలంగాణ కోడలే అయినా ఆమెది రాయలసీమ రక్తమే కదా?అని అన్నారు. జగన్‌ ఏపిలో, షర్మిల తెలంగాణలో నాటాకాలాడుతున్నారనీ, పైకి చూస్తే వేర్వేరు అని అందరికీ అనిపిస్తున్నప్పటికీ అన్నాచెల్లెళ్లు ఇద్దరూ లోటస్‌పాండులో అంతా కలిసే ఉంటారని, కలిసే నాటకాలాడుతున్నారన్నారు. షర్మిల పార్టీ వెనుక బిజెపి హస్తం ఉందని జగ్గారెడ్డి మరోసారి ఆరోపించారు. అలాగే, ఇప్పటి వరకు జగన్‌ ఏ ఇష్యూలో బిజెపి ప్రభుత్వంపై విమర్శలు చేయలేదన్నారు.

విశాఖ స్టీల్‌ ‌ప్లాంటు ప్రయివేటీకరణను నిరసిస్తూ కార్మికులు రోడ్లపైకి వొచ్చినా ఏపి సిఎం జగన్‌ ‌నోరు మెదపకపోవడంలో అర్థం ఏమిటని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి అందరివాడనీ, అయితే తిరుమలలో వెంకటేశ్వరస్వామి దర్శనం, వసతికి సంబంధించి తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధుల సిఫారుసు లేఖలకు అనమతి లేదనీ జెఈవో చెప్పడం సరికాదన్నారు. తెలంగాణ భక్తులు తిరుమలకు రావొద్దా? అని ప్రశ్నించారు. దేవుడి వద్ద కూడా రాజకీయాలా? ఇదేమీ బాగు లేదన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధుల సిఫార్సుల లేఖలకు తిరుమలలో అనుమతి లేదనీ జెఈవో చెప్పడం దుర్మార్గమైన చర్య అన్నారు.

ఇలాంటి వివాదాలు పెరిగితే రాబోయే రోజుల్లో తెలంగాణ-ఆంధ్ర రాష్ట్రాల మధ్య మరిన్ని వివాదాలు ఏర్పడి పెద్ద తుఫాన్‌గా మారుతుందనీ జగ్గారెడ్డి తనదైనశైలిలో హెచ్చరించారు. దేవుడి వద్ద సిఫార్సుల లేఖలు అనుమతి వంటి ఇష్యులు పెంచడం ఇద్దరు సిఎంలకు మంచిది కాదదన్నారు. ఇలాంటి వివాదాలు రాకుండా చూడాల్సిన బాధ్యత ఇద్దరు సిఎంలపైన ఎంతైనా ఉందన్నారు. అయితే, తిరుమల వెంకటేశ్వరస్వామి ఇష్యూలో బిజెపి రాజకీయంగా వాడుకునే అవకాశం ఉందనీ తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు జగ్గారెడ్డి అన్నారు.

Leave a Reply