Take a fresh look at your lifestyle.

కెసిఆర్‌ ‌గాంధీ హాస్పిటల్‌ ‌సందర్శన

రాష్ట్రముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం సికింద్రాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌  ‌సందర్శించారన్న వార్తను ముఖ్యంగా తెలుగు ఛానల్స్ ‌విపరీతమైన  ప్రాధాన్యాన్నిచ్చాయి. ముఖ్యమంత్రి కార్యక్రమాలకు ఛానల్స్ ‌ప్రాధాన్యమివ్వడమన్నది చాలా సహజమైనదే అయినప్పటికీ ఈరోజు సందర్శన వార్తకు ప్రత్యేకత ఉంది. గత సంవత్సరం రాష్ట్రంలో కోవిద్‌-19  ‌మార్చ్‌లో మొదలై పద్నాలుగు నెలల కాలంలో పెద్ద విధ్వంసాన్ని లేవదీసింది.

వేల సంఖ్యలో జనం ఆ వైరస్‌ ‌బారినపడితే ..అందులో వందల సంఖ్యలో   ప్రాణాలు వదిలారు. వైరస్‌ ‌సోకిందంటే చాలు ‘నా’ అన్నవారెవరూ వారి దరిదాపుల్లోకి రావడానికి భయపడటంవల్ల, సొంత  వారుండికూడా అనాదల్లా మారి, చివరకు సంప్రదాయ అంతిమ సంస్కారానికి కూడా నోచుకోని భీభత్స బతుకులు వెళ్ళదీస్తున్న పరిస్థితిలో మొదటిసారిగా కోవిద్‌ ‌వ్యాధిగ్రస్తుల  పరిస్థితిని తెలుసుకోవడానికి గాంధీ దవాఖానా కు  రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కెసిఆర్‌ ‌రావడం నిజంగానే ఛానల్స్‌కు ప్రముఖమైన వార్త ఎలా కాకుండా పోతుంది. అందునా ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్‌ను పదవీబ్రష్టుడిని చేసి, ఆ శాఖను తానే స్వయంగా నిర్వహిస్తున్న  సందర్భంలో కెసిఆర్‌ ‌స్వయంగా పరిస్థితిని అంచనావేసేందుకు దవాఖానా   సందర్శించి, ముఖ్య నిర్ణయాలేమి తీసుకుంటారన్నది అందరికీ అత్యంత ఆసక్తిని కలిగించే అంశం.

కొరోనా ఇప్పుడు పల్లెలకు కూడా పాకింది. జిల్లా స్థాయిలో నిర్వహించే చికిత్స కన్నా రాష్ట్ర రాజధానిలో మెరుగైన చికిత్స లభిస్తుందన్న ఉద్దేశ్యంతో కొరోనా సోకిన వాళ్లంతా  హుటాహుటిన హైదరాబాద్‌ ‌బాట పట్టడంతో నగరంలోని దవాఖానా  పైన వొత్తిడి పెరిగింది. ఏ హాస్పిటల్‌ ‌లో  కూడా వారికింత చోటు దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి. నేనురాను బిడ్డో సర్కార్‌ ‌దవాఖానాకు అన్న సినీపాటను అప్పుడెప్పుడో విని నవ్వుకున్నాం గాని, నేటికి ఆ పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. ప్రాణం మీదకు వొచ్చిందని నగరంలోని హాస్పిటల్స్ అన్నీ  చుట్టబెట్టినా బెడ్స్‌లేవు, ఆక్సీజన్‌లేదు, వెంటీలేటర్‌ ‌లేదంటూ బయటికి పంపించడమన్నది సాధారణంగా మారిందన్నది గత కొంతకాలంగా మీడియాలో వొస్తున్న వార్తలే ప్రత్యక్ష సాక్ష్యం. ఒక వేళ ప్రైవేటు హాస్పిటల్స్  ‌ల్లో చేర్చుకున్నా ముక్కుపిండి ముందుగానే డబ్బులు లక్షల్లో వసూలు చేస్తున్నారు. లక్షల రూపాయలు చెల్లించినా మనిషి బతికి వస్తాడన్న నమ్మకంలేకుండా పోయింది. చివరకు శవాన్ని తీసుకెళ్లాలంటే కూడా ఆ లక్షలకు మరిన్ని లక్షలు చెల్లిస్తేనే శవాన్ని తీసుకెళ్ళ లేని పరిస్థితి. ఇంతటి ఘోరకలి నడుస్తున్న ఈ రోజుల్లో వాస్తవ పరిస్థితిని కనులారా చూడడానికి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గాంధీ హాస్పిటల్‌  ‌ని సందర్శించడమన్నది మీడియాకు నిజంగానే ముఖ్యమైనవార్తేమరి.

సరిగ్గా ఏడాది క్రితం కొరోనా మొదటివేవ్‌లోనే ప్రజలు భయాందోళనకు గురైన సందర్భంలో వారి భయాన్ని తొలగిస్తూ ముఖ్యమంత్రి హోదాలో కెసిఆర్‌ ‌ప్రభుత్వం చేపట్టిన పనులను ఏకరువుపెట్టి ఎట్టిపరిస్థితిలోనూ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభయమిచ్చారు. ఇవ్వాళ సందర్శించిన గాంధీ హాస్పిటల్‌  ‌ని కోవిద్‌ ‌పేషంట్లకోసం సిద్దంచేసినట్లు ఆనాడే చెప్పారు. ఆనాడు కోవిద్‌ ‌పేషంట్ల కోసం నోటిఫై  చేసిన ఎనిమిది హాస్పిటల్స్  ‌ల్లో సికిందరాబాద్‌ ‌గాంధీ హాస్పిటల్‌  ‌ముఖ్యమైంది. ఐసియు వార్డులు , వెంటీలేటర్స్, ఆక్సీజన్‌ ‌బెడ్స్, ఐసోలేషన్‌ ‌వార్డులు  లాంటి అన్ని సౌకర్యాలను అందులో ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఎవరికి కొరోనా పాజిటివ్‌ ‌వొచ్చినా, వారు కోటీశ్వర్లుగాని, లక్షాధికారులుగాని గాంధీ కి రావాల్సిందే, చికిత్స తీసుకోవాల్సిందే. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదన్నారు.

అయితే విచిత్ర మేమంటే కొరోనా సెకండ్‌వేవ్‌లో వందలాదిమంది ఇక్కడ చికిత్స పొందలేకపోయారు. ఎప్పుడు చూసినా బెడ్స్ ‌లేవనో, ఆక్సీజన్‌ ‌లేదనో కోవిద్‌ ‌పేషంట్లను తిప్పి పంపించడం, నగరంలోని ఇతర హాస్పిటల్స్  ‌ల్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తడంతో హాస్పిటల్స్  ‌ల చుట్టూ గంటలకొద్ది తిరిగి చివరకు అంబులెన్స్‌ల్లోనే ప్రాణాలు వదిలిన సంఘటనలనేకం చోటుచేసుకున్నాయి. కొవిద్‌ ‌పేషంట్ల పరిస్థితేకాదు, మల్లాపూర్‌కు చెందిన నిండు గర్భిణి పావని కొన్ని గంటలపాటు హాస్పిటల్స్  ‌చుట్టు తిరిగి చివరకు ఓ ప్రభుత్వ దవాఖానా  లో ఆక్సీజన్‌ అం‌దక చనిపోయినవార్త పలువురిని కలిచివేసింది. ప్రైవేటు హాస్పిటల్స్   ‌కు వెళ్ళలేక, ప్రభుత్వ హాస్పిటల్స్  ‌ల్లో ఉండలేక ప్రజలు నరకయాతన అనుభవిస్తున్న పరిస్థితిని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు అనేకం వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశాయి. పాలకులు చెబుతున్నట్లు  నిజంగానే ప్రభుత్వ దవాఖానాల్లో  ల్లో అన్ని వసతులుంటే తాజాగా స్వయంగా కోవిద్‌ ‌బాధితుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి యశోద  హాస్పిటల్‌  ‌వర్గాలతో ఎందుకు చికిత్స చేయించుకున్నాడు అని   ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఎంతటి వారైనా గాంధీ హాస్పిటల్‌  ‌లో చికిత్స చేయించుకోవాల్సిందే నని ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ ఆయన కుమారుడు, ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌కూడా గాంథీ హాస్పిటల్‌  ‌సేవలను ఎందుకు వినియోగించుకోలేదని వారు ప్రశ్నిస్తున్నారు. వీరేకాదు ఎంపి సంతోష్‌ అయితేనేమీ తాజగా మరో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అయితేనేమీ వీరందరికీ గాంధీ హాస్పిటల్‌  ‌సేవలు ఎందుకు పనికిరాకుండా పోయాయన్నది వారి ప్రశ్న.

అసలు గాంధీ హాస్పిటల్‌  ‌లో ఏం జరుగుతోందంటూ ప్రతిపక్షాల సందర్శన మొదలైంది. కాంగ్రెస్‌, ‌బిజెపి నాయకులు అక్కడి లోపాలను సవరించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేయడం ప్రారంభమైంది. నిర్విరామంగా పనిచేస్తున్న డాక్టర్లకు, నర్సులకు కనీస భోజన సదుపాయాలుకూడా లేకపోవడంపట్ల కాంగ్రెస్‌ ఎం‌పి రేవంత్‌రెడ్డి తీవ్రంగా విమర్శిస్తున్నారు. పేషంట్‌ అటెండర్ల అవస్థలు  వర్ణనాతీతమని, లాక్‌న్‌డౌన్‌ ‌సమయంలో తిండికి, మంచినీళ్ళకు నోచుకోలేని దురవస్థ లో  ఉన్నవారిని తమ పార్టీ ఆదుకుంటుంటే ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ ఆయన ఆరోపిస్తున్నారు. బిజెపికి చెందిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, డాక్టర్లు, నర్సులు, టెక్సీషన్లు, పారామెడికల్‌ ‌స్టాఫ్‌ ‌కొరతను ఎత్తిచూపారు. ఇంతటి ఎమర్జన్సీ సమయంలో గాంధీలో మూలకు పడేసిన వెంటీలేటర్స్‌ను బాగుచేసే దిక్కులేకపోవడంపట్ల ఆయన విచారం వ్యక్తంచేశారు. పాజిటివ్‌ ‌పేషంట్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో  గాంధీలోని లైబ్రరీ విభాగంలో మరో మూడు వందల బెడ్స్‌కు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. వీటన్నిటినీ క్రోడీకరించుకుని గత రెండు రోజులుగా దీనిపై సమీక్ష  చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు బుధవారం గాంధీ హాస్పిటల్‌  ‌ని సందర్శించారంటే ఏదో గోప్ప నిర్ణయం తీసుకుంటారన్నది అందరి భావన. అందుకే మీడియాకు ఇది అత్యంత ప్రాధాన్యత  వార్త అయింది.

Leave a Reply