Take a fresh look at your lifestyle.

మొన్న సికిందరాబాద్‌ ‌గాంధీ.. నిన్న వరంగల్‌ ‌గాంధీ..!

ప్రతిపక్షాల విమర్శలు, ప్రజల ఆక్రందనలేవైతనేమి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలోని రెండు ప్రధానమైన హాస్పిటల్స్  ను సందర్శించడంతో కొంత స్వాంతన ఏర్పడింది.ఆయా హాస్పిటల్స్ లో వైద్యం పొందుతున్న కొరోనా బాధితులకు    కొంత భరోసా ఏర్పడింది. రాష్ట్రంలో కొరోనా  వ్యాప్తి ప్రారంభమై దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు కాగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌మొట్టమొదటిసారిగా సికిందరాబాద్‌లోని గాంధీ దవాఖానాను గురువారం సందర్శించిన మరుసటిరోజే వరంగల్‌లోని మహత్మాగాందీ స్మారక హాస్పిటల్  ని  సందర్శించి  ప్రభుత్వం మీవెంట ఉందన్న భావన కలిగించే ప్రయత్నం చేశారు.

 సాధారణంగా రాజకీయ నాయకుల తు.తు మంత్రం లాంటి పర్యటన కాకుండా ఈ రెండు హాస్పిటల్స్ ల్లోకూడా సావధానంగా ఒక్కో వార్డును తిరుగుతూ వ్యాధిగ్రస్థుల  సాధక బాధలు అడిగి తెలుసుకున్నారు. వరంగల్‌ ‌గాంధీ దవాఖానాలోనైతే ఎవరూ ఊహించని విధంగా కొరోనా పేషంట్లు ఉన్న వార్డులు కాకుండా ఇతర వార్డును కూడా చుట్టబెట్టడం విశేషమే మరి. గడచిన ఒకటిన్నర ఏళ్ళుగా కోవిడ్ -19తో ఎంతో మంది మృత్యువాత పడ్డారు. మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై పెద్దగా శ్రద్ద పెట్టలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రే అంత భయపడాల్సిందిలేదని మీడియా సమావేశాల్లో చెప్పుకొచ్చారు. కాని, రాజకీయ నాయకుల కన్నా మొండిదైన కొరోనా అనేక మందిని పొట్టన పెట్టుకుంది. మొదటిసారే దీని కట్టడిలో కొంత అలసత్వం జరిగినప్పటికీ సెకండ్‌ ‌వేవ్‌ గురించి శాస్త్రవేత్తలు ముందస్తుగా హెచ్చరించినప్పటికీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సి నంతగా జాగ్రత్తలు తీసుకోక పోవడంతో దేశం లక్షలాది మంది పౌరులను కోల్పోయింది.

ఈ విషయంలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య సమన్వయ లోపం కూడా కొంత లేకపోలేదు. ఇప్పుడు మూడవ వేవ్‌ ‌కూడా మరింత ప్రమాదకారి అంటున్నారు. దీని ప్రభావం చిన్నపిల్లల పై  అధికంగా పడే ప్రమాదముందని ముందస్తుగానే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. రెండవ వేవ్‌లో జరిగినంతగా మూడవ వేవ్‌ ‌ద్వారా నష్టం జరుగకుండా ఉండాలంటే ప్రజలందరూ వాక్సినేషన్‌ ‌చేసుకోవాల్సిన అవసరం ఎంత్తైనా ఉంది. అయితే రాష్ట్రాలన్నిటికీ అవసరమైనంతగా వాక్సిన్‌లు పంపిణీచేయడంలో కేంద్రం పారదర్శకంగా వ్యవహరించడంలేదన్న  విమర్శ ఉంది. ఏదైతేనేమీ రాష్ట్రంలో ప్రారంభించిన వాక్సినేషన్‌ ఇప్పుడు అర్దాంతరంగా ఆగిపోయింది.

రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాను కేవలం మూడు జిల్లాల్లోనే ఇప్పుడీ ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది. ప్రధానంగా రెండవ వాక్సిన్‌ ‌వేసుకునేవారి గడువును పెంచుతూ పోతున్నారు. దానికి శాస్త్రీయ కారణమేదో చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ దవాఖానాల్లో   చికిత్స పొందుతున్న వారి పరిస్థితి కడు దీనంగా ఉన్న విషయం రోజూ ఎలక్ట్రానిక్‌ ‌మీడియాలో, వార్తా పత్రికల్లో పుంఖాను పుంకాలుగా వార్తలు వొస్తున్నాయి. ప్రభుత్వ దవాఖానల తీరుపై ప్రతిపక్షాల విమర్శలకు గత రెండు రోజులుగా రెండు ప్రధాన హాస్పిటల్స్  ను సందర్శించడం ద్వారా ముఖ్యమంత్రి కెసిఆర్‌ అడ్డుకట్ట అయితే వేయగలిగారు. అయితే ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఈ రెండు హాస్పిటల్స్  ను ఆరోజు మాత్రం తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు.

అంతవరకున్న అపరిశుభ్ర పరిస్థితిని ముఖ్యమంత్రి కంటికి కనిపించకుండా చేయగలిగారు. అలాగే జబ్బుకు గురయిన వారి  తాకిడి, మందులు, ఆక్సీజన్‌ ‌సరవఫరా పరిస్థితి సంతృప్తికరంగా ఉన్నట్లు ఈ రెండు హాస్పిటల్స్  ల్లో ఆయనకొచ్చిన ప్రత్యక్ష సమాచారం. కాని, పరిస్థితులు  వేరే విధంగా ఉన్నాయంటున్నారు వ్యాధిగ్రస్థుల  తాలూకు సంబంధితులు , విపక్ష నాయకులు.  విచిత్ర కర విషయమేమంటే అంతవరకు అరిచి గోల పెట్టిన వ్యాధిగ్రస్థులు , వారి  బంధువులు ఎవరు కూడా ధైర్యంగా ముందుకొచ్చి వాస్తవ పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించినట్లు లేదు. కాని, అంతకుముందు ప్రతిపక్ష నాయకులు, ముఖ్యంగా బిజెపి నాయకుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సికిందరాబాద్‌ ‌గాంధీ హాస్పిటల్  ని సందర్శించినప్పుడు అక్కడున్న అనేక లోపాలను ఆయన ఎత్తిచూపారు. అలాగే వరంగల్‌ ఎం‌జిఎంలోకూడా ఉన్న లోపాలను పత్రికా ముఖంగా పలువురు ప్రతిపక్ష నాయకులు వెల్లడించిన విషయం తెలిసిందే.

అక్కడగాని, ఇక్కడ గాని ఉన్న బెడ్స్‌కు, చేరుతున్న పేషంట్ల సంఖ్యకు తగినట్లుగా చికిత్సను అందజేసేందుకు కావాల్సిన మెడికల్‌ ‌సిబ్బంది లేనివిషయం కొట్టవచ్చినట్లు కనిపించింది. ప్రైవేటు హాస్పిటల్స్  ల్లో లక్షలాది రూపాయలు వెచ్చించి చికిత్స చేయించుకునే స్తోమత లేని వారు కుప్పలుగా చేరుతున్న ఇలాంటి ప్రభుత్వ హాస్పిటల్లో  ఉన్న వసతులు, కావాల్సిన ఏర్పాట్లపై ఏడాదిన్నర తర్వాత విచారించడంపై విపక్షాలిప్పుడు విరుచుకుపడుతున్నాయి.  పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే  ఆరోగ్య వైద్యశాఖ మంత్రిని కూడా బర్తరఫ్‌ చేసి ఇంత ఆలస్యంగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేట్టడమేంటని వారు ఆరోపిస్తున్నారు. ఈ రెండు చోట్ల కొత్త భవనాలను నిర్మించాలన్న ప్రభుత్వ ఆలోచన సరైందే అయినా ముందీ గడ్డు కాలాన్ని ఎలా ఎదుర్కోవాలన్న  దానిపైనే ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

Leave a Reply