Take a fresh look at your lifestyle.

చుక్కలు చూపిస్తున్న నిత్యావసరాల ధరలు

పండగ వేళ నిత్యావసర ధరలు చుక్కలను అంటడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు.ఉప్పు, పప్పులతోపాటు వంట నూనె సలసలా కాగుతోంది. దీనికితోడు వంటగ్యాస్‌, ఇం‌ధనం, వస్త్రాలు అమాంతం పెరగడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా ప్రజల్లో కొనుగోలు శక్తి క్షీణించింది. చేతిలో చిల్లిగవ్వ లేక రెండు పూటలా తిండి దొరకడం కొందరికి కష్టంగా మారింది. అన్ని వస్తువుల ధరలు చుక్కలను అంటడంతో మధ్యతరగతి ప్రజల పరిస్థితి మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా తయారయ్యింది.

వంట గ్యాస్‌ ‌ధరలు మారోమారు పెరిగాయి. చమురు సంస్థల నిర్ణయం మేరకు ఒక్కో సిలిండర్‌పై రూ.20 పెరగడంతో రూ.980కి చేరింది. స్థానిక ఏజెన్సీ నిర్వాహకులు రవాణా ఖర్చుల కింద రూ.25 అదనంగా వసూలు చేస్తున్నారు. ఆరు నెలల కిందట రూ.840 ఉండగా ప్రస్తుతం రూ.140 పెరిగింది. ఇంట్లో రెండు, మూడు కూరలు చేసేవారు ప్రస్తుతం ఒక్కదానితో సరిపెట్టుకుంటున్నారు. వేడి నీళ్లతో స్నానం చేసేవారు చన్నీళ్లతో సరి పెట్టుకుంటున్నారు. వంట నూనెలు ఒక్కసారిగా కొండెక్కాయి. పేద, మధ్య తరగతి ప్రజలు కొనే పరిస్థితి లేకుండా పోయింది. ఒక్కో ప్యాకెట్‌పై 10 రోజుల్లో రూ.20 నుంచి రూ.30 వరకు ధర పెరిగింది. కరోనా అనంతరం రూ.80లకు దొరికే ఫామాయిల్‌ ఇప్పుడు రూ.140కి చేరింది. రెండు, మూడు నెలల కిందట ఒక్కసారిగా రూ.180లకు పెరిగి ప్రస్తుతం కొంత తగ్గింది. పప్పులు, వంట సామగ్రి ధరలు నింగినంటాయి. దసరా పండగకు నాలుగు పిండి వంటలు చేద్దామంటే పరిస్థితులు అనుకూలించడం లేదు.

ఓ వైపు కరోనా ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. చాలా మందికి ఉపాధి లేక అప్పులు చేసి పండగలు చేసుకునే దుస్థితి నెలకొంది. ప్రస్తుతం ప్రజలు వాహనాన్ని ఇంటి నుంచి బయటకు తీయాలంటేనే జంకుతున్నారు. లీటరు పెట్రోల్‌ ‌ధర రూ.110, డీజిల్‌ ‌ధర రూ.101లకు చేరింది. దీంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యవసరాలకు.. పెరిగిన ఇంధన ధరలు తోడవడంతో చిన్నపాటి వేతన జీవులు వాహనాలకు గుడ్‌బై చెబుతున్నారు. రేషన్‌ ‌దుకాణాల్లో పామాయిల్‌ ‌ప్యాకెట్లు ఇవ్వకపోవడంతో బహిరంగ మార్కెట్‌లో వీటిని కొనుగోలు చేస్తున్నారు. గతంలో రేషన్‌ ‌దుకాణాల్లో చింతపండు, పసుపు, పప్పులు, పామాయిల్‌ ‌నూనె తదితర సరకులు ఇచ్చేవారు. కొంత కాలంగా 14 రకాల సరుకుల పంపిణీ నిలిచిపోయింది. ధరలు పెరుగుతున్న వేళ పేదలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి .పేద, మధ్య తరగతి ప్రజల కష్టాలు ఎవరికీ పట్టడం లేదు. మార్కెట్‌కు రూ 500 పట్టుకెళ్తే వెనక్కి ఒక్క పైసా తిరిగి రావడం లేదు. పండగ పూట మరింతగా ధరలు పెరగడంతో ఏం కొనేటట్లు కనిపించడం లేదు. కరోనా అంధరి బతుకులపై తీవ్ర ప్రభావం చూపింది.

ఇంధన, కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. గ్యాస్‌ ‌ధర ఈ ఏడాదిలో రెండింతలు పెరిగింది. పెట్రోల్‌ ‌ధరలు పెరగడంతో ద్విచక్రవాహనాన్ని బయటకు తీయాలంటేనే భయం వేస్తోంది. సంపాదన మొత్తం ఖర్చులకే సరిపోతుంది. నిత్యావసర ధరలు నింగినంటడంతో ఏమీ కొనలేని దుస్థితి నెలకొంది. రోజు రోజుకూ పెరుగుతున్న ధరలతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.. కరోనా విపత్కర పరిస్థితి తర్వాత పేదల బతుకులు అగమ్యగోచరంగా తయారయ్యాయి. మార్కెట్‌కు వెళ్లాలంటేనే భయమేస్తుంది.కేంధ్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి కయినా ధరలను అదుపు చేసి ప్రజల మీద భారం తగ్గించాలి.

– కామిడి సతీశ్‌ ‌రెడ్డి, జడల్‌ ‌పేట, జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా.

Leave a Reply