Take a fresh look at your lifestyle.

ముంచుకొస్తున్న బొగ్గు కొరత ముప్పు..

ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించాలి

బొగ్గు గనుల్లో బొగ్గు ఉంది. కానీ థర్మల్‌ ‌విద్యుత్‌ ‌కేంద్రాలలో బొగ్గుకి కొరత ఏర్పడింది. దాంతో సగానికి పైగా థర్మల్‌ ‌విద్యుత్‌ ‌కేంద్రాలు 50% విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నాయి. దిల్లీ కి సంబంధించి ఒక్క రోజుకి సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఢిల్లీ తో పాటు ఒరిస్సా, ఛత్తీస్‌ ‌గఢ్‌, ‌మహారాష్ట్ర, పంజాబ్‌, ‌తమిళనాడు రాష్ట్రాలలో విద్యుత్‌ ‌కోతలు తప్పేట్లు లేవు. ఏ ఉత్పత్తి అయినా డిమాండ్‌, ‌సప్లై సూత్రాలకు అనుగుణంగా ఉంటుంది. డిమాండ్‌ ఆధారంగా ముందు చూపుతో అధిక ఉత్పత్తి చేసి నిల్వ చేసుకొని, అవసరం ఉన్నప్పుడు సప్లయ్‌ ‌చేస్తారు.. కానీ విద్యుత్‌ ‌విషయంలో ఇలా చేయలేం. జలవిద్యుత్‌ అయినా, థర్మల్‌ ‌విద్యుత్‌ అయినా ముందుగా ఉత్పత్తి చేసి నిల్వ చేయడం సాధ్యం కాదు.. నిరంతరం సరఫరా చేస్తూ ఉంటే అవసరమైన వారు ఉపయోగించుకుంటారు.. ఎంత ఉత్పత్తి చేయాలి అనే విషయంలో డిమాండ్‌ను బట్టి నిర్ణయాలు తీసుకోవాలి.. థర్మల్‌ ‌పవర్‌ ‌స్టేషన్లలో ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు బొగ్గు నిల్వలను అందుబాటులో ఉండేలా చూసుకోవాలి..

గత రెండు నెలలుగా దేశమంతా భారీ వర్షాల కారణంగా బొగ్గు గనుల్లో ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో ఇప్పుడు కోల్‌ ఇం‌డియా మీద ఒక్కసారిగా భారం పడింది. దీన్ని అధిగమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. విద్యుత్‌ అవసరాలను ఇందుకు అనుగుణంగా నియంత్రించుకోక తప్పదు.. ఈ కొరతకు ఒకరి మీద ఒకరు రాజకీయ విమర్శలు చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు..

బొగ్గు కొరత ఏర్పడానికి గల కారణాలు
1. సగానికి పైగా థర్మల్‌ ‌విద్యుత్‌ ‌కేంద్రాలు విదేశాలనుండి బొగ్గు దిగుమతి చేసుకొని విద్యుత్‌ ‌ని ఉత్పత్తి చేస్తున్నాయి.
2. ఇండోనేషియా ఇప్పటి వరకు ఒక టన్ను బొగ్గు కి గాను 60 డాలర్లు వసూలు చేసేది కానీ హఠాత్తుగా ధరలు పెంచేసి టన్నుకి 160 డాలర్లు అడుగుతున్నది అంటే టన్నుకి 100 డాలర్లు పెంచేసింది. దాంతో అంత ధర పెట్టి కొనలేని విద్యుత్‌ ‌కేంద్రాలు మన దేశంలోని బొగ్గు గనుల మీద ఆధారపడడం మొదలు పెట్టేసరికి బొగ్గు కి తీవ్ర కొరత ఏర్పడింది.
3. సాధారణంగా ప్రతీ మూడు లేదా ఆరు నెలల ముందు బొగ్గుకి ఆర్డర్‌ ‌చేస్తాయి విద్యుత్‌ ‌సంస్థలు. కానీ ఇండోనేషియా ఒక్క సారిగా ధరలు పెంచే సరికి దిగుమతిని ఆపేసాయి.
4. ఇక కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత విద్యుత్‌ ‌పేరుతో దుబారా చేస్తూ విద్యుత్‌ ‌సంస్థల పైన తీవ్ర ఒత్తిడిని తెస్తున్నాయి తక్కువ ధరకి విద్యుత్‌ ఇవ్వమని. పైగా తెర చాటు లంచాలు సరేసరి! ఇప్పుడు? బొగ్గు కొరత ఏర్పడగానే చేతులు ఎత్తి వేస్తున్నాయి.
5. ప్రతి 45 రోజులకి రాష్ట్ర విద్యుత్‌ ‌బోర్డులు విద్యుత్‌ ఉత్పత్తి చేసే కేంద్రాలకి చెల్లింపులు చేస్తుంటాయి. కానీ గత కొంత కాలంగా మూడు నుండి 6 నెలల దాకా బకాయి పడ్డాయి రాష్ట్ర విద్యుత్‌ ‌బోర్డులు. దాంతో చేతిలో డబ్బు లేక ముందు జాగ్రత్తగా బొగ్గుకి ఆర్డర్‌ ఇవ్వలేకపోయాయి. దాని ఫలితమే ఇప్పటి తీవ్ర బొగ్గు కొరత. వోట్ల కోసం ఉచితాలు ఇవ్వడం దేనికి? దాని ఫలితంగా విద్యుత్‌ ‌సంస్థలకి ఆలస్యంగా బిల్లులు క్లియర్‌ ‌చేయడం దేనికి? ఇప్పుడు బొగ్గు సరఫరా చేయమని ఒత్తిడి తేవడం ఎందుకు?
6. 2019 లో సెప్టెంబర్‌ ‌నెల కాలానికి 2021 సెప్టెంబర్‌ ‌నెల కాలానికి విద్యుత్‌ ‌డిమాండ్‌ 35% ‌పెరిగింది. అంటే 2019 కంటే 2021 కి ఎక్కువ డిమాండ్‌ ఉం‌ది. కోవిడ్‌ ‌తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఎకానమీ ఒక్కసారిగా పుంజుకోవడం తో ఆర్డర్లు ఎక్కువ అయి విద్యుత్‌ ‌కి డిమాండ్‌ ఏర్పడ్డది. 2020 కి గాను కోవిడ్‌ ‌వల్ల లెక్కలోకి తీసుకోలేదు.
7. ఇప్పటికే పంజాబ్‌ ‌లో విద్యుత్‌ ‌కోతలు మొదలయ్యాయి. లోడ్‌ ‌షెడ్డింగ్‌ ‌ని అమలు చేస్తున్నారు. పంజాబ్‌ ‌లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారు. పంజాబ్‌ ‌రైతులు ఇతర రాష్ట్రాల రైతులతో పోలిస్తే అత్యంత ధనవంతులు కాబట్టి ఇకనయినా ఉచిత విద్యుత్‌ ఆపేస్తారా? లేక ఎక్కువ ధరపెట్టి విదేశాలనుండి దిగుమతి చేసుకుంటారా?
8. ప్రస్తుతానికి 7 రాష్ట్రాలు తీవ్ర విద్యుత్‌ ‌కొరతని ఎదుర్కోబోతున్నాయి. భవిష్యత్తులో ఈ జాబితాలోకి మరిన్ని రాష్ట్రాలు చేరే అవకాశాలు ఉన్నాయి.
9. కేంద్రం ఇప్పటికే ఒక కోర్‌ ‌కమిటీని ఏర్పాటు చేసి రోజువారీగా పరిస్థితిని సమీక్షిస్తున్నది. కోల్‌ ఇం‌డియా తో పాటు ఇండియన్‌ ‌రైల్వేస్‌ ‌తో కూడా రోజువారీగా సమీక్షలు చేస్తున్నది కోర్‌ ‌కమిటీ. మొత్తం 135 థర్మల్‌ ‌విద్యుత్‌ ‌కేంద్రాలకి బొగ్గు సరఫరా చేయడానికి యుద్ధ ప్రాతిపదికన ఇండియన్‌ ‌రైల్వేస్‌ ‌వాగన్‌ ‌లని సమకూరుస్తున్నది బొగ్గు సరఫరా కోసం.
10. గత నెలలో పడ్డ తీవ్ర వర్షాలకి బొగ్గు గనులలో నీరు చేరి తవ్వకాలకి ఆటంకం ఏర్పడ్డది. యుద్ధ ప్రాతిపదికన గనులలో ఉన్న నీరుని శక్తివంతమయిన పంప్‌ ‌లతో బయటికి తోడిస్తున్నారు. బహుశా ఈ ప్రక్రియ ముగిసి మళ్ళీ బొగ్గు తవ్వకాలు మొదలవడానికి వారం పట్టవచ్చు. అప్పటి వరకు విద్యుత్‌ ‌కొరత తప్పదు.

కరెంట్‌ ‌కోతలు.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు
దేశంలో బొగ్గు కొరతతో విద్యుత్‌ ‌సంక్షోభం ముంచుకొస్తోందన్న భయాందోళనల నడుమ పలు రాష్ట్రాలు కరెంట్‌ ‌కోతలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లోడ్‌ ‌సర్దుబాటు కోసం విద్యుత్‌ ‌కోతలు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పలు కీలక సూచనలు చేసింది. ప్రజల అవసరాల కోసం కేంద్రం వద్ద ఉన్న కేటాయించని విద్యుత్‌’‌ను వాడుకోవాలని తెలిపింది. మిగులు విద్యుత్‌ ఉన్న రాష్ట్రాలు.. ఇతర రాష్ట్రాలకు ‘కరెంట్‌’ ‌సాయం చేయాలని కోరింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌ ‌మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. బొగ్గు కొరత ఆందోళనల నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు తమ వినియోగదారులకు కరెంట్‌ ‌సరఫరా చేయకుండా లోడ్‌ ‌సర్దుబాటు కోసం కోతలు విధిస్తున్నాయని మా దృష్టికి వచ్చింది. ఇదే సమయంలో వారు అధిక ధరలకు విద్యుత్‌ను విక్రయిస్తున్నట్లు కూడా తెలిసింది.

వినియోగదారులకు విద్యుత్‌ ‌సరఫరా చేసే బాధ్యత డిస్ట్రిబ్యూషన్‌ ‌కంపెనీలదే. ముందు వారు తమ వినియోగదారులకే సేవలందించాలి. 24ఐ7 విద్యుత్‌ అం‌దించాలి. తమ సొంత వినియోగదారులకు కరెంట్‌ ‌సరఫరా చేయకుండా విద్యుత్‌ను విక్రయించకూడదు’’ అని విద్యుత్‌ ‌మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ‘‘విద్యుత్‌ ‌కేటాయింపుల మార్గదర్శకాల ప్రకారం.. సెంట్రల్‌ ‌జనరేటింగ్‌ ‌స్టేషన్ల వద్ద 15శాతం విద్యుత్‌ను ఏ రాష్ట్రాలను కేటాయించకుండా ఉంచడం జరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్‌ అవసరమున్న రాష్ట్రాలకు కేంద్రం దీన్ని కేటాయిస్తుంది. ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా ఆ ‘కేటాయించని విద్యుత్‌’‌ను రాష్ట్రాలు ఉపయోగించుకుని తమ ప్రజలకు కరెంట్‌ ‌సరఫరా చేయాలని కోరుతున్నాం. ఒకవేళ మిగులు విద్యుత్‌ ఉన్న రాష్ట్రాలు.. ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. ఆ మిగులు విద్యుత్‌ను కరెంట్‌ అవసరమున్న రాష్ట్రాలకు కేటాయించేందుకు వీలుంటుంది’’ అని పేర్కొంది.

వినియోగదారులకు విద్యుత్‌ ‌సరఫరా చేయకుండా.. కరెంట్‌ను అధిక ధరకు విక్రయించే రాష్ట్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం ఈ సందర్భంగా హెచ్చరించింది. అలా చేసే రాష్ట్రాలకు ‘కేటాయించని విద్యుత్‌’‌ను ఉపయోగించుకునే వెసులుబాటును ఉపసంహరించి.. దాన్ని ఇతర రాష్ట్రాలకు కేటాయిస్తామని స్పష్టం చేసింది. ఏది ఏమైనా బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడి థర్మల్‌ ‌విద్యుత్‌ ‌శక్తి ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలిగి కరెంటు కోతలతో ప్రజలు అతలాకుతలం అయ్యే పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరము సహకరించుకుని విద్యుత్‌ ‌కోతలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడవలసిన బాధ్యత ఉంది.
– పిన్నింటి బాలాజీ రావు
హనుమకొండ, 9866776286

Leave a Reply