అమరావతి,జూన్ 17 : ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించాలని సభలో టీడీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. ప్రభుత్వం అప్రోప్రియేషన్ బిల్ ముందు పెట్టాలని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. యనమల వాదన భిన్నంగా ఉందని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆక్షేపించారు. గతంలో అప్రోప్రియేషన్ ముందు పెట్టిన సందర్భం లేదని బుగ్గన తెలిపారు. తాను స్పీకర్‌గా, సభా వ్యవహారాల మంత్రిగా పని చేశానని, ప్రభుత్వం ఏ బిల్ ముందు పెట్టాలి అనే అంశంపై ఓటింగ్ పెట్టుకోవచ్చని యనమల తెలిపారు. అయితే చివరకు బిల్లు పెట్టి ఆమోదించిన తరవాతనే సభ వాయిదా పడిన సందర్బాలను మంత్రి గుర్తు చేశారు. ఇదిలావుంటే రాష్ట్రంలో ఇసుక మాఫియాను కట్టడి చేస్తున్నామని..
నూతన పాలసీ ద్వారా పారదర్శకంగా ఇసుక విక్రయాలు చేస్తున్నామని కౌన్సిల్లో రాష్ట్ర భూగర్భగనుల శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు ఇసుక వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన ఘటనలపై 1386 కేసులు పెట్టామన్నారు. 2500 మందిపై చర్యలు తీసుకున్నామని… అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న1752 వాహనాలను సీజ్ చేశామని పెద్దిరెడ్డి తెలిపారు. ఎడ్ల బండ్లకు ఉచితంగా ఇసుకను ఇస్తున్నామన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ఇసుకను బుక్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. శాస్త్రీయంగా ఇసుకు పాలసీని అమలు చేస్తున్నామని… గడిచిన అయిదేళ్ళలో టీడీపీ ఇసుకను దోపిడీ చేసిందన్నారు. తాము ఇసుక దోపిడీని అడ్డుకోవడాన్ని టీడీపీ సహించలేక పోతోందని పెద్దిరెడ్డి అన్నారు.