Take a fresh look at your lifestyle.

దుబ్బాక డీలర్‌ ‌పనేనా..?

  • కలెక్టర్‌ ‌వెంకట్రామిరెడ్డిని ఇబ్బందుల్లో పడేసిన వీడియో
  • సిసి పుటేజీ ఆధారంగా నిర్ణయానికి వొచ్చిన అధికార యంత్రాంగం
  • వీడియో అప్‌ ‌లోడ్‌ ‌చేసిన డీలర్‌పై చర్యలు?
  • కలెక్టర్‌ ‌వ్యాఖ్యలు టిఆర్‌ఎస్‌కు అంటగట్టే ప్రయత్నాలు?
  • హుజురాబాద్‌ ఎన్నికపై ప్రభావం పడకుండా అధికార పార్టీ నేతల జాగ్రత్తలు

సిద్ధిపేట కలెక్టరేట్‌ ‌కార్యాలయంలో రెండ్రోజుల కిందట జరిగిన అగ్రికల్చర్‌ అధికారులు, ఫర్టిలైజర్‌ ‌డీలర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్‌ ‌పరపతి వెంకటరామరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీడ్‌ ‌డీలర్లను బెదిరించడమేంటని విపక్షాలు మండిపడుతున్నాయి. యాసంగిలో ఒక్క ఎకరంలోనూ వరి సాగు కావొద్దని, రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా వ్యవసాయ, మండల ప్రత్యేక అధికారులు బాధ్యత తీసుకోవాలని సూచించారు కలెక్టర్‌. ‌రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ అనుమతి పొందిన డీలర్‌లు వరి విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించవద్దన్నారు. వేరుశనగ, పెసర, శనగ, నువ్వులు, సజ్జలు, ఇతర నూనె పంటలకు సంబంధించి నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని డీలర్లను ఆదేశించారు. నాసిరకం విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే, తన వ్యాఖ్యలను వక్రీకరించినట్లు కలెక్టర్‌ ‌వెంకట్రామిరెడ్డి మీడియా ముఖంగా వివరణ కూడా ఇచ్చారు. తను వరి వద్దని అనలేదని, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని మాత్రమే సూచన చేసినట్లుగా కలెక్టర్‌ ‌వివరణ ఇచ్చాక కూడా ఆయన రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ‌చేస్తూనే ఉన్నారు. బుధవారం కూడా జిల్లా వ్యాప్తంగా కలెక్టర్‌ ‌తీరును నిరసిస్తూ వివిధ పార్టీల నాయకులు మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు. రైతు సంఘాల ప్రతినిధులు గాంధీ విగ్రహంకు వినతి పత్రాలు సమర్పించారు. వరి విత్తనాలు అమ్మొద్దని బెదిరించడం బ్లాక్‌ ‌మెయిల్‌ ‌చేయడమేనన్నారు. సుప్రీమ్‌ ‌కోర్టు నుంచి ఆర్డర్‌ ‌తెచ్చుకున్నా ఊరుకోను అంటూ కలెక్టర్‌ ఒక నియంతలా మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం వరి రైతుల బాధ్యతల నుంచి తప్పుకునేందుకే ఈ ఎత్తుగడ అన్నారు. వరి పంటలు వేయనప్పుడు ఇక లక్షల కోట్ల వ్యయం చేసిన ఈ ప్రాజెక్టులు ఎందుకని ప్రశ్నించారు.

దుబ్బాక డీలర్‌ ‌పనేనా…?
గత రెండురోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కలెక్టర్‌ ‌వెంకట్రామిరెడ్డి మాట్లాడిన మాటలు సోషల్‌ ‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకూ ఆ వీడియో తీసింది, లీకు చేసింది ఎవరా? అని అందరూ అరా తీస్తున్నారు. దీనిపై సిద్దిపేట కలెక్టరేట్‌లో ఒకటే చర్చ. కలెక్టర్‌ ‌మాట్లాడిన మాటల్ని రికార్డు చేసింది ఎవరూ? ఎందుకిలా చేశారు అనే చర్చ జోరుగా జరుగుతుంది. ప్రస్తుతం దీనిపై సీరియస్‌గా ఉన్న కలెక్టర్‌ అధికారులచే సీసీ టీవీ పుటేజీ పరిశీలించి వీడియో రికార్డు చేసిన వ్యక్తి ఎవరు అనేది కని పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే సీసీ టీవీ డాటాను మంగళవారం రోజునే సిద్ధిపేట పోలీస్‌ ‌కమిషనర్‌ ‌కు అందించినట్లు సమాచారం. అయితే, సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన డీలర్‌ ‌కలెక్టర్‌ ‌మాట్లాడిన ప్రతి మాటను వీడియో తీసి తొలుత డీలర్ల గ్రూపులో వీడియోను అప్‌ ‌లోడ్‌ ‌చేసినట్లు సమాచారం. డీలర్ల గ్రూపుల్లో నుండి ఇతర గ్రూపుల్లోకి కలెక్టర్‌ ‌మాట్లాడిన మాటల వీడియో వెళ్లడం…అది కాస్త కాంగ్రెస్‌ ‌నేతలు రేవంత్‌ ‌రెడ్డి, జగ్గారెడ్డి, అయోధ్య రెడ్డికి చేరడటం…వారు తక్షణమే స్పందించి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం..కలెక్టర్‌ ‌రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ‌చేయడం..ఆ తర్వాత బిఎస్పీ ప్రవీణ్‌ ‌కుమార్‌, ఆ ‌తర్వాత బిజెపి బండి సంజయ్‌ ‌మాట్లాడటం…ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్‌ ‌వెంకట్రామిరెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి. హుజురాబాద్‌ ఉప ఎన్నికకు మరి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. కలెక్టర్‌ ‌వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలను అధికార టీఆరెస్‌ ‌పార్టీకి అంట గట్టడానికి ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలను ముందే పసిగట్టిన అధికార పార్టీ నాయకులు కలెక్టర్‌ ‌వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యల ప్రభావం హుజురాబాద్‌ ఎన్నికల్లో అధికార పార్టీపై ప్రభావం పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. మరోవైపు కలెక్టర్‌ ‌ప్రసంగాన్ని మొత్తంగా వీడియో తీయడమే కాకుండా సోషల్‌ ‌మీడియాలో పోస్టు చేసిన వ్యక్తి(దుబ్బాక ప్రాంత డీలర్‌)‌ని గుర్తించిన జిల్లా అధికార యంత్రాంగం నివేదికను జిల్లా కలెక్టర్‌ ‌వెంకట్రామిరెడ్డికి సమర్పించినట్లు తెలుస్తుంది. తన ప్రతిష్టను దెబ్బ తీసేలా ఉన్న వీడియోను సోషల్‌ ‌మీడియాలో పోస్టు చేసిన వ్యక్తిపై చట్ట ప్రకారం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? లేదా? అనే దానిపై కలెక్టర్‌ ‌వెంకట్రామిరెడ్డి న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. న్యాయ నిపుణుల సలహాలు, సూచనల ఆధారంగా కలెక్టర్‌ ‌వెంకట్రామిరెడ్డి….వీడియోను తీసి, పోస్టు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి కలెక్టర్‌ ‌వెంకట్రామిరెడ్డిని ఆ వీడియో ఇబ్బందుల్లో పడేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే ఇప్పుడు హాట్‌ ‌టాపిక్‌!

Leave a Reply