ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే విధానాన్ని పరిష్కరించాలి: అధికారులను ఆదేశించిన కలెక్టర్ అనుదీప్
కొత్తగూడెం,ఆగస్టు 03 (ప్రజాతంత్ర ప్రతినిధి) : ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేయు సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు మిషన్ బగీరథ, ఇంట్రా, మున్సిపల్ కమిషనర్లు, ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం, పంచాయతీ అధికారులతో సిసిరోడ్లు పునరుద్ధరణ, పైపులైన్లు ఏర్పాటు, మంచినీటి ట్యాంకుల నిర్మాణం, ఇంటింటికి నల్లాలు ఏర్పాటు, ఫ్లో కంట్రోల్ వాల్స్ నిర్వహన తదితర అంశాలపై సరఫరాపై సమీక్షా సమావేశం నిర్వహించి మండల వారిగా మిషన్ బగీరథ, ఇంట్రా విలేజ్ పనులను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని అన్ని హాబిటేషన్లుకు సురక్షిత త్రాగునీరు అందించు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నిర్మాణంలో ఉన్న నీటి ట్యాంకులను యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిఈలను ఆదేశించారు. నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి చేయకపోవడం వల్ల నీటి సమస్యలు ఏర్పడుతున్నాయని ప్రాధాన్యతను గుర్తించి అన్ని పనులు ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు నత్తనడక నడిచే కాంట్రాక్టర్లుకు నోటీసులు జారీ చేసి తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. మంజూరైన పనులకు కూడా పూర్తి చేయకపోతే ఎలా అని, పనులు ప్రగతిలో ఉన్నాయని చెప్తే సహించనని పూర్తి చేయించాల్సిన బాధ్యత మీపైనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంచినీటి ట్యాంకులను ప్రతి నెలా 1,11,21 తేదీల్లో పరిశుభ్రం చేయాలని చెప్పారు. ప్రభుత్వ సంస్థలతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలకు, వైకుంఠదామాలకు, రైతు వేదికలకు మిషన్ బగీరథ నీటి సరఫరా చేయాలని, రైతువేదికల్లో నీటి సరఫరాపై వ్యవసాయ అధికారి నివేదికలు ఇవ్వాలని చెప్పారు. పినపాక నియోజకవర్గ పరిధిలోని అన్నారం, కమలాపురం, చిన్నరావిగూడెం, బెస్తగూడెం గ్రామాల్లో మంచినీటి సమస్యను శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని చెప్పారు. రానున్న వేసవి నాటికి జిల్లాలో నీటి సమస్య ఉండటానికి వీల్లేదని, మీ వల్ల ప్రజలకు ఎందుకు అవస్థలని ప్రజా రోగ్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో ఇంట్రా ఈ ఈ నళిని, డిపిఓ రమాకాంత్, మున్సిపల్ కమిషనర్లు సంపత్ కుమార్, శ్రీకాంత్, శ్రీనివాసరెడ్డి, నాగప్రసాద్, మిషన్ బగీరథ, ఇంట్రా డిఈలు, ఏఈలు పాల్గొన్నారు.