Take a fresh look at your lifestyle.

పెగాసస్‌ ‌వ్యవహారంపై నిపుణుల కమిటీ

  • సుప్రీమ్‌ ‌కోర్టు కీలక నిర్ణయం
  • వెల్లడించిన చీఫ్‌ ‌జస్టిస్‌ ఎన్‌వి రమణ

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్‌ ‌కుంభకోణంపై  దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీమ్‌ ‌కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.  విచారణకు సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు వొచ్చే వారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ గురువారం వెల్లడించారు. కేసు విచారణ సందర్భంగా పిటిషన్‌దారుల తరుపు న్యాయవాది చందర్‌ ఉదయ్‌ ‌సింగ్‌తో జస్టిస్‌ ఎన్‌వి రమణ ఈ విషయాన్ని తెలిపారు. ఈ వారానికన్నా ముందు ఈ అంశంపై ఉత్తర్వులు పాస్‌ ‌చేయాలనుకున్నామని, నిపుణుల కమిటీ కోసం కొంత మంది సభ్యులను పరిగణనలోకి తీసుకున్నామని, అయితే వ్యక్తిగత కారణాల వల్ల వారు ఈ కమిటీలో భాగం కావడానికి నిరాకరించారని, అందుకే ఆలస్యమైనట్లు చెప్పారు.

వొచ్చే వారం ఉత్తర్వులు జారీ చేయడానికి ప్రయత్నిస్తామని అన్నారు. పెగాసస్‌ ‌వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సెప్టెంబర్‌ 13‌న విచారణ చేపట్టిన సుప్రీమ్‌ ‌కోర్టు …మధ్యంతర ఉత్తర్వులు రిజర్వు చేసిన సంగతి విధితమే. ఇజ్రాయిల్‌ ‌సంస్థ ఎన్‌ఎస్‌ఒ ‌సంస్థ అభివృద్ధి చేసిన పెగాసస్‌ అనే స్పైవేర్‌ ‌ద్వారా భారత్‌లోని కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష, ప్రముఖలు ఫోన్లపై కేంద్రం నిఘా పెట్టిందన్న ఆరోపణలపై సర్వోన్నత న్యాయస్థానంలో సీనియర్‌ ‌జర్నలిస్టులతో పాటు పలువురు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్‌ ‌వ్యవహారంపై విచారణకు సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీమ్‌ ‌కోర్టు నిర్ణయించింది. ఓ కేసు విచారణ సందర్భంగా సీనియర్‌ ‌న్యాయవాది చందర్‌ ఉదయ్‌ ‌సింగ్‌తో చీఫ్‌ ‌జస్టిస్‌ ఎన్‌.‌వి. రమణ ఈ విషయాన్ని తెలిపారు. పెగాసస్‌పై దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ల తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదుల్లో చందర్‌ ‌కూడా ఒకరు.

అతిత్వరలో సభ్యులను ఖరారు చేసి సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కోర్టు ఆదేశిస్తే నిపుణుల కమిటీతో విచారణ చేయిస్తాం తప్పితే, ఫోన్లపై నిఘా ఉంచడానికి పెగాసస్‌ ‌కానీ, ఇతరత్రా ఏదైనా సాప్ట్‌వేర్‌ ‌కానీ ఉపయోగిస్తుందా.. లేదా..అని చెప్పే అఫిడవిట్‌ ‌దాఖలుకు కేంద్రం మరోసారి విముఖత వ్యక్తం చేసింది. దీంతో కేంద్రం తీరుపై సుప్రీమ్‌ ‌కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలను చెప్పాలని తాము అడగట్లేదని..చట్టప్రకారం అనుమతించే మార్గాల్లో కాకుండా, ఇతర మార్గాల్లో నిఘా సాప్ట్‌వేర్‌ ఉపయోగించారా? లేదా? అన్నది తెలుసుకోవాలనుకుంటున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. భారత పౌరులపై నిఘా కోసం ఇజ్రాయెల్‌ ‌స్పైవేర్‌ ‌పెగాసస్‌ ఉపయోగించారని ఆరోపణలు ఉన్నాయి.

న్యాయమూర్తులు సూర్య కాంత్‌, ‌హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం, న్యాయస్థానం ఒక కమిటీని ఏర్పాటు చేయడం, స్వతంత్ర విచారణకు సంబంధించిన ఇతర అనుబంధ అంశాలపై రాబోయే 3-4 రోజుల్లో మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయనుంది.. అయితే, పెగాసస్‌ ‌వ్యవహారంలో ఆగస్టు 16న ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌కు కట్టుబడి ఉన్నట్టు సొలిసిటర్‌ ‌జనరల్‌ ‌తుషార్‌ ‌మెహతా తెలిపారు. పెగాసస్‌ ‌వంటి నిర్దిష్ట సాప్ట్‌వేర్‌ని ఉపయోగించడంపై..అఫిడవిట్‌ ‌లేదా బహిరంగ చర్చకు సంబంధించిన అంశం కాదని పునరుద్ఘాటించారు.

మంత్రులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, కార్యకర్తలు, జర్నలిస్టుల ఫోన్‌లను హ్యాక్‌ ‌చేయడానికి మిలిటరీ గ్రేడ్‌ ‌స్పైవేర్‌ని ఉపయోగించడాన్ని ఈ అఫిడవిట్‌ ‌ధృవీకరించలేదు. ఇదే సమయంలో తిరస్కరించని సంగతి కూడా విధితమే. అయితే, గురువారం మాత్రం కీలక వ్యాఖ్యలు చేస్తూ పెగాసస్‌ ‌స్నూపింగ్‌ ‌వ్యవహారంలో విచారణకు సుప్రీమ్‌ ‌కోర్టు సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు సీజేఐ ఎన్‌వి రమణ.

Leave a Reply