- ఎమ్మెల్సీగా వెంకట్రామిరెడ్డి?
- సిఎం కేసిఆర్‌ను నమ్మితే పదవీ గ్యారంటీ
- కేసీఆర్ అభివృద్ధిలో పాలుపంచుకోవాలనుకుంటున్నా..: వెంకట్రామి రెడ్డి రాజీనామా ఆమోదం
సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్న పరపతి వెంకట్రామరెడ్డి(ఐఏఎస్) తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేయనున్నట్లు ‘ప్రజాతంత్ర’ ముందే చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రంలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెంకట్రామరెడ్డికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎమ్మెల్సీ సీటును కేటాయించడంతో కలెక్టర్ ఉద్యోగానికి సోమవారం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సోమేష్ కుమార్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారని అంటున్నారు. వెంకట్రామిరెడ్డిని అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేయడటంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారని సమాచారం. కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రి కేసిర్ సమక్షంలో టీఆరెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. సిద్ధిపేట జిల్లా ఏర్పడినప్పటి నుంచి కలెక్టర్‌గా అధికార బాధ్యతలు నిర్వహిస్తున్న కలెక్టర్ వెంకట్రామరెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని గత కొంత కాలంగా భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే, విషయాన్ని ఒకట్రెండు సందర్భాల్లో కూడా కలెక్టర్ వెంకట్రామరెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. సమయం, సందర్భం వొచ్చినప్పుడు రాజీనామా చేద్దువని సిఎం కేసీఆర్ వెంకట్రామరెడ్డికి చెప్పుకుంటూ వొచ్చినట్టు తెలుస్తుంది. ఆ సమయం ఇప్పుడు రానే వొచ్చింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం..కొత్త జిల్లాగా సిద్ధిపేట ఏర్పడటం..కలెక్టర్‌గా వెంకట్రామరెడ్డి నియమితులు కావడం.. ఇదే జిల్లాలో సిఎం కేసీఆర్, మరో ముఖ్యమైన రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు ఉండటమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్టులలో భాగంగా చంద్లాపూర్ సమీపంలో రంగనాయకసాగర్ రిజర్వాయర్, తొగుట మండలంలో మల్లన్నసాగర్ రిజర్వాయర్, హుస్నాబాద్‌లో గౌరవెల్లి ప్రాజెక్టు, మర్కూక్ మండలంలో శ్రీ కొండపోచమ్మ రిజర్వాయర్లను నిర్మించాలని సిఎం కేసీఆర్ సంకల్పానికి జిల్లా కలెక్టర్‌గా వెంకట్రామరెడ్డి రాత్రింబవళ్లు శ్రమించారు. ప్రాజెక్టులకు కావల్సిన వేలాది ఎకరాల భూమిని సేకరించడంలో కలెక్టర్‌గా వెంకట్రామరెడ్డి కీలకపాత్రను పోషించారు. అనేక సందర్భాల్లో సిఎం కేసీఆర్ చేత ప్రశంసలు కూడా పొందారు.
ప్రాజెక్టుల నిర్మాణంలో కలెక్టర్ వెంకట్రామరెడ్డి పాత్ర మరువలేనిదంటూ ప్రశంసించడమే కాకుండా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంకు కలెక్టర్ వెంకట్రామరెడ్డే ఎమ్మెల్యే అని మాట్లాడిన సందర్భాలున్నాయి. సిఎం కేసీఆర్ నోట ఏనాడైతే కలెక్టర్ వెంకట్రామరెడ్డే గజ్వేల్ ఎమ్మెల్యే అని వొచ్చిందో..ఆ మాట త్వరలోనే ఎమ్మెల్సీ రూపంలో నెరవేరే రోజు రానేవచ్చిందనీ అంటున్నారు. స్వతహాగా తెలంగాణ అంటే ఇష్టపడే కలెక్టర్ వెంకట్రామరెడ్డికి తెలంగాణ రావాలని ఎంత బలంగా కోరుకున్నారో…అంతే బలంగా సిద్ధిపేట జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి, సంక్షేమం కోసం రాత్రింబవళ్లు పని చేశారు. దీంతో అటు సిఎం కేసీఆర్, ఇటు మంత్రి హరీష్‌రావు వద్ద మంచి మార్కులు సంపాదించారు. ప్రశంసలు పొందారు. తెలంగాణపై వెంకట్రామరెడ్డికి ఉన్న కమిట్‌మెంటు, రాజకీయాల పట్ల ఆసక్తితో సిఎం కేసీఆర్ వెంకట్రామరెడ్డికి ఎమ్మెల్సీ సీటును కేటాయించినట్లు తెలుస్తుంది. మొత్తం మీద మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎవరు నమ్ముకున్న పదవీ గ్యారంటీ అని వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవీ ఇవ్వనుండటంతో రుజువైంది.
కేసీఆర్ అభివృద్ధిలో పాలుపంచుకోవాలనుకుంటున్నా..: వెంకట్రామి రెడ్డి
సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి వెంకట్రామిరెడ్డి ఐఏఎస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్) కోరుతూ సీఎస్ సోమేశ్‌కుమార్‌కు రాజీనామా లేఖ అందించగా దానిని ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజీనామా ఆమోదం అనంతరం వెంకట్రామిరెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘‘కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కోసం కృషి చేస్తుంది.
దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా సీఎం కేసీఆర్ తెలంగాణను తీర్చిదిద్దుతున్నారు. ఈ అభివృద్ధి మార్గంలో సీఎంతో ఉండాలనుకొని వీఆర్‌ఎస్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. రానున్న వంద సంవత్సరాలు తెలంగాణ గురించి ప్రజలు చెప్పుకొనే విధంగా రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారు. సీఎం మార్గనిర్దేశం ప్రకారం పని చేస్తాను’’ అని పేర్కొన్నారు.