Take a fresh look at your lifestyle.

బీజేపీలో బయటపడ్డ విభేదాలు

బండి సంజయ్‌ ‌పాదయాత్రకు ఈటల, రఘునందన్‌ ‌దూరం
సీనియర్లకు ప్రాధాన్యత లేదని బండిపై అసంతృప్తి

ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్ర బీజేపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌వైఖరిపై గత కొంత కాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలు రఘునందన్‌ ‌రావు, ఈటల రాజేందర్‌ ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు దూరంగా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల నుంచి బజేపీలో సీనియర్‌ ‌నేతల మధ్య అసమ్మతి రగులుకుంది. బీజేపీఎల్పీ నేతగా తనను ప్రకటించాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిన విజ్ఞప్తిని బండి సంజయ్‌ ‌పట్టించుకోలేదని దీంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్న ప్రచారం జరిగింది.

ఇందుకు అనుగుణంగానే రఘునందన్‌ ‌రావు బీజేపీఎల్పీ సమావేశానికి కూడా హాజరు కాలేదు. ప్రస్తుతం పార్టీ ఎల్పీ నేతగా ఉన్న రాజాసింగ్‌ ‌ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా భాషా సమస్య కారణంగా సరైన విధంగా ఎండగట్టలేక పోతున్నారనీ, దీంతో ఎల్పీ నేతగా తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు పార్టీ వర్గాలలో ప్రచారం జరిగింది. తాజాగా, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పదాధికారుల సమావేశంలో ఎమ్మెల్యే రఘునందన్‌ ‌రావును వేదికపైకి బండి సంజయ్‌ ఆహ్వానించకపోవడంపై సైతం రఘనందన్‌ ‌రావు బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కారు.

ఇదిలా ఉండగా, మరో సీనియర్‌ ‌నేత హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌సైతం బండి సంజయ్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సమాచారం ఇవ్వకుండా ఈటల రాజేందర్‌ ‌రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేపట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. దీనికి తోడు ఈటల ఇటీవల వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుందని చేసిన వ్యాఖ్యలపై కూడా బండి సంజయ్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. బీజేపీ జాతీయ నాయకత్వం ఎలాంటి ప్రకటన చేయకుండానే ఈటల సొంతంగా ఈ విధమైన ప్రకటనలు బహిరంగంగా చేయడం పార్టీకి నష్టం చేకూరుస్తుందనీ, ఇలాంటి వ్యాఖ్యలు ఇకపై ఎవరూ చేయవద్దని బండి కాస్తంగా గట్టిగానే సూచించినట్లు సమాచారం. ఈ సంఘటనల నేపథ్యంలో పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలు రఘునందన్‌ ‌రావు, ఈటల రాజేందర్‌ ‌బండి సంజయ్‌ ‌చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్రకు దూరంగా ఉన్నారని పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.

Leave a Reply