Take a fresh look at your lifestyle.

తెలంగాణ నీటి వాడకంపై సర్వత్రా ఆందోళన

ప్రభుత్వం చేష్టలుడిగిందంటున్న నేతలు
రైతులకు మేలు చేయడంలో విఫలమయ్యారన్న జివి
విజయవాడ,జూలై 8 : తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాల్లో 50 శాతం వాటా ఉందని చెబుతున్న నేపథ్యంలో కుడి కాలువకు సాగునీటి సమస్య మరింత జటిలం కానున్నందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. 66 శాతం కుడి కాలువకు, 34 శాతం తెలంగాణకు అని రాష్ట్ర విభజన సందర్భంగా నిర్ణయించినా దీనిని అక్కడి ప్రభుత్వం తోసిపుచ్చుతున్నది. తెలంగాణ ప్రభుత్వం దూకుడుకు ఎవరూ అడ్డుకట్టవేయలేక పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖరాసి చేతులు దులుపుకుందని రైతులు ఆరోపిస్తున్నారు. కేంద్రం ద్వారా తెలంగాణపై ఒత్తిడి తేవడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సాగర్‌ ‌నుంచి 37 టీఎంసీల నీటిని విద్యుత్‌కు వాడేసి వృథా చేసింది. రెండడుగుల నీటి మట్టం తగ్గిపోయింది. పులిచింతల నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి 7,200, సాగర్‌ ‌నుంచి 62,000 క్యూసెక్కులకు మించి వినియోగించే అవకాశం లేదు. లేకుంటే రెండు మూడు రోజుల్లోనే సాగర్‌, ‌పులిచింతల జలాశయాలను ఖాళీ చేసి ఉండేది.సాగర్‌ ‌కుడి కాల్వ ఆయకట్టు రెండు జిల్లాల్లో 15 నియోజకవ ర్గాలకు విస్తరించి ఉంది.

ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 15 ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు సాగర్‌ ‌జలాల విషయంలో ఒకరిద్దరు మినహా మిగతా వారు స్పందించిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో రైతులకు ఏంచేశారని, ఏం సాధించారని ఈ ముఖ్యమంత్రి రైతు దినోత్సవాలు నిర్వహిస్తున్నారని నరసరావుపేట పార్లమెంట్‌ ‌నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే రాష్ట్రాన్ని రెండో స్థానంలో నిలిపినందుకా అని నిలదీశారు. తన స్వార్థ ప్రయోజ నాలు, తన ఆస్తులను కాపాడుకోవడానికి జగన్‌ ‌రెడ్డి ఏపీ హక్కులను తాకట్టుపెట్టారని విమర్శించారు.

ఎన్నికలకు ముందు వేలకోట్లు తీసుకొని, అందుకు ప్రతిగా పొరుగు ముఖ్యమంత్రికి రైతుల హక్కులను ధారాదత్తం చేశారని ఆయన ఆరోపించారు. నారుమళ్లకు నీళ్లు ఎప్పుడొస్తాయా అని రైతులు ఎదురు చూస్తుంటే, 6.5 టీఎంసీల నీటిని సముద్రంపాలు చేస్తారా అని మండిపడ్డారు. నీటిని వృథా చేయకుండా చెరువులు నింపాలనే ఆలోచన ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు క్రాప్‌ ‌హాలిడే ప్రకటించకుండా, ప్రభుత్వం తక్షణమే అన్నదాతలతో చర్చలు జరపాలన్నారు. తన హాయాంలో రైతులను మోసగించిన జగన్‌ ‌రెడ్డి తక్షణమే వారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని జీవీ ఆంజనేయులు డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply