Take a fresh look at your lifestyle.

కల్నల్‌ ‌సంతోష్‌బాబు అస్తికల నిమజ్జనం

కృష్ణా, మూసి సంగమంలో కలిపిన కుటుంబ సభ్యులు

చైనా జవాన్ల మూక దాడిలో వీరత్వం పొందిన కల్నల్‌ ‌సంతోష్‌ ‌బాబు అస్తికలను కుటుంబ సభ్యులు శనివారం నిమజ్జనం చేశారు. నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణ, మూసి నదుల సంగమంలో తండ్రి ఉపేందర్‌, ‌భార్య సంతోషి, కుటుంబ సభ్యులు నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా సంతోష్‌ ‌బాబు అస్తికలుంచిన వాహనం దామరచర్ల గ్రామానికి చేరుకోగానే గ్రామస్తులు ఆ వాహనం వద్ద శ్రద్దాంజలి ఘటించారు. కల్నల్‌ ‌సంతోష్‌బాబు అమర్‌ ‌రహే అంటూ నినాదాలు చేశారు.తమ కుటుంబానికి అండగా ఉంటామని సీఎం కేసీఆర్‌ ‌తీసుకున్న నిర్ణయం భరోసానిచ్చిందని కర్నల్‌ ‌సంతోష్‌బాబు భార్య సంతోషి చెప్పారు. ముఖ్యమంత్రి స్వయంగా ఇంటికి వచ్చి సాయం అందిస్తాననడం గొప్ప విషయమని కొనియాడారు. సంతోష్‌ను ఎవరూ తిరిగి తీసుకురాలేరని పేర్కొన్న ఆమె.. తన భర్త నూరిపోసిన ధైర్యం, ప్రభుత్వం ఇస్తున్న స్ఫూర్తితో మిలిటరీ సంబంధిత కార్యక్రమాలు చేపట్టాలని ఉన్నట్టు తెలిపారు. అమరుల కుటుంబాలన్నింటికీ సాయంచేయాలని సీఎం కేసీఆర్‌ ‌తీసుకున్న నిర్ణయం .. ఆయన విశాల హృదయానికి తార్కాణమని ఆమె ప్రశంసించారు. సరిహద్దుల్లో రెచ్చిపోతున్న చైనాకు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గట్టి సమాధానం చెప్పాలని సంతోషి డిమాండ్‌చేశారు. దేశంలో చైనా వస్తువులను బహిష్కరించాలని కోరారు. అలాగే తన భర్త ఆశయాల మేరకు ప్రజలతో కలసి పోరాడుతానని ప్రకటించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మా అబ్బాయి త్యాగాన్ని గుర్తించారని, నా కుమారుడు వీర మరణం పొందిన వెంటనే ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తున్నందుకు ధన్యవాదాలు అని తల్లి మంజుల అన్నారు. కడుపుకోత ఉన్నా నా కుమారుడు దేశం కోసం ప్రాణాలు అర్పించినందుకు గర్వంగా ఉన్నదన్నారు. సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు హృదయపూర్వక తండ్రి ఉపేందర్‌ ‌ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో మంత్రి జగదీశ్‌రెడ్డి అంతా తానై మా కుటుంబసభ్యుడిలా అంత్యక్రియలు ముగిసే వరకు వెన్నంటి ఉన్నారని అన్నారు. అమరుడైన కర్నల్‌ ‌సంతోష్‌బాబు తల్లిదండ్రులు ఉపేందర్‌, ‌మంజులతోపాటు భార్య సంతోషిని చినజీయర్‌ ‌స్వామి ఫోన్‌ ‌ద్వారా శుక్రవారం పరామర్శించారు. దేశం గర్వించేలా ప్రాణాలు అర్పించడం చాలా గొప్ప విషయమన్నారు.

Leave a Reply