డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్కు కంగ్రాట్స్ అంటూ వ్యాఖ్యానించారు. గురువారం సికింద్రాబాద్లో నూతనంగా నిర్మించిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘ్ డివిజనల్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పద్మారావు ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన పద్మారావు మా పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, అతి త్వరలో కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ మా శాసనసభ పక్షాన, మా రైల్వే కార్మికుల పక్షాన కాబోయే సీఎం కేటీఆర్కు శుభాకాంక్షలు అంటూ వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా మీరు ముఖ్యమంత్రి కాగానే రైల్వే కార్మికులను కంటికి రెప్ప మాదిరిగా కాపాడాలనీ, కార్మికుల సమస్యలు వెంటనే తీర్చాలని విజ్ఞప్తి చేశారు. కాగా, గత రెండు రోజులుగా మంత్రి కేటీఆర్కు సీఎం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్ వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం పదవికి కేటీఆర్ సమర్ధుడే అని వారు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.