- బార్లు, సినిమాలకు లేని కొరోనా స్కూళ్లకు ఎక్కడిది?
- రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ టీచర్ల ఆందోళన
- స్కూళ్ల మూసివేతపై మండిపాటు
జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు ఆందోళన నిర్వహించారు. రాష్టవ్యాప్తంగా వీరు ఆందోళనలకు దిగారు. స్కూళ్లను మూసేయవద్దని చెప్పారు. దీంతో తాము రోడ్డున పడ్డామని, గతేడాదిగా తమకు జీతాలు లేక ఇంట్లోనే పస్తులు ఉన్నామన్నారు. ఈ సందర్భంగా టేస్మ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి వి•డియాతో మాట్లాడుతూ.. కోవిడ్ పేరు చెప్పి ప్రైవేట్ స్కూళ్లు బంద్ పెట్టడం అన్యాయమన్నారు. సినిమా హాల్స్, బార్లు తెరిచి ఉంటే కొరోనా రాదా? అని ప్రశ్నించారు. విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడకు వెళ్లరా? గురుకులాల్లో కొరోనా వొస్తే తమకెందుకు ఈ శిక్ష అని ప్రశించారు. ప్రైవేట్ స్కూల్స్ కొరోనా నిబంధనలు పాటిస్తున్నాయి. స్థానికంగా చర్యలు తీసుకోకుండా వ్యవస్థను మూయడం దారుణం. కొరోనా కట్టడి చేయాలంటే అన్ని వ్యవస్థలను బంద్ చేయండని మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తమను ఆదుకోవాలంటూ టీచర్లు.. బాబాసాహెబ్ బీ.ఆర్. అంబేద్కర్‌కు వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థలపై చిన్నచూపు చూస్తుందని శంషాబాద్ ప్రైవేట్ ఉద్యోగ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌బీ నగర్ నుంచి శంషాబాద్ బస్టాండ్ వరకు నల్లబ్యాడ్జీలు, ప్లకార్డులతో ప్రైవేట్ టీచర్లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రైవేటు టీచర్లు మాట్లాడుతూ.. బార్లు, వైన్స్‌లు, పలు వాణిజ్య వ్యాపార సంస్థలు తెరిస్తే రాని కొరోనా.. స్కూళ్లు తెరిస్తేనే వొస్తుందా అని ప్రశ్నించారు. మూసివేసిన స్కూళ్లను వెంటనే తెరిచి.. ప్రైవేట్ టీచర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శంషాబాద్ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్లు ఊడ్చి నిరసన వ్యక్తం చేశారు.
ప్రైవేటు టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జనగామ, జగిత్యాల, కోరుట్ల, తదితర ప్రాంతాల్లో కూడా టీచర్లు ఆందోళనకు దిగారు. జనగామ జిల్లా కేంద్రంలో ప్రైవేటు టీచర్స్ ఆధ్వర్యంలో ఆర్టీసీ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. కొరోనా సమయంలో ఇబ్బందులు పడ్డామని…జీతాలు లేక జీవచ్చవంలా పడి ఉన్నామని తమ సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని ప్రైవేటు టీచర్లు డిమాండ్ చేశారు.