Take a fresh look at your lifestyle.

టిఆర్‌ఎస్‌కు కమ్యూనిస్టుల అండ

కేవలం ఒక ప్రాంతంలో జరిగే ఉప ఎన్నికపై ఇవ్వాళ యావత్‌ ‌దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్నది. సార్వత్రిక ఎన్నికలకు ఒక సంవత్సరకాలం ఉండగా ఏర్పడిన ఈ ఉప ఎన్నిక ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ ఖాతాలో వేసుకునేందుకు తమ శక్తియుక్తులతో ముందుకు పోతున్నాయి. వాస్తవంగా ఈ ఉప ఎన్నిక కావాలని సృష్టించిందేనన్న అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. మరి కొద్ది రోజుల్లో సాధారణ ఎన్నికలు జరుగాల్సి ఉండగా ఎవరి సత్తా ఏమిటన్నది తేల్చుకునేందుకే దీన్ని ముందుకు తీసుకువొచ్చారన్నది రాజకీయవేత్తల అభిప్రాయం. తెలంగాణపై కాషాయ జంఢా పాతాలని బిజెపి చాలా కాలంగా ప్రణాళికను రచిస్తున్న విషయం తెలియందికాదు. ఇప్పటికే రెండు ఉప ఎన్నికల్లో తన సత్తాను చాటుకున్న బిజెపి ఈ ఉప ఎన్నికద్వారా రాబోయే ఎన్నికల్లో తమదే విజయంగా చెప్పాలనుకుంటోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటివరకు కాంగ్రెస్‌, ••మ్యూనిస్టు, టిఆర్‌ఎస్‌ల హవా నడిచింది. 1967లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఆరు సార్లు కాంగ్రెస్‌ ‌గెలువగా, అయిదు సార్లు సిపిఐ, ఒకసారి టిఆర్‌ఎస్‌ ‌విజయం సాధించాయి.

నియోజకవర్గం ఏర్పడినప్పుడు మొదటిసారిగా కాంగ్రెస్‌ ఈ ‌స్థానంనుండి గెలుపొందింది. నాడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాల్వాయి గోవర్థన్‌రెడ్డి 1985వరకు ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. ఆ తర్వాత మళ్ళీ ఈ నియోజకర్గంలో కాంగ్రెస్‌ ‌గెలుపొందడానికి పద్నాలుగేళ్ళ సమయం పట్టింది. 2018లో ఇక్కడ అధికార టిఆర్‌ఎస్‌ ‌ముందస్తు ఎన్నికలకు పోవడంతో ఏర్పడిన పోటీలో అప్పటివరకు ఎంఎల్సీగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎంఎల్‌ఏగా పోటీ చేసి గెలిచారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా 2014లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన టిఆర్‌ఎస్‌ ‌నేత కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పైన సుమారు 22 వేల 272 వోట్ల మెజార్టీతో రాజగోపాల్‌రెడ్డి గెలుపోందారు. ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డి తన ఎంఎల్‌ఏ ‌పదవికి రాజీనామా చేసి, బిజెపిలో కలవడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమయింది. ఈ నియోజకవర్గంలో కమ్యూనిస్టుల ప్రభావం కూడా బాగానే ఉంది. 1985 నుండి అయిదు సార్లు జరిగిన ఎన్నికల్లో సిపిఐ పార్టీ ఇక్కడ విజయం సాధిస్తూ వొచ్చింది. ఆ విధంగా ఈ నియోజకవర్గంపైన కాంగ్రెస్‌, ‌సిపిఐ, టిఆర్‌ఎస్‌ ‌ప్రభావం ఉండడంతో ఆ పార్టీలు ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంగా ఈ ఉప ఎన్నికల్లో పాల్గొంటున్నాయి.

అయితే 2018లో రాజగోపాల్‌రెడ్డి గెలుపులో ఆ నాటి ప్రజా కూటమి కృషి లేకపోలేదు. ఆనాడు టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌, ‌తెలంగాణ జనసమితి, టిడిపి, సిపిఐ పార్టీలు కూటమికట్టాయి. ముందుగా చెప్పినట్లు కమ్యూనిస్టుల ప్రభావం ఇక్కడ ఎక్కువగానే ఉన్నప్పటికీ కూటమి కారణంగా అవి పోటీలో పాల్గొనకుండా, కూటమి అభ్యర్థి కాంగ్రెస్‌ ‌నాయకుడు అయిన రాజగోపాల్‌రెడ్డి విజయానికి కృషి చేశాయి. ఇవ్వాళ రాష్ట్ర రాజకీయాల్లో వొచ్చిన మార్పుతో ప్రధాన పోటీ అధికార టిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌, ‌బిజెపి మధ్య నెలకొంది. కమ్యూనిస్టు పార్టీలు అధికార పార్టీ అయిన టిఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికల్లో మద్దతిచ్చేందుకు తీర్మానించాయి. సిపిఐ ముందుగానే ఈ ప్రకటన చేయగా తాజాగా సిపిఎం కూడా తాము టిఆర్‌ఎస్‌ ‌పక్షానే నిలువనున్నట్లు ప్రకటించడం విశేషం. గతంలో టిఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌తో కూటమికట్టిన కమ్యూనిస్టులు కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత కలహాల కారణంగా ఆ పార్టీ ఈ పోటీలో మూడవ స్థానంలో ఉంటుందని అంచనావేస్తూ, అందుకే తామిప్పుడు ఆ పార్టీకి మద్దతిచ్చే ఆలోచన విరమించుకున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలుపటం సంచలనాత్మకమయింది. ఈ నిర్ణయం కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తాకినట్లు అయింది. బిజెపిని ఓడించాలన్నదే తమ లక్ష్యమంటోంది సిపిఎం. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలనన్నిటినీ నిర్వీర్యం చేస్తున్నదని, వాటిన తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నదని సిపిఎం ఆరోపిస్తున్నది. అత్యధికంగా వోటర్లు కలిగిన వామపక్షాలు టిఆర్‌ఎస్‌కు మద్దతు పలుకడంతో టిఆర్‌ఎస్‌కు కొంత ఊరట కలిగిస్తుండగా, బిజెపి, కాంగ్రెస్‌లకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల్లో స్థానిక వోటర్లు పార్టీలనుచూసి వోటేస్తారా లేక అభ్యర్థులను చూసా అన్నది ఆయా అభ్యర్థుల పేర్లు వెల్లడి అయిన తర్వాతగాని తేలనుంది.

Leave a Reply