Take a fresh look at your lifestyle.

నేడు గజ్వేల్‌ ‌నియోజకవర్గంలో సిఎం కేసీఆర్‌ ‌పర్యటన

  • హల్దీవాగులోకి 1600 క్యూసెక్కుల నీరు విడుదల
  • 8 నుంచి 10 రోజుల్లో హల్దీ, మంజీర నుండి నిజాంసాగర్‌లోకి గోదావరి జలాలు
  • మంత్రి హరీష్‌రావు వెల్లడి

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంగళవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ ‌నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ…వర్గల్‌ ‌మండలంలోని అవుసలపల్లిలో సంగారెడ్డి కెనాల్‌ ‌నుంచి హల్దీవాగు కాలువలోకి గోదావరి జలాలను సిఎం కేసీఆర్‌ ‌విడుదల చేస్తారన్నారు. అదే విధంగా మర్కూక్‌ ‌మండలంలోని పాములపర్తిలో గోదావరి జలాలను గజ్వేల్‌ ‌కాలువలోకి విడుదల చేస్తారన్నారు. హల్దీవాగు కాలువలోకి 1600 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తారనీ, 8 నుంచి 10 రోజుల్లో హల్దీ, మంజీర నుండి నిజాంసాగర్‌లోకి గోదావరి జలాలు చేరుతాయన్నారు. హల్దీ, మంజీర నుండి నిజాంసాగర్‌లోకి గోదావరి జలాల విడుదలతో 32 చెక్‌ ‌డ్యాంలు నిండనున్నాయనీ,  చెక్‌ ‌డాంలలో 0.62 టిఎంసిల నీరు నిల్వ ఉంటుందన్నారు. గోదావరి జలాల విడుదలతో వేసవి కాలంలో 14 వేల 268 ఎకరాలలోని వరి పంటను కాపాడుకోగలుగుతామన్నారు. రైతుల దశ, దిశ మార్చే సందర్భం ఇది అని, నదికి కొత్త నడక నేర్పిన అపురూప ఘట్టమన్నారు. గజ్వేల్‌లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానున్నదన్నారు. రైతుల పంటలను కాపాడాలన్న ఉద్దేశ్యం, కోవిడ్‌ ‌నేపథ్యంలో ప్రజలు, రైతుల సమక్షంలో వేడుకగా జరుపుకోవాల్సిన ఘట్టంను సాదాసీదాగా జరుపుతున్నామన్నారు. భూ సేకరణ కు సహకరించి గోదావరి జలాల గజ్వేల్‌కు వచ్చేందుకు సహకారం అందించిన రైతులకు ధన్యవాదాలనీ, అలాగే ప•ంటను కాపాడేందుకు గోదావరి జలాలను విడుదల చేయనున్న సందర్భంలో రైతాంగం పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు మంత్రి హరీష్‌రావు ధన్యవాదాలు తెలిపారు. సిఎం కేసీఆర్‌ ‌పర్యటనకు సంబంధించి జిల్లా కలెక్టర్‌, ‌పోలీస్‌ ‌కమిషనర్‌తో కలిసి  సిఎం పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు మంత్రి హరీష్‌రావు పలు సలహాలు, సూచనలు చేశారు.

Leave a Reply