Take a fresh look at your lifestyle.

జీహెచ్‌ఎం‌సి ఎన్నికలు.. ఇప్పుడే వొద్దు..!

  • కేటీఆర్‌కు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల మొర
  • వరద సాయంలో నేతల చేతివాటంపై ప్రజ ఆగ్రహం
  • దెబ్బ మీద దెబ్బలా దుబ్బాక వోటమి

జీహెచ్‌ఎం‌సి ఎన్నికలకు ఇప్పుడే వెళ్లొద్దంటూ గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌, ‌పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు మొర పెట్టుకున్నట్లు సమాచారం. ఓవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం జీహెచ్‌ఎం‌సి ఎన్నికల నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న సమయంలో అధికార పార్టీకి చెందిన నేతలు ఎన్నికలు ఇప్పుడే వొద్దంటూ మంత్రికి విన్నవించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత నెలలో దాదాపు వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు హైదరాబాద్‌ ‌మహా నగరాన్ని అతలాకుతలం చేశాయి. లోతట్టు వేలాది కాలనీలు ముంపునకు గురి కావడంతో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయుల య్యారు. నగరంలోని ఇంకా కొన్ని కాలనీలు నీటిలోనే మునిగి ఉన్నాయి. ముంపు ప్రాంతాల ప్రజలు ఇంకా కోలుకోక ముందే, ముంపు నష్టాన్ని, కష్టాన్ని మర్చిపోకముందే వాళ్ల దగ్గరికి వెళ్లి వోట్లు అడిగే పరిస్థితి ఉండదంటూ ఆందోళనను వెళ్ల్లగక్కినట్లు సమాచారం. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో స్వయంగా మంత్రి కేటీఆర్‌ను సైతం బాధితులు అడ్డుకున్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తమకు ఈ పరిస్థితి వచ్చిందని ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నగరంలో నీట మునిగిన కాలనీల బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ప్రతీ చోటా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు స్థానికుల తీవ్ర తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. కొన్ని చోట్ల వోట్ల సమయంలో రోజూ కనిపించే మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారంటూ ప్రజలు నిలదీశారు. కొంత మంది ఏకంగా వచ్చే ఎన్నికలలో వోట్ల కోసం వచ్చినప్పుడు మీ సంగతి చెబుతామంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. బాధితుల ఆగ్రహం నుంచి బయట పడేందుకు ప్రభుత్వం వరదల కారణంగా నిరాశ్రయులైన బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 10 వేలు ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ సాయం పంపిణీ బాధ్యతను అధికారులతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక కార్పొరేట్లకు అప్పగించారు. అయితే, వరద సాయం పంపిణిలో అధికార పార్టీకి చెందిన నేతలు చేతివాటం ప్రదర్శించారు. అధికారులను నయానాభయానా వొప్పించి అందినకాడికి తమ జేబులు నింపుకున్నట్లు పెద్ద ఎత్తున్న ఆరోపణలు వెల్లువెత్తాయి. రానున్న జీహెచ్‌ఎం‌సి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తమ అనుచరులు, కార్యకర్తలకే ఇప్పించారని అసలైన లబ్దిదారులకు వరద సాయం అందలేదని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల ఇళ్లను ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఇంకా వరద బాధితుల ఆగ్రహాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముంపునకు గురికాకపోయినా చాలా కాలనీలు, బస్తీల్లో నష్టపరిహారాన్ని ఫలహారంగా పంచి పెట్టారని కాంగ్రెస్‌ ‌పార్టీ ఆరోపిస్తున్నది. ముంపు బాధితుల నుంచి కూడా సగం వరకు టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు, నాయకులే మింగేశారంటూ  కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన మల్కాజ్‌గిరి ఎంపి రేవంత్‌రెడ్డి వరద బాధితులతో కలసి ఏకంగా జీహెచ్‌ఎం‌సి ప్రధాన కార్యాలయం ముందే పెద్ద ఎత్తున ధర్నాకుదిగారు.

వరద బాధితుల పేరుతో టీఆర్‌ఎస్‌ ‌నేతలు చేసిన అతి పెద్ద స్కాంగా ఆయన అభివర్ణించారు. దీనిపై  సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ పట్టు పడుతున్నారు. ఈ పరిస్థితి ఇలా కొనసాగుతుండగానే నువ్వా నేనా అన్నట్లు హోరాహోరీగా సాగిన దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. ఎప్పటి నుంచో అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి కంచుకోటగా ఉన్న ఆ స్థానాన్ని కైవసం చేసుకుని మంచి ఊపు మీద ఉంది. ఇదే ఊపును రానున్న జీహెచ్‌ఎం‌సి ఎన్నికలలో సైతం ఇదే ఊపును కొనసాగిస్తామని ఆ పార్టీ నేతలు అధికార పార్టీకి బహిరంగంగా సవాల్‌ ‌విసిరారు. దుబ్బాక ఊప ఎన్నికలో విజయం స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పుంజుకున్నదన్న సర్వే రిపోర్టులు అధికార పార్టీని ఇరుకున పెడుతున్నాయని ఓ నాయకుడు అభిప్రాయపడ్డారు. మరోవైపు, హైదరాబాద్‌ ‌నగరంలో ఏర్పడ్డ తాజా రాజకీయ పరిస్థితులపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీతో  కేటీఆర్‌ ‌చర్చలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రధానంగా గ్రేటర్‌ ఎన్నికలపైనే ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఎలాగూ వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎంఐఎంకు మిత్రబంధం ఉంటుంది. ఎక్కడైనా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నిలిచినా ఫ్రెండ్లీ కాంటెస్టుగానే ఉంటుంది. అయితే రాజేంద్రనగర్‌ ‌నియోజకవర్గంలో మాత్రం టీఆర్‌ఎస్‌, ఎంఐఎం ‌పార్టీల మధ్య విభేదాలు జోరందుకున్నాయి. ఎమ్మెల్యే ప్రకాశ్‌ ‌గౌడ్‌, అక్కడి ఎంఐఎం నాయకులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. అందుకే ఎంఐఎంతో పొత్తు, స్నేహబంధం ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్‌ ‌నుంచి అభ్యర్థిని నిలబెట్టాల్సిందే.. గెలిపించాల్సిందేనంటూ ఎమ్మెల్యే ప్రకాశ్‌ ‌గౌడ్‌ ‌తన కార్యకర్తలు, ముఖ్యమైన అనుచరులతో చెప్పినట్లు తెలిసింది.ఇన్ని  ప్రతికూల పరిస్థితుల నేవధ్యంలో జీహెచ్‌ఎం‌సి ఎన్నికలకు వెళ్లి ఓటమి కొని తెచ్చుకునే బదులు పరిస్థితులు సద్దుమణిగే వరకు ఆగి ఆ తరువాతనే ఎన్నికలకు వెళ్లాలని అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు, నేతలు మంత్రి కేటీఆర్‌ ‌ముందు తమ గోడును వెళ్లబోసుకున్నట్లు తెలిసింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply