Take a fresh look at your lifestyle.

దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్‌ ‌సంతోష్‌ ‌బాబు

  • ఆయన వీర మరణం బాధాకరం
  • అమరత్వం శాశ్వతంగా గుర్తుండే విధంగా విగ్రహం ఏర్పాటు అభినందనీయం
  • సంతోష్‌ ‌బాబు విగ్రహావిష్కరణలో మంత్రి కేటీఆర్‌

దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్‌ ‌సంతోష్‌బాబు వీరమరణం బాధాకరమని, అమరత్వం శాశ్వతంగా గుర్తుండే విధంగా విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని, దేశం కోసం త్యాగం చేసే అవకాశం చేసుకోవడం అదృష్టమని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహావీరచక్ర కల్నల్‌ ‌బిక్కుమళ్ల సంతోష్‌బాబు విగ్రహావిష్కరణను మంగళవారం మంత్రి జగదీశ్వర్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మార్కెట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశానుసారం సంతోష్‌ ‌బాబు కుటుంబానికి అండగా ఉన్నామని, ఎల్లప్పుడూ ఉంటామని చెప్పారు. కల్నల్‌ ‌సంతోష్‌ ‌బాబు వీర మరణం పొంది సంవత్సరం అయిందంటే నమ్మబుద్ధి కావడం లేదన్నారు. భారతదేశం, చైనా ఘర్షణలో అమరులు కావడం బాధాకరమన్నారు. స్ఫూర్తినిచ్చే విధంగా విగ్రహం నెలకొల్పడాన్ని మంత్రి కేటీఆర్‌ అభినందించారు.

సిఎం కేసిఆర్‌ ఒక మాట అంటుంటారని..పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదని, జీవించిన కాలంలో ఏం సాధించావనేది చెప్తారని గుర్తు చేశారు. సంతోష్‌ ‌బాబు వీర మరణం ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలుస్తుందన్నారు. వారి కుటుంబానికి చేసిన సహాయం దేశ వ్యాప్తంగా కూడా స్ఫూర్తిగా ఉంటుందని, భారత జవాన్లకు వారు భరోసా కలిపించారని, ఇదే దేశ వ్యాప్తంగా స్పూర్తిగా తీసుకొనేలా చేశారన్నారు. ఈ దేశ ప్రజలు గుర్తిస్తున్నారని, మీకు స్ఫూర్తినిస్తున్నారని చెప్పడానికి ఉదాహరణ కల్నల్‌ ‌సంతోష్‌ ‌బాబు విగ్రహమేనన్నారు. తాను, మంత్రి జగదీష్‌ ‌రెడ్డి ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్నాం గానీ అన్ని కార్యక్రమాలు అత్మ సంతృప్తినివ్వవని, ఈ కార్యక్రమం ఆత్మ సంతృప్తినిచ్చిందని మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ఈ కార్యక్రమంలో అవకాశం కలిపించిన మంత్రి జగదీష్‌ ‌రెడ్డి, ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమరత్వం శాశ్వతంగా గుర్తుండే విధంగా విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విగ్రహం అద్భుతంగా తీర్చి దిద్దిన శ్రీనివాస్‌ను మంత్రి కేటీఆర్‌ అభినందించారు.

సంతోష్‌బాబు వీరమరణం బాధాకరం : మంత్రి జగదీశ్వర్‌రెడ్డి
దేశం కోసం ప్రాణాలర్పించిన సూర్యాపేట ముద్దుబిడ్డ మహా వీర చక్ర కల్నల్‌ ‌సంతోష్‌ ‌బాబు వీర మరణం బాధాకరమని మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. దేశం కోసం త్యాగం చేసే అవకాశం చేసుకోవడం అదృష్టమన్నారు. సిఎం కేసీఆర్‌ ‌ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దేశం మొత్తం చెప్పుకొనే విధంగా వారి ఇంటికి వొచ్చి ఓదార్చి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించిన విధంగా త్వరతిగతిన పూర్తి చేసినట్లు తెలిపారు. తెలంగాణలోని అన్ని పట్టణాలను హైదరబాద్‌ ‌వలె సౌకర్యాలు తీసుకురావాలని సీఎం కెసిఆర్‌ ‌కృషి చేస్తున్నారని కొనియాడారు. చేనేతను కష్టాల నుంచి బయట పడేసి గుర్తింపు తెచ్చిన మంత్రి కేటీఆర్‌ అని కొనియాడారు.

దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశారు : సంతోష్‌బాబు సతీమణి సంతోషి
దేశం కోసం సంతోష్‌బాబు తన ప్రాణాలను త్యాగం చేశారని ఆయన సతీమణి సంతోషి అన్నారు. సీఎం కేసిఆర్‌ ‌తమకు అండగా ఉంటామని చెప్పి అభయం ఇచ్చారని చెప్పారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మీ వారిని తీసుకురాలేము కానీ మీ కుటుంబానికి అండగా ఉండగలమని భరోసానిచ్చారు. వారి ఇంటికి ఆహ్వానించడం, మాతో చాలా సమయం కేటాయించడం మరచిపోలేమన్నారు. ప్రతి ఒక్కరిలో వారి బాధ్యతను గర్తు చేస్తూ ప్రతిష్టించడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ‌శాసన మండలి చైర్మన్‌ ‌నేతి విద్యాసాగర్‌ ‌రావు, జిల్లా పరిషత్తు ఛైర్మెన్‌ ‌గుజ్జ దీపికా యుగెందర్‌ ‌రావు, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌, ‌బొల్లం మల్లయ్య యాదవ్‌, ‌నల్లమోతు భాస్కర్‌ ‌రావు, కంచర్ల బూపల్‌ ‌రెడ్డి, నోముల భగత్‌, ‌డిసిసిబి చైర్మన్‌ ‌గొంగిడి మహేందర్‌ ‌రెడ్డి, కలెక్టర్‌ ‌వినయ్‌ ‌కృష్టారెడ్డి, ఎస్పీ భాస్కరన్‌, ‌కల్నల్‌ ‌సంతోష్‌ ‌బాబు తల్లిదండ్రులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply