Take a fresh look at your lifestyle.

వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో కొరోనా పాజిటివ్‌ ‌కేసులతో ఆందోళన

వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో కొరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో జనగామతో పాటు తాజాగా ములుగు జిల్లాలో కూడా రెండు పాజిటివ్‌ ‌కేసులు వెలుగుచూడడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వరంగల్‌ అర్బన్‌, ‌రూరల్‌ ‌జిల్లాల్లో పాజిటివ్‌ ‌కేసులు ఏవీ నమోదు కాకపోయినప్పటికీ సమీపంలో ఉన్న జిల్లాల్లో పాజిటివ్‌ ‌కేసులు వెలుగు చూస్తుండడం పట్ల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మొదట కరీంనగర్‌లో ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రచారకుల ద్వారా పాజిటివ్‌ ‌కేసులు మొదలవగా వారితో పాటు సహవాసం చేసిన మరో వ్యక్తికి కూడా పాజిటివ్‌గా తేలింది. వీరందరినీ కూడా హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలోని ఐసొలేషన్‌ ‌వార్డుకు చికిత్స నిమిత్తం తరలించారు. తాజాగా వీరు మొదట ఢిల్లీ నుంచి రామగుండంలో రైలు దిగి ఆటోలో ప్రయాణించిన ఆటో డ్రైవర్‌కు కూడా పాజిటివ్‌గా తేలడంతో వారు ఎవరెవరినీ కలిశారనే ఆంశం ఆసక్తికరంగా మారింది. జనగామ జిల్లాలో కూడా ఓ వ్యక్తి నిజామొద్దీన్‌ ‌మత ప్రార్థనలకు వెళ్లి రావడం అతనికి కొరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆ వ్యక్తి నిర్వహించే మటన్‌ ‌షాపులో సన్నిహితంగా ఉండే వారందరి వివరాలు సేకరించడంతో పాటు అనుమానిత లక్షణాలు కనిపించిన అందరినీ హోం క్వారంటైన్‌కు పంపించారు.

తాజాగా ములుగు జిల్లాలో కూడా మరో రెండు కొరోనా పాజిటివ్‌ ‌కేసులు వెలుగు చూసినట్లు జిల్లా కలెక్టర్‌ ఎన్‌.‌కృష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో వరంగల్‌ ఉమ్మడి జిల్లాల్లో ఉన్న వారందరికి అనుమానం మొదలైంది. లాక్‌డౌన్‌ ‌కన్నా ముందే ఉమ్మడి జిల్లాలో రాకపోకలు నిరాటంకంగా కొనసాగిన నేపథ్యంలో అప్పుడు ఉమ్మడి జిల్లాలో ప్రయాణించిన వారు ఆందోళన చెందుతున్నారు. పలు ప్రభుత్వ కార్యాలయాలు వివిధ వ్యాపార కార్యకలాపాల కోసం ఉమ్మడి జిల్లాలో ప్రయాణించే వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు వెలుగు చూస్తున్న పాజిటివ్‌ ‌కేసులన్నీ కూడా లాక్‌డౌన్‌ ‌కన్నా ముందే వారికి సోకి ఉంటుందని అధికారులు భావిస్తున్న నేపథ్యంలో వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లాలో కూడా నిజామొద్దీన్‌ ‌మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి వివరాలు పూర్తి స్థాయిలో అధికారులు స్వీకరించి అందులో చాలా మందికి కొరోనా పరీక్షలు నిర్వహించడం వారిలో ఎవరికీ కొరోనా పాజిటివ్‌ ‌లక్షణాలు లేకపోవడం కాస్త ఊరట కలిగించే అంశమైనప్పటికీ ఇంకా మరి కొంత మంది వివరాలు అధికారులకు దొరకలేదు. దీంతో అధికారులు స్వచ్ఛందంగా నిజామొద్దీన్‌ ‌మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారందరు ముందుకు రావాలని కోరుతున్నారు. అయితే వీరిలో కొందరిని కుటుంబ సభ్యులే బయటకు రాకుండా ఆపుతున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించి అర్బన్‌ ‌జిల్లా నుండి నిజామొద్దీన్‌ ‌మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన మిగతా వారిని కూడా గుర్తించి వారందరికీ కొరోనా పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందు••ంటే ఇప్పటికే మర్కజ్‌ ‌మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన చాలా మందికి కొరోనా పాజిటివ్‌గా తేలడం కొరోనా లక్షణాలు తొందరగా బయటపడకపోవడంతో వారు తమకు ఎటువంటి సమస్యలు లేవని మరికొందరితో సన్నిహితంగా ఉండే అవకాశాలున్నాయి. ఏదేమైనప్పటికీ ఉమ్మడి జిల్లాలో కొరోనా పాజిటివ్‌ ‌కేసులు కూడా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తమవ్వాల్సిన అవసరం ఉంది. వరంగల్‌ ఎం‌జిఎం ఆసుపత్రిలో అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కొరోనా లక్షణాలు లేని వారిని ఇంటికి పంపిస్తుండగా అనుమానితులందరినీ క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు ఆదేశిస్తున్నారు. కొందరినీ బలవంతంగా క్వారంటైన్‌లో ఉంచినప్పటికీ తరచుగా బయటికి వస్తుండడంతో స్థానిక ప్రాంతాల్లో గొడవలు జరుగుతున్నాయి. క్వారంటైన్‌లో ఉండే వారిపై మరింత శ్రద్ధ వహించి వారు మరొకరిని కలువకుండా భద్రతా ఏర్పాట్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అర్బన్‌ ‌జిల్లా వ్యాప్తంగా సుమారు 32 మంది మర్కజ్‌ ‌మత ప్రార్థనలకు వెళ్లి రాగా వారిలో కొందరికీ ఇప్పటికే అన్ని రకాల పరీక్షలు నిర్వహించి కొరోనా లక్షణాలు లేవని తేల్చారు. గురువారం కూడా మరికొంత మంది అనుమానితులకు అధికారులు పరీక్షలు నిర్వహించి రక్తనమూనాలను హైదరాబాద్‌ ‌గాంధీ ఆసుపత్రికి పంపించి వారందరినీ క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించడం జరిగింది. వీరు మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన అనంతరం కొరోనా లక్షణాలు బయట పడడంతో వారు అంతకు ముందే ఎవరెవరినీ కలిశారనే అంశం కీలకంగా మారింది. ఏదేమైనప్పటికీ వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం కొరోనా కట్టడికి మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy