Take a fresh look at your lifestyle.

కాంట్రాక్ట్ ‌నర్సుల ఆందోళన

  • ఉద్యోగాల నుంచి తొలగించడంపై ఓయూలో నిరసన.. అరెస్ట్ ‌చేసిన పోలీసులు
  • గాంధీ భవన్‌ ‌వద్ద ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత

తమను ఉద్యోగం నుంచి తొలగించడంపై ఓయూలో నిరసన తెలిపేందుకు వొచ్చిన కాంట్రాక్టు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. కోవిడ్‌ ‌సమయంలో సేవలు చేయించుకొని, ఇప్పుడు తమను తొలగించడం అన్యాయమని నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస సమాచారం ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి తాము కొరోనా రోగులకు వైద్యసేవలందించామన్నారు. ఇప్పుడు తాము ఎలా బ్రతకాలని ఆవేదన వ్యక్తం చేస్తూ నర్సులు ఓయూలో నిరసనకు దిగారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని అంబర్‌పేట్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం 1640 మంది కాంట్రాక్ట్ ‌నర్సులను విధుల నుంచి తొలగించడంపై నర్సులు హెచ్‌ఆర్సీనీ కూడా ఆశ్రయించారు.

గాంధీ భవన్‌ ‌వద్ద ర్యాలీని అడ్డుకున్న పోలీసులు..ఉద్రిక్తత
కొరోనా కష్టకాలంలో తాము ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తే తమను ప్రభుత్వం అన్యాయంగా తొలగించిందంటూ కాంట్రాక్ట్ ‌నర్సులు శుక్రవారం డీఎంహెచ్‌ఓ ‌కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ర్యాలీగా బయల్దేరారు. ఈ క్రమంలో పోలీసులు వారిని గాంధీభవన్‌ ‌వద్ద అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు, నర్సుల మధ్య జరిగిన తోపులాటలో పలువురు గాయాల బారిన పడ్డారు. దీంతో గాంధీభవన్‌ ‌పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. తమను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలంటూ కాంట్రాక్ట్ ‌నర్సులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Leave a Reply