Take a fresh look at your lifestyle.

కలహాల కాంగ్రెస్‌..

‌తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షడు  రేవంత్‌రెడ్డికి ఆ పార్టీ చీఫ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టడానికి ముందు నుండి, పదవి అలంకరించిన తర్వాత కూడా ఆ పార్టీ సీనియర్‌ల నుండి ఇబ్బందులు తప్పడంలేదు. ఆయనకు పిసిసి అధ్యక్ష పదవిని కట్టబెట్టినప్పటినుండి పార్టీ సీనియర్లలో చాలామంది ఆయనకు సహకార నిరాకరణ చేస్తూనే ఉన్నారు. వారందరిని కలుపుకుపోయేందుకు ఆయన ప్రతీ ఒక్కరిని వ్యక్తిగతంగా కలిసి, పార్టీ పటిష్టతకు దోహద పడాల్సిందిగా విజ్ఞప్తులు చేసినప్పటికీ, ఆయన ఏర్పాటు చేసే సమావేశాలకు కొందరు హాజరవుతే, మరి కొందరు గైర్హాజరవుతుండడంతో కాంగ్రెస్‌లో ఎప్పటిలాగానే గ్రూపులు. తగాదాలు కొనసాగుతూనే ఉంటాయన్నది స్పష్టమవుతున్నది. అధిష్టానం ఏరికోరి ఆయనకు పిసిసి అధ్యక్ష పీఠాన్ని అలంకరింపజేయటంతో అలిగిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులు, కార్యకర్తలకు తన ఇంటి తలుపులు మూసి ఉంటాయని చెప్పారు.

తనను కలుసుకోవడానికి ఎవరూ తన ఇంటికి రావద్దని బహిరంగంగానే ప్రకటించారు. అలాంటిది తాజాగా రేవంత్‌రెడ్డి ఆయన ఇంటికి( మొదటిసారిగా)  వెళ్ళడం, వారిద్దరు కలిసి మీడియాముందు ప్రత్యక్షమై,  తామిద్దరం కలిసి పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటించడం ఒక విచిత్ర పరిణామం. అంతవరకు ఎడముఖం పెడ ముఖంగా ఉన్న ఈ ఇరువురు నేతలు ఒక్కటవడంతో ఇక కాంగ్రెస్‌లో సఖ్యత వాతావరణం ఏర్పడుతుందని భావించారు. కాని, అదే సమయంలో కోమటిరెడ్డి లాగానే రేవంత్‌రెడ్డి పిసిసి చీఫ్‌పదవి చేపట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన సంగారెడ్డి ఎంఎల్‌ఏ, ‌కాంగ్రెస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌జగ్గారెడ్డి అలియాస్‌ ‌తూర్పు జయక్రాశ్‌రెడ్డి తన అసంతృప్తిని తీవ్రతరం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో శుక్రవారం కాంగ్రెస్‌ ‌ముఖ్య కార్యకర్తలు, అనుచరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌రెడ్డిపై ఉన్న అసంతృప్తిని బహిరంగ పర్చారు. తాను పేరుకు మాత్రమే పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌గా ఉన్నానని, పార్టీ తీసుకునే కార్యాచరణ ఏదీ తనకు తెలియడంలేదని, కార్యక్రమాలగురించి ముందుగా తనతో కనీసమాత్రంగా సంప్రదించడంలేదన్నది ఆయన ఆరోపణ. తాజాగా కెసిఆర్‌ ‌పుట్టినరోజున చేపట్టాల్సిన ఆందోళనపై పార్టీ ఇచ్చిన పిలుపు విషయంలో తనకు ఎలాంటి సమాచారం లేదన్న ఆవేదన ఆయన వ్యక్తపర్చారు.  ఈ నిరసన ప్రదర్శన వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముందన్న తన అభిప్రాయాన్ని తెలుసుకోకపోవడంతో ఇక పార్టీ వీడడమే మంచిదన్న అభిప్రాయానికి ఆయన వచ్చారు.

తనను సంప్రదించకపోవడం ఒక విధంగా తనను అవమానించడమేనంటూ, వ్యక్తిగతంగా తన ఇమేజ్‌ను దెబ్బతీయడానికి ఒక పథకం ప్రకారం కుట్ర జరుగుతున్నదన్నది ఆయన ఆవేదన. అంతేకాకుండా తనపైన సోషల్‌ ‌మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తాను పార్టీ వీడి, అధికార పార్టీలో చేరుతున్నానంటూ ఫోటోలు మార్ఫింగ్‌చేసి విస్తృత ప్రచారం చేస్తుండడంతో తనను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందన్నారు ఆయన . ఆ కారణంగా ఇక పార్టీలో ఎట్టిపరిస్థితిలోనూ ఇమడలేనన్న అభిప్రాయానికి ఆయన  వచ్చేశాడని తెలుస్తున్నది.  పార్టీని వీడిపోయే విషయంలో సత్వర నిర్ణయం తీసుకుంటాననికూడా ప్రకటించడంతో కాంగ్రెస్‌ ‌వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. దీంతో పార్టీ పెద్దలంతా ఒక్కొక్కరుగా ఆయన్ను బ్రతిమిలాడే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిసిసి మాజీ అధ్యక్షడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క ఆయన్ను అనునయించడానికి ప్రయత్నించారు. ఏఐసిసి కార్యదర్శి బోస్‌రాజు, శ్రీనివాసన్‌ ‌తదితరులు ఫోన్‌ద్వారా కాంగ్రెస్‌ ‌వీడవద్దని కోరారు.  తెలంగాణ ఏర్పడిన నాటినుండి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పరిస్థితి అద్వాన్నంగా తయారైంది. దీంతో కొత్త సారధి రావడంతో పార్టీలో నూతనోత్సాహం కలుగుతుందని అధిష్టానం భావించి రేవంత్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించింది. కాని. సీనియర్లతంతా ఒక్కొక్కరుగా దూరమవుతూనే ఉన్నారు.

సీనియర్లతో సంప్రదించకుండా, వారి సలహాలు, సూచనలు తీసుకోకుండా రేవంత్‌రెడ్డి ఒంటరిగానే స్వంత నిర్ణయాలు తీసుకుంటున్నారన్నది సీనియర్ల ఆరోపణ. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకుడు వి. హనుమంతరావు ది కూడా అదే ఆరోపణ. రేవంత్‌రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవిని ఇవ్వడం ఆయనకు కూడా ఏమాత్రం ఇష్టంలేదు. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా రేవంత్‌పై ఆరోపణలు చేస్తూనే వస్తున్నాడు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన్ను ప్రసన్నం చేసుకున్న  రేవంత్‌రెడ్డి జగ్గారెడ్డి  ఇంటికి ఎందుకు వెళ్ళలేదన్నది ఆయన ప్రశ్న. విచిత్రమేమంటే ఈ ముగ్గురుకూడా రేవంత్‌రెడ్డి ఆ పదవిలో కొనసాగటాన్ని మొదటినుండి ఇష్టపడనివారే.

అయితే జగ్గారెడ్డ్డితో పాటు వి. హనుమంతరావుపైన కూడా సోషల్‌ ‌మీడియాలో పలు విమర్శలు, ఆరోపణలు చోటుచేసుకున్నాయి. అదే విషయమై వి.హెచ్‌  ఆ‌గ్రహం వ్యక్తం చేస్తున్నాడు. దీనికంతకూ రేవంత్‌రెడ్డి వర్గమే కారణమన్నది ఆయన ఆరోపణ. అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తికి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం హుందాగా ఉండదని ఆయన హెచ్చరిస్తున్నారు కూడా. ఒక జాతీయ పార్టీలో ఉంటూ రేవంత్‌రెడ్డి వ్యక్తిగత ఇమేజ్‌కోసం పాకులాడుతున్నట్లు స్పష్టమవుతున్నదంటూ ఆయన తీవ్రంగా విమర్శిస్తున్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీలో ఉన్నప్పుడు ఆయన సోనియా సేన, రాహుల్‌ ‌సేన అని నామకరణం చేయాల్సిందిపోయి రేవంత్‌ ‌సేన పేర సోషల్‌ ‌మీడియాలో అకౌంట్లు తెరవడాన్ని తప్పు  పడుతున్నాడు. ఆయన ప్రవర్తన ఇలానే కొనసాగితే పార్టీ మరింతగా దెబ్బతింటుందని ఆరోపిస్తున్న విహెచ్‌ ‌తనపైన సోషల్‌ ‌మీడియాలో వచ్చిన విమర్శలు, ఆరోపణలపై తాజాగా జూబ్లిహిల్‌ ‌పోలిస్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశాడు. మొత్తంమీద కలహాల కాంగ్రెస్‌గా దానికున్నపేరు శాశ్వతమవుతున్నది. రానున్న ఎన్నికలలోగా ఇంకా ఎలాంటి పరిణామాలు చేసుకుంటాయోమరి.

Leave a Reply