Take a fresh look at your lifestyle.

భూసార పరీక్షలు నిర్వహించి.. రైతులు తగు పంటలు వేసుకునేలా చేయాలి

వికారాబాద్‌ : ‌జిల్లాలో రైతులు అత్యధిక శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారని, వారికి భూసార పరీక్షలు నిర్వహించి అందుకనుగుణంగా పంటలు వేసుకునేలా మేలు చేయాలని జిల్లా కలెక్టర్‌ ‌పౌసమి బసు జిల్లా అధికారులకు ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ ‌హాల్లో వ్యవసాయ శాఖ అధికారులు ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ‌పౌసమి బసు మాట్లాడుతూ వికారాబాద్‌ ‌జిల్లాలో రైతులు గ్రామీణ ప్రాంతాల్లోనే 85% అత్యధికంగా ఉన్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి అనగా ఆగ్రా, బెంగళూరు, మహారాష్ట్ర, నాసిక్‌ ‌నుండి మనము కూరగాయలు దిగుమతి చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. అవే కూరగాయలను మనము మన జిల్లాలో భూసార పరీక్షలు నిర్వహించి తద్వారా తగిన పంటలు పండించి రాబోవు కాలంలో నియంత్రిత పంటల సాగుతో రైతులకు మేలు కలుగుతుందని అధికారులకు తెలిపారు. రైతుల సంక్షేమం గురించి ఆలోచిస్తున్న మన ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌స్వాతంత్య్రం తర్వాత పంటల సాగుపై శాస్త్రీయ విధానంతో పంటల సాగుబడి పెంచాలంటే ఏ భూమిలో ఏ పంట వేస్తే అధిక దిగుబడి అధిక లాభాలు వస్తాయో ఆ మేరకు క్లస్టర్ల వారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను తయారు చేస్తున్నట్లుగా తెలిపారు.

మొక్కజొన్న పంటలు వేసిన రైతులకు రైతు బంధు పథకం వర్తించదని తెలిపారు. బంగాళా దుంప పంట వికారాబాద్‌ ‌జిల్లాలో అత్యధిక దిగుబడిని తెచ్చిపెడుతుందనే విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. నూనె గింజలు, కంది పంటలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని కోరారు. పొద్దుతిరుగుడు పంటకు ప్రణాళిక సిద్ధం చేయవలసిందిగా అధికారులను కోరారు. మినుములు, శెనగలు వికారాబాద్‌ ‌జిల్లాలో ప్రస్తుతము తక్కువగా పండించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో మొత్తం 07 జిన్నింగ్‌ ‌మిల్స్ ఉన్నట్లు తెలిపారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి గ్రామస్థాయి అధికారులను సమన్వయ పరుచుకుంటూ రైతులతో సమావేశాలు నిర్వహించుకుంటూ వారితో గ్రామస్థాయి పంటల ప్రణాళికలు తయారు చేస్తూ రైతుల్లో విశ్వాసాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. వేరే రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో కంది పంట దిగుబడి తక్కువగా ఉందని, మునుపు వేసిన దానికన్నా ఎక్కువ కంది పంట వేసేలా రైతులలో చైతన్యం కలిగించాలని అధికారులకు సూచించారు. మొక్కజొన్న పంటకు అధిక ప్రాధాన్యతను ఇవ్వకపోవడమే మంచిదని తెలిపారు. ప్రభుత్వ పథకాలను పొందాలంటే ప్రభుత్వ సూచనలను పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ‌కలెక్టర్లు మోతీలాల్‌ ‌చంద్రయ్య జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌ ఉద్యానవన శాఖ అధికారిణి మాలిని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy