Take a fresh look at your lifestyle.

ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన ఆదేశాలివ్వండి

  • ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్‌ ‌లేఖ
  • ఎఫ్‌సీఐ అయోమయానికి గురి చేస్తున్నదని వెల్లడి
  • గత రబీకి సంబంధించి 5 లక్షల టన్నులు కొనుగోలుకు వినతి

ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌బుధవారం లేఖ రాశారు. కొనుగోళ్లపై ఎఫ్‌సీఐకి ఆదేశాలివ్వాలని సీఎం తన లేఖలో ప్రధానికి విజ్ఞప్తి చేశారు. 2020-21 సంవత్సరం రబీకి సంబంధించి మిగిలిన 5 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం కూడా కొనుగోలు చేయాలని వినతి చేశారు. ఈ సంవత్సరం ఖరీఫ్‌కు సంబంధించి 40 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం కూడా కొనుగోలు చేయాలని సీఎం కెసిఆర్‌ ‌లేఖలో ప్రతిపాదించారు. పంజాబ్‌ ‌తరహాలో తెలంగాణలో కూడా ధాన్యం సేకరణ చేపట్టాలని సూచించారు. వొచ్చే రబీకి సంబంధించి రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొంటారో స్పష్టం చేయాలని కోరారు. కొనుగోళ్లపై ఎఫ్‌సీఐ తీరుతో రాష్ట్రాల్లో గందరగోళం నెలకొందని, రాష్ట్రాల నుంచి సేకరించే మొత్తంపై ఎఫ్‌సీఐ స్పష్టత ఇవ్వడం లేదని, ఏటా ఉత్పత్తి పెరుగుతున్నా సేకరించే మొత్తం పెరగట్లేదని సీఎం కెసిఆర్‌ ‌తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వ్యవసాయరంగంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని సీఎం పేర్కొన్నారు.

వినూత్నమైన పద్ధతులతో రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న వరుస పథకాల మూలంగానే వ్యవసాయ రంగంలో ఇంతటి అభివృద్ధి సాధ్యమైందన్నారు. 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును పూర్తి ఉచితంగా అందిస్తున్నామని, ప్రతి ఏటా ఎకరానికి రూ.10,000 ‘రైతు బంధు’ పేరుతో పంట పెట్టుబడి ప్రోత్సాహకాన్ని రాష్ట్ర రైతుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదని, కష్టజీవి అయిన తెలంగాణ రైతు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుంటూ గుణాత్మకంగా దిగుబడిని సాధిస్తున్నాడని, తద్వారా దేశ ప్రగతికి దోహదం చేస్తున్నాడని సీఎం కేసీఆర్‌ ‌తన లేఖలో వెల్లడించారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు, ఎక్కడ చూసినా తెలంగాణలో కరువు కాటకమే తాండవించేందని, నేడు రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన సాగునీటి లభ్యత ద్వారా, రాష్ట్రం తన అవసరాలను దాటుకుని ఆహార ధాన్యం దిగుబడిలో మిగులు రాష్ట్రంగా నిలిచిందని, రాష్ట్ర రైతు నేడు దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన ప్రగతి ప్రస్థానం గురించి మీకు తెలియనిది కాదని మోదీని ఉద్దేశించి లేఖలో పేర్కొన్నారు. సురక్షిత నిల్వలను కొనసాగిస్తూ, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం, గోధుమలు వంటి ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తూ.. దేశ ప్రజలకు ఆహార భధ్రతను కల్పించే తప్పనిసరి బాధ్యతలను నెరవేర్చాల్సిన ఎఫ్‌సీఐ అసంబద్ధ విధానాలను అవలంబిస్తూ, అటు రైతులను ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను అయోమయానికి గురి చేస్తున్నదని లేఖలో సీఎం కేసీఆర్‌ ‌పేర్కొన్నారు.

ఎఫ్‌సీఐ ఏడాదికి సరిపడా ధాన్యం సేకరించే లక్ష్యాలను ఒకేసారి నిర్ధారించడం లేదని తెలిపారు. ప్రతి ఏటా ధాన్యం దిగుబడి పెరుగుతున్నదని తెలిసినా ధాన్యాన్ని వేగవంతంగా సేకరించడం లేదని చెప్పారు. ఎఫ్‌సీఐ అయోమయ విధానాల వలన సరియైన పంటల సాగు విధానాన్ని రైతులకు వివరించేందుకు రాష్ట్రాలకు ప్రతిబంధకంగా మారిందని, 2021 వానాకాలం సీజన్‌లో రాష్ట్రంలో 55.75 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల వరిధాన్యం దిగుబడి అయిందని, కానీ అందులో కేవలం 32.66 లక్షల మెట్రిక్‌ ‌టన్నులను మాత్రమే ఎఫ్‌సీఐ సేకరించిందని, అది పండిన పంటలో కేవలం 59 శాతం ధాన్యం మాత్రమేనని, ఇది 2019-20 వానాకాలంలో సేకరించిన ధాన్యం కంటే 78 శాతం తక్కువ అని, ధాన్యం సేకరణలో ఇటువంటి విపరీత తేడాలుంటే రాష్ట్రంలో హేతుబద్దమైన పంట విధానాలను అమలు చేయడానికి ఇబ్బందిగా మారుతుందని కేసీఆర్‌ ‌తన లేఖలో పేర్కొన్నారు. ఇటువంటి అయోమయ పరిస్థితులను తొలగించి ధాన్యం సేకరణలో నిర్దిష్టమైన లక్ష్యాన్ని నిర్దారించడం కోసం కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్‌ ‌గోయెల్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌ 25, 26 ‌తేదీల్లో తానే స్వయంగా వెళ్లి కలిశానని, వార్షిక ధాన్య సేకరణ లక్ష్యాన్ని తక్షణమే నిర్ధారించాలని తాను విజ్జప్తి చేశానని, కేంద్ర మంత్రికి విజ్జప్తి చేసి 50 రోజులు దాటిపోయినా ఎటువంటి సమాచారం లేదని, ఇంతవరకు ఎటువంటి విధాన నిర్ణయాన్ని తీసుకోలేదని కేసీఆర్‌ ‌తన లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply