- కాల్పులు జరిపిన పోలీసులను హత్యా నేరం క్రింద అరెస్ట్ చేయాలి
- పత్రికా ప్రకటన విడుదల చేసిన మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటి అధికార ప్రతినిధి జగన్
భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్ 20 : సికిద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరసన తెలుపుతున్న నిరుద్యోగ యువతపై జరిపిన కాల్పులను ఖండించాలని, కాల్పులు జరిపిన పోలీసులను మత్యానేరం క్రింద అరెస్ట్ చేయాలని, మరణించిన రాకేష్ కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని మావోయిస్టులు డిమాండ్ చేసారు. ఈ మేరకు మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటి అధికార ప్రతినిధి జగన్ పేర విడుదల చేసిన పత్రికా ప్రకటన ద్వారా డిమాండ్ చేసారు. దుష్ట అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని వారు కోరారు. అగ్నిపథ్ పథకం పేరుతో యువతరాన్ని మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ దుష్ట పతాకాన్ని నిలదీయాలని, అధికారంలోకి వొస్తే సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని మోసపూరిత వాగ్దానాలు చేసి హిందుత్వ బిజెపి నరేంద్రమోడీ నాయకత్వంలో అధికారాన్ని చేపట్టి 8 ఏళ్ళు గడుస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.
యువతీ, యువకులకు నిరుద్యోగ అవకాశాలు కల్పించకుండా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ సామ్రాజ్య వాద బహుళ జాతీ సంస్థలకు, కార్పొరేట్ శక్తులకు దేశ సంపదలను కట్టపెడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తుందని ప్రకటన ద్వారా తెలిపారు. దేశాన్ని హిందుత్వ రాజ్యంగా మార్చారని లేఖ ద్వారా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దుష్ట పథకాల్లో బాగమైన అగ్నిపథ్ పథకం ఒకటని, దేశంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు జారీ చేయకుండా రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అగ్నిపథ్ పథకాన్ని ముందుకు తీసుకువొచ్చారని విమర్శించారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలను అణచివేయడానికి మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించే పథకంలో భాగంగా అగ్నిపథ్ పథకాన్ని ముందుకు తీసుకువచ్చిందని ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందొళనకు దిగిన నిరుద్యోగ యువకులపై పోలీస్ కాల్పులను జరిపి ఒక యువకుడి ప్రాణాలు తీసి 13 మంది యువకులను గాయపరిచారని లేఖలో పేర్కొన్నారు. మరణించిన యువకుడికి రెండు కోట్ల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని లేఖ ద్వారా వారు డిమాండ్ చేసారు.