Take a fresh look at your lifestyle.

‌శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి…

  • నేటి స్వామివారి కల్యాణానికి సర్వం సిద్ధం
  • చలువ పందిళ్లు, చాందినీ వస్త్రాలతో పెళ్లి కళ ఉట్టిపడేలా భదాద్రి ముస్తాబు
  • భారీగా చేరుకున్న భక్త జనం

భద్రాచలం, ఏప్రిల్‌ 09(‌ప్రజాతంత్ర ప్రతినిధి ) : దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం నేడు ఆదివారం భక్త జనులకు కన్నుల పండుగగా జరుగనుంది. అందుకోసం జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. శనివారం నాటికే భక్తులు భారీగా చేరుకున్నారు. భద్రాచలంలో పండగవాతావరణం నెలకొంది. స్వామివారి కల్యాణం ఎప్పుడెప్పుడా అని భక్తులు ఎదురు చూస్తున్నారు. స్వస్థిశ్రీ చాంద్రమాన శుభకృత్‌నామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి నవమి అభిజిత్‌ ‌లగ్నమందు  కల్యాణం జరుగుతుంది.

శివధనస్సును విరిచిన శ్రీ రామచంద్రమూర్తికి మిధిలానగరంలో జనకుని పుత్రిక అయిన సీతామహాలక్ష్మీకి ఆనాడు పెండ్లి జరిగితే భద్రాచలంలో ఉన్న చతుర్భుజాలు, శంఖుచక్రాలు ధరించిన శ్రీ మహావిష్ణువు అంశం గల వైకుంఠ రాముడు వరుడుగా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీ స్వరూపురాలు అయిన సీతమ్మ వధువుగా కల్యాణం జరగడం విశేషం. భార్యాభర్తల అనుబంధానికి, అనురాగానికి నిర్వచనం ఇచ్చిన ప్రేమమూర్తులు శ్రీ సీతారాములు తెలుగువారి ఇలవేల్పు భదాద్రి రాముడు. అందుకే తెలుగు వాగ్గేయకారుడైన భక్తరామదాసు, త్యాగరాజులకు ఆయన ఆరాధ్యదైవం అయ్యాడు. ఆరాధనకు అనుగుణంగా కీర్తనలు గానం చేయడం, కీర్తనలకు అనుగుణంగా ఆరాధన చేయడం భద్రాచలం క్షేత్రంలోని ప్రత్యేకత.

భదాద్రిలో శ్రీ సీతారామ నవమి నాడు జరిగే కల్యాణాన్ని అనుసరించి తమ తమ గ్రామాలు, పట్టణాల్లో, ఇండ్లల్లో కల్యాణాలు జరుపుకోవడం ఆంధ్రుల ఆనవాయితీ. తొలుత భదాద్రి రామునికి దేవాలయంలో ఉత్సవమూర్తులకు కల్యాణం జరుగుతుంది. ఆ తర్వాత మంగళవాయిద్యాలు మారుమ్రోగుతుండగా భక్తుల జై జై ధ్వానాల మధ్య పల్లకిలో శిల్పకళా శోభితమై అలరారే కల్యాణ మండపానికి పుణ్యాహ వచనం సంకల్పం చేసి, శాంతికోసం విష్వక్సేన పూజ నిర్వహిస్తారు. తర్వాత కల్యాణానికి వినియోగించే అన్ని వస్తువులను, సామాగ్రిని ప్రక్షాళన చేస్తారు. ఆ తర్వాత రక్షాబంధనం, మోక్షబంధనం నిర్వహిస్తారు. 24 అంగుళాల పొడవుగల 12 దర్భాలతో అల్లిన ఒక దర్బతాడును సీతమ్మవారి నడుంకు బిగిస్తారు. రామయ్య కుడిచేతికి, సీతమ్మ ఎడమచేతికి రక్షా సూత్రాలు కడతారు. స్వామి గృహసామాగ్రి శుద్ధికోసం సువర్ణయజ్ఞపవీతాన్ని ధరింపచేస్తారు.

8 మంది శ్రీ వైష్ణవులకు తాంబూలాది సత్కారాలను చేసి కన్యావరణం జరిపిస్తారు. అంటే జగన్నాధుడు, దయామయుడు అయిన శ్రీరామచంద్రునికి సీతమ్మే తగిన వధువు అంటూ పెద్దలు నిర్ణయిస్తారు. ఆ తర్వాత వధూవరుల వంశాలకు చెందిన పెద్దల గోత్రాలను మూడుసార్లు పఠిస్తారు. స్వామి పాదప్రక్షాళన అనంతరం పరిమళభరిత తీర్థంతో మంత్రయుక్తంతో పుష్పోదక స్నానం చేయిస్తారు. గోదానం చేసి మహాసంకల్పం పఠిస్తారు. ఉత్సవం లోకోత్సవం అయినప్పుడు మహాసంకల్పాన్ని చెప్పాలని శాస్త్రం. జగత్‌ ‌కల్యాణం రూపమైన ఈ  కల్యాణం పఠించే ఈ మహాసంకల్పం భారతీయ భౌగోళిక పరిజ్ఞానానికి అద్దంపడుతూ జాతీయ భావాలను మేల్కొలుపుతుంది.

సాక్షాత్తు విష్ణుస్వరూపుడైన శ్రీరామునికి శ్రీమహాలక్ష్మీ స్వరూపమైన సీతను జగత్‌ ‌కల్యాణార్థం మంత్రధార పూర్వకంగా ఈ కన్యాదానం జరుగుతుంది. కన్యాదాన సద్గుణ్యం కోసం గో, భూ, హిరణ్య మొదలైన షోడశమహాదానాల కూడా సమర్పిస్తారు. తర్వాత మంగళం చేకూర్చాలనే భావంతో చదివే ఆశీస్సులు ఒక్క సీతారాములకే కాక, వారి కల్యాణాన్ని తిలకించేందుకు భద్రాచలం వచ్చిన భక్తులు అందరికి వర్తించే విధంగా ఉంటాయి. మంగళవాయిద్యాలు మారుమ్రోగుతుండగా వేదమంత్రాల మధ్య అభిజిత్‌లగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లంను శిరస్సుపై ఉంచితే మనలో సత్యం, సద్భావన పెరుగుతుందని శాస్త్రం. ఆ తర్వాత జరిగే ఈ మాంగల్యం పూజలో మంగళసూత్రంలో ముగ్గురు అమ్మవార్లను ఆవాహన చేస్తారు. 9 పోగులతో మూడు సూత్రాలతో తయారైన మంగళసూత్రం ఎన్నో వేదాంత రహస్యాలను చాటి చెబుతుంది.

9 పోగులు వివిధ సంబంధాలకు ప్రతీకలు, మూడు సూత్రాలు కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలకు సాంకేతకాలు. సూత్రమూలంలో గౌరీదేవిని, సూత్ర మధ్యంలో సరస్వతి దేవిని, సూత్రాంగంలో మహాలక్ష్మీని ఆవాహనచేస్తారు. ఈ ముగ్గురు అమ్మల అనుగ్రహంతోనే లోకంలో సౌశీల్యం, సౌందర్యం, సౌకుమార్యం వంటి గుణాలు ప్రవర్తిల్లుతున్నాయి. ఈ ముగ్గురమ్మలను ఆవాహన చేసి మంగళసూత్రాలలో భక్త రామదాసు చేయించిన మంగళపతాకాన్ని ధరింపచేయడం ఈ క్షేత్రం యొక్క విశేషం.

ఆ పెళ్ళి కళ చూడాల్సిందే…!
ఆకాశమంత పందిరి, భూదేవి అంత అరుగులు అనే విధంగా పట్టణంలోని కల్యాణమండపం ఆవరణలో ఏర్పాటు చేసి వెదురుపందిర్లు భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఆ ప్రాంతమంతా కళకళలాడుతుంది. కల్యాణ మండపంతో పాటు పట్టణంలోని చప్టాదిగువ, గోదావరి నది ఒడ్డు తదితర ప్రాంతాల్లో చలువ పందిర్లు కల్యాణ శోభను తెలియజేస్తున్నాయి. అంతే కాకుండా ఈ ఏడాది మండపంతో పాటుగా బ్రిడ్జీ సెంటర్‌ ‌వరకు చాందినీ వస్త్రాలతో ప్రధాన రహదారులు అలంకరింపచేసారు. పెళ్ళికళ ఉట్టిపడేలా పట్టణంలో ఎక్కడ చూసినా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మండపం ఆవరణలో వెదురు చలువ పందిర్ల క్రింద అందంగా అమర్చిన రంగుల చాందినీ వస్త్రాలు మరింత అందం తెచ్చాయి.

ప్రఖ్యాత శిల్పకళాచార్యుడు గణపతిస్థపతి నిర్మించిన కల్యాణ మండపంలో సీతారాముల కల్యాణం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కల్యాణ శోభతో భద్రాచలం పట్టణం నాటి మిధిలానగరంను గుర్తుకు తెస్తుంది. సీతారాముల వివాహం కోసం నాటి మిధిలానగరమే నేటి భదాద్రిలో మిధిలాస్టేడియంగా మారిందా అనే విధంగా పెళ్ళి ఏర్పాట్లును అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ఆనాదిగా వస్తున్న ఆభరణాలైన రామదాసు చేయించిన మంగళసూత్రాలు, చింతాకుపతకం, పచ్చలపతకం, కళికితురాయి వంటి ఆభరణాలు ఈ కల్యాణ కార్యక్రమంలో ఉత్సవ మూర్తులకు అలంకరింపచేస్తారు. జగత్కల్యాణం కోసం పట్టణంలో ప్రతీ ఏటా నిర్వహిస్తున్న ఈ కల్యాణ మహోత్సవాన్ని కొన్ని వందల సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఈ ఏడాది కూడా శ్రీ సీతారాముల కల్యాణంకు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు ప్రభుత్వ ప్రతినిధులు తీసుకురానున్నారు.

Leave a Reply