Take a fresh look at your lifestyle.

బీరుట్‌ ‌పేలుళ్లతో విశాఖపై ఆందోళన

ఇక్కడి నుంచే అమ్మోనియం నైట్రేట్‌ ఎగుమతులు
పూర్తి భద్రత ఉందంటున్న అధికారులు

విశాఖపట్టణం,ఆగస్ట్ 7 : ‌మన దేశమంతటికీ అమ్మోనియం నైట్రేట్‌ ఎగుమతి, దిగుమతులు విశాఖ పోర్టు నుండే జరుగుతాయి. నిల్వ చేసే ప్రదేశం అటు పోర్టు, ఇటు విమానాశ్రయం, అంతకన్నా కీలకమైన తూర్పు నావికాదళ స్థావరం మధ్యలో వుండడం ఆందోళనకరమైన విషయం. చుట్టూ జనావాసాలు వుండంతో మరింత భయం కలుగుతోంది. ఇప్పటికే ఎల్‌.‌జి పాలిమర్స్ ‌ప్రమాదం, ఆ తరువాత ఫార్మా సిటీ, సాల్వెంట్‌ ‌పరిశ్రమలో అగ్ని ప్రమాదాలతో విశాఖ జిల్లా వాసులు భీతిల్లిపోతున్నారు. అమ్మోనియం నైట్రేట్‌ ‌నిల్వలు నిబంధనలకు లోబడిన పరిమితిలో మాత్రమే అనుమతించాలి. పూర్తి స్థాయి భద్రతా ప్రమాణాలను పాటించేలా సంబంధిత అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని ప్రమాదాలు సంభవించవచ్చు కనుక గోడౌన్లు జనావాసాలకు దూరంగా తరలించాలి. ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడడం ప్రభుత్వాల బాధ్యత. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాకుండా ఇప్పుడే జాగ్రత్త పడాలి. నిపుణలతో వెంటనే తనిఖీలు చేపట్టాలి. విశాఖను పాలనా రాజధాని అని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం పొంచి వున్న ఈ ముప్పును గమనించి స్పందించాలి. లెబనాన్‌ ‌రాజధాని బీరూట్‌లో భారీ పేలుడు సంభవించిన నేపథ్యంలో పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాముల్లో ప్రమాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ పేలుళ్లకు ప్రధాన కారణం అమ్మోనియం నైట్రేట్‌ అని భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు విశాఖ పోర్టులో అమ్మోనియం నైట్రేట్‌ ‌నిల్వల కారణంగా అలాంటి ప్రమాదమే జరిగే అవకాశాలు ఉన్నాయా? అన్న విషయం గురించి సందేహాలు మొదలయ్యాయి.

ఇక విశాఖ పోర్టులో అమ్మోనియం నిల్వలు ఉండవని అక్కడ కేవలం హ్యాండ్లింగ్‌ ‌మాత్రమే జరుగుతుందని విశాఖ పోర్టు ఉన్నతాధికారులు తెలిపారు. 20ఏళ్లుగా ఎలాంటి ప్రమాదాలు జరగలేదు స్పష్టం చేశారు. నిర్దిష్ట సమయంలో పకడ్బందీగా అన్‌లోడ్‌ ‌చేస్తామని, పేలుళ్లు జరిగే పరిస్థితుల లేవు అని నిపుణులు, అధికారులు తెలిపారు. దేశంలోని వివిధ నౌకాశ్రయాలు సురక్షితం కానందువల్లే కేంద్ర ప్రభుత్వం విశాఖ పోర్టులో మాత్రమే అమ్మోనియం నైట్రేట్‌ ‌దిగుమతికి అనుమతులు జారీచేసిందని అధికారులు తెలిపారు. దీని వల్ల నగరానికి ఎలాంటి ముప్పు వాటిల్లదని పలువురు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాల మధ్య అతి తక్కువ వ్యవధిలోనే విశాఖ నుంచి ఆయా రాష్టాల్రకు ఎగుమతి చేస్తున్నందున అమ్మోనియం నైట్రేట్‌తో విశాఖకు ఎలాంటి ప్రమాదం ఉండదని వారు భరోసా ఇస్తున్నారు. విశాఖలో సురక్షితమనే కేందప్రభుత్వం అనుమతినిచ్చినట్లు తెలిపారు. ఎక్కడబడితే అక్కడ నిల్వ ఉంచేందుకు సురక్షితం కానందున, పెట్రోలియం పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (పెసో) దీని రవాణాపై పరిమితులతో కూడిన నిషేధం విధించింది. అమ్మోనియం నైట్రేట్‌కు ఏమైనా రసాయనాలు కలిస్తేనే పేలుడు సంభవించే ప్రమాదం ఉంది.

అందుకే దీని ఎగుమతి దిగుమతుల పైనా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించింది. సురక్షిత చర్యలు తీసుకుంటున్న విశాఖపట్నం పోర్టు ట్రస్టు (వీపీటీ)కు మాత్రమే అనుమతులిచ్చింది. దీంతో 20 ఏళ్లుగా ఇక్కడ దిగుమతి జరుగుతోంది. ఇంతవరకూ ఇక్కడ ఎలాంటి ప్రమాదం సంభవించలేదని తెలిపారు. సురక్షితంగా హ్యాండ్లింగ్‌ ‌చేసే సౌకర్యం ఉన్నందు వల్లే విశాఖలో దిగుమతులు నిర్వహిస్తున్నాం. పోర్టులో ఏమాత్రం నిల్వ చేసేందుకు అవకాశం ఉండదు. నౌక వచ్చిన కొద్దిసేపటిలోనే ఇక్కడి నుంచి ఏజెన్సీ ద్వారా గోడౌన్లకు వెళ్లిపోతుంటుందని తెలిపారు. విశాఖపోర్టు లో పేలుడు జరిగే పరిస్థితులు లేవని విశాఖ షిప్పింగ్స్ ఎం‌డీ శ్రవణ్‌ అన్నారు. భారత్‌లో అమ్మోనియం నైట్రేట్‌ను ఎక్కువగా ఎరువులకు, బొగ్గు గనుల్లో మాత్రమే వినియోగిస్తున్నారు.పేలుడు జరగాలంటే ఏదైనా రసాయనంతో కలవాలి. ఇవన్నీ ఇక్కడ జరిగే ప్రసక్తేలేదు.నిబంధనల మేరకే 20 ఏళ్లుగా అమ్మోనియం నైట్రేట్‌ ‌నిల్వలు, హ్యాండ్లింగ్‌, ఎగుమతికి సంబంధించిన ఏజెన్సీగా వ్యవహరి స్తున్నట్లు వెల్లడించారు.

Leave a Reply