Take a fresh look at your lifestyle.

యాదాద్రిలో చురుకుగా నిర్మాణ పనులు

  • నేడు ఆలయాన్ని సందర్శించనున్న సిఎం కెసిఆర్‌ ?
  • ‌భద్రత కట్టుదిట్టం.. సిఎం రాకతో పోలీసుల అప్రమత్తం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మరోమారు పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రిని సందర్శించనున్నట్లు తెలుస్తోంది. అక్కడి పనులను పర్యవేక్షించేందుకు ఆదివారం ఆయన యాదాద్రి వెళ్లే అవకాశమున్నట్లు సమాచారం. ఈ మేరకు సిఎం కెసిఆర్‌ ‌పర్యటన ఖరారైందని నేడు యాదాద్రిని సందర్శించి శరవేగంగా కొనసాగుతున్న ఆలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించబోతున్నారు. యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సక్షిస్తూనే ఉన్న సీఎం కేసీఆర్‌ ‌యాదాద్రికి వెళ్లి స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలి కాలంలో ఆయన యాదాద్రికి వెళ్లలేకపోయారు. అందులో భాగంగా ఆదివారం ఆయన యాదాద్రి పర్యటనకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఒక నివేదక రూపంలో సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో కేసీఆర్‌ ‌యాదాద్రి వెళ్లారు. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు వెళ్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా యాదాద్రి ఆలయ తుది దశ పనులు జరుగుతున్నాయి. ఆలయం చుట్టూ నిర్మిస్తున్న ఆరు వరుసల రింగ్‌ ‌రోడ్డు పనులు వేగంగా చేస్తున్నారు.

ఘాట్‌ ‌రోడ్డులో మొక్కల పెంపకం పనులు సాగుతున్నాయి. ఇటీవల మహాబలిపురం నుంచి తెప్పించిన విగ్రహాల అమరిక పనులు పూర్తి చేస్తున్నారు. కాంప్లెక్స్, ‌శివాలయం, పుష్కరిణి పనులు దాదాపు పూర్తి అయ్యాయి. ఆలయానికి నలుదిక్కులా సింహం, ఐరావతం విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. యాదాద్రి ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పునర్‌నిర్మిస్తోంది. దాదాపు రూ.2వేల కోట్లతో దీని నిర్మాణం చేపట్టింది. యాదాద్రి పుణ్య క్షేత్రానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు, పర్యాటకులు తరలివచ్చేలా అద్భుతంగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేదతీరేలా అక్కడ పచ్చదనం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలావుంటే కొరోనాతో యాదాద్రి ఆలయాన్ని మూసివేశారు. మూడురోజుల దర్శనాలు నిలిపివేశాక తాజాగా శనివారం మళ్లీ భక్తులకు అనుమతించారు. కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులకు అనుమతి ఇస్తున్నారు. దీంతో శనివారం ఆలయానికి మళ్లీ భక్తుల రాక మొదలయ్యింది.

యాదాద్రిలో భద్రత కట్టుదిట్టం..సిఎం రాకతో పోలీసుల అప్రమత్తం
సిఎం కెసిఆర్‌ ‌రానుండడంతో యాదాద్రిలో స్థానిక పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సిఎం ఆదివారం ఇక్కడికి వచ్చి మరోమారు పరివీలించనున్నారు. దీంతో కలెక్టర్‌, ఎస్పీలు అప్రమత్తం అయ్యారు. మరోవైపు ఇంజినీరింగ్‌, ‌వైటీడీఏ ఇన్‌చార్జి ఎస్‌ఈ ‌వసంత్‌నాయక్‌ ఇప్పటికే పనులను పరిశీలించారు. ఆలయం చుట్టూ నిర్మిస్తున్న ఆరు వరుసల రింగ్‌ ‌రోడ్డు పనులు, ఘాట్‌ ‌రోడ్డులో మొక్కల పెంపకం పనుల వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కొండకింద పాతఘాట్‌రోడ్డు సపంలో రోడ్డు విస్తరణకు స్థలం సేకరించే పరిసరాలు పరిశీలించారు. అలాగే ప్రధాన ఆలయ తుదిదశ పనులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. దక్షిణం వైపు జరుగుతున్న ఫ్లోరింగ్‌ ‌పనులు, ఇటీవల మహాబలిపురం నుంచి తెప్పించిన విగ్రహాల అమరిక పనులను పరిశీలించారు. పనులు నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ప్రసాదం కాంప్లెక్స్, ‌శివాలయం, పుష్కరిణిలో జరుగుతున్న పనులు పరిశీలించారు. అలాగే విగ్రహాల ఏర్పాటు, శిల్పాలను శుభ్రం చేసే పనులను ఆర్కిటెక్ట్ ఆనందసాయి, వైటీడీఏ వైస్‌ ‌చైర్మన్‌ ‌కిషన్‌రావు పరిశీలించారు. కాగా ఆలయ తుది దశ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆలయానికి నలుదిక్కులా సింహం, ఐరావతం విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం సిఎం కెసిఆర్‌ ‌వీటిని పరిశీలించనున్నారు. దీంతో ఇక్కడ భద్రతా ఏర్పాట్లను పోలీస్‌ అధికారులు పరిశీలించారు.

Leave a Reply