- ఆ దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది
- వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
- టీఎస్ఎంఎస్ఐడిసి చైర్మన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్ బాధ్యతల స్వీకారం
హైదరాబాద్, ప్రజాతంత్ర ప్రతినిధి :
ఆరోగ్య తెలంగాణగా రాష్ట్రం మారాలన్నదే సీఎం కేసీఆర్ కల అని వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని దవాఖానాలలో మొత్తం రూ.150 కోట్ల వ్యయంతో అత్యాధునిక సిటి, ఎంఆర్ఐ, పిఇటి స్కాన్ యంత్రాలను నెలకొల్పుతున్నదని చెప్పారు. బుధవారం టీఎస్ఎంఎస్ఐడిసి చైర్మన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కొరోనా సమయంలో దేశంలోనే కొరోనా కిట్లు, పీపీఈ కిట్లు, ఆక్సీజన్, మందులు, రెమిడెసివీర్ కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ టీఎస్ఎంఎస్ఐడీసి ఎంతో చాకరక్యంగా వ్యవహరించి వాటిని సేకరించి ఎంతో మంది కొరోనా బాధితుల ప్రాణాలను కాపాడిందని చెప్పారు.
పేషంట్లకు త్వరితగతిన ఆరోగ్య పరీక్షలు, మందులు అందించే ఒక గొప్ప బాధ్యత చైర్మన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్‌పై ఉందనీ, సంస్థను సమర్థవంతంగా నడుపుతూ వందకు వంద శాతం పదవికి న్యాయం చేకూరుస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దవాఖానాలలో వైద్య సదుపాయాలు కల్పించే సంస్థ టీఎస్ఎంఎస్ఐడీసికి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనను అభినందించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌కు చెందిన 14 దవాఖానాల ఆధునీకరణ, 83 దవాఖానాలకు బలోపేతం చేయడంలో టీఎస్ఎంఎస్ఐడిసి కీలకంగా వ్యవహరించిందని చెప్పారు. 19 హబ్ అండ్ స్పోక్ మోడల్ డయాగ్నస్టిక్స్ సేవలు అందించే కేంద్రాలతో పాటు 8 మినీ హబ్‌లను సైతం ఏర్పాటు చేసిందన్నారు.
ప్రభుత్వ దవాఖానాలలో భవనాలు, మెడికల్ డివైసెస్, ఫర్నీచర్, మందులు, మెడికల్ ఎక్విప్మెంట్ నిర్వహణ, శానిటైజేషన్, దవాఖానాల భద్రతకు అవసరమైన సెక్యూరిటీ ఏర్పాట్లుతో పాటు వైద్యారోగ్య శాఖకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కల్పించే బాధ్యతను టీఎస్‌ఎంఎస్‌ఐడీసీనే చూస్తుందనీ, దీనికి చైర్మన్‌గా నియమితులైన ఎర్రోళ్ల తన అనుచరునిగా ఆ సంస్థకు మరింత ముందుకు నడపాలని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు.