హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 5: ప్రజాతంత్ర తెలంగాణ దినపత్రిక, వార పత్రిక నిరంతరం ప్రచురితమై 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడం అభినందనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. స్థానిక అర్అండ్బి గెస్ట్ హౌజ్‌లో గురువారం ప్రజాతంత్ర క్యాలెండర్, డైరీ-2023ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులను, పలువురును ఉద్దేశించి మాట్లాడుతూ దేవులపల్లి అమర్ వంటి ఎంతో మంది సీనియర్ జర్నలిస్టుల సారథ్యంలో ప్రజాతంత్ర ప్రజల సమస్యలను వెలుగులోకి తెస్తుందని, ఉద్యమ వార్తలకు ప్రతిబింబంగా ఉందని అన్నారు.
అనేక వ్యయప్రాయాసాలను భరించి పత్రికను ప్రచురిస్తున్న ఎడిటర్, పబ్లిషర్ దేవులపల్లి అజయ్‌ను ప్రశంసించారు. పత్రిక, మీడియా రంగాలు కూడా క్యాలెండర్, డైరీలను ప్రజలకు ఉచితంగా అందజేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాతంత్ర గెస్ట్ ఎడిటర్ మండువ రవీందర్రావు, బ్యూరో చీఫ్ వంగ నారాయణ రెడ్డి, పాత్రికేయులు ఎన్.బుచ్చిరెడ్డి, పి.కిరణ్ రెడ్డి, డాక్టర్ ఎస్.రాజన్న, డాక్టర్ ఆర్.ఆదిరెడ్డి, పి.వేణు మాధవ్, వనం శ్రీకాంత్, రామ్మోహన్, రమేష్, బి.శ్రీనివాస్, ప్రెస్‌క్లబ్ ఉపాధ్యక్షుడు దుర్గా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.