Take a fresh look at your lifestyle.

జీతాలు అందక ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన

ప్రతినెలా ఆలస్యం అవుతున్నాయని నిరసన
ఆర్టీసీలో జీతాలు ఆలస్యమవుతుండడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. నెల గడిచి 16 రోజులు అవుతున్నా..ఇంతవరకు జీతాలు ఇవ్వకపోవడంతో పూట గడవడం ఇబ్బందిగా ఉందని తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా ఇదే తీరు కొనసాగు తున్నదని, జూన్‌ ‌వొచ్చి 16 రోజులైనా ఉద్యోగులకు మే నెల వేతనాలు ఇంకా ఖాతాల్లో జమ కాలేదని, దీంతో రుణ వాయిదాల చెల్లింపు, ఇతర అవసరాలకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారు. లాక్‌డౌన్‌ ‌సమయంలో పరిస్థితి ఆధ్వాన్నంగా తయారైందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వొచ్చినప్పటి నుంచి ఆర్టీసీలో మొదటి తారీఖు జీతం అనే ముచ్చట ఎప్పుడో మర్చిపోయినట్లు ఉద్యోగులు బాధను వ్యక్తం చేస్తున్నారు.

గత్యంతరం లేక ఆందోళనకు దిగుతున్నామని చెప్పారు. జీతాల కోసం కార్మికులు అన్ని డిపోల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. కార్మికులు, ఉద్యోగుల ఆందోళనకు యూనియన్లు మద్దతు పలికి సంఘీభావం తెలుపుతున్నాయి. కాగా సకాలంలో జీతాలు అందనందుకు నిరసనగా గరువారం రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నా నిర్వహిస్తునట్లు తెలంగాణ మజ్దూర్‌ ‌యూనియన్‌ ‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.హనుమంతు తెలిపారు. రోజుకు 16 గంటల పాటు పనిచేస్తున్నా జీతాలు సకాలంలో చెల్లించడం లేదని ఆరోపించారు. ధర్నాలో సిబ్బంది పెద్దసంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply