*సన్నద్ధంగా ఉండాలి..కలెక్టర్లతో సిఎస్ సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్
*‘ధరణి’ దేశంలోనే ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందన్న సిఎస్
రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ నెల 25వ తేదీన ధరణి పోర్టల్‌ను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలియజేసారు. శనివారం బిఆర్కెఆర్ భవన్లో సిఎస్ జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, తహశిల్దార్లు, నాయిబ్ తహశిల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధరణి పోర్టల్ పనితీరుపై ప్రెజెంటేషన్ రూపంలో వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆయన మాట్లాడుతూ ధరణి పోర్టల్ సేవలు పారదర్శకంగా, జవాబుదారీతనం, భద్రత, రక్షణ, సులభతరంగా మరియు విచక్షణాధికారాలు లేకుండా ఉంటాయని, ఇది వినూత్నమైనదని దేశంలోనే ట్రెండ్ సెటర్‌గా నిలుస్తుందని అన్నారు. సిఎం విజన్ మేరకు ధరణి పోర్టల్ పారదర్శకంగా పనిచేయడంతో పాటు విచక్షణాధికారాల దుర్వినియోగాన్ని తొలగిస్తుందన్నారు. ఈ పోర్టల్ ద్వారా 570 మండలాల్లో తహసిల్దార్లు జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా పనిచేస్తారని, 142 ప్రాంతాలలో సబ్ రిజిస్ట్రార్లు వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్ చేస్తారని సిఎస్ అన్నారు. ధరణి పోర్టల్ కార్యకలాపాలకు అవసరమైన సిబ్బంది, వసతులతో 100 శాతం సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఆయన ఈ సందర్భంగా కోరారు. ఆదివారంలోగా తహసిల్దార్లందరూ ప్రయోగాత్మకంగా ధరణి పోర్టల్ ద్వారా కనీసం 10 లావాదేవీలను చేపట్టాలన్నారు.