- కొరోనా సాకుతో ప్రజాందోళనలపై నిర్బంధం అఖిలపక్ష నేతల హెచ్చరిక
కొరోనాను సాకుగా చూపి ప్రజాందోళనలపై నిర్బంధాన్ని వెంటనే ఆపాలని అఖిలపక్ష నేతలు సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. సీఎం సహాయ నిధికి చేరిన విరాళాల లెక్కలను ప్రకటించాలనీ, ప్రైవేటు సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీవో 45 ప్రకారం ఆదాయ భద్రత కల్పించే అంశంపై శనివారం సీఎం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ప్రసంగం సందర్భంగా స్పష్టమైన హామీ ఇవ్వాలనీ, లేనిపక్షంలో ఈనెల 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈమేరకు శనివారం నాంపల్లిలోని టీజేఎస్ రాష్ట్రపార్టీ కార్యాలయంలో అఖిలపక్ష నేతలు ప్రొ.కోదండరామ్(టీజేఎస్), జి.వెంకటరెడ్డి (టీజేఎస్) చాడ వెంకటరెడ్డి (సీపీఐ), జూలకంటి రంగారెడ్డి (సీపీఎం), ఎల్.రమణ (టీడీపీ), కె.గోవర్ధన్ (న్యూడెమోక్రసీ) నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కోవిడ్ వ్యాప్తితో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ఉద్దేశ్యంతో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఉమ్మడి కార్యాచరణకు పూనుకున్నట్లు తెలిపారు.
ఇదే అంశంపై జూలై 23న సీఎంకు బహిరంగ లేఖ రాసినా ప్రయోజనం లేకపోవడంతో పది రోజుల పాటు వివిధ నిరసన రూపాలలో ఒత్తిడి పెంచినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చామనీ, 50 వేలకు పైగా హాజరుతో ఆన్లైన్ బహిరంగ సభ నిర్వహించి ప్రభుత్వం వైఫల్యాలను తెలంగాణ సమాజం ముందు ఉంచామనీ, వాటి సాధన కోసం ఆగస్టు 7న ప్రగతి భవన్‌ను ముట్టడించిన విషయాన్ని గుర్తు చేశారు. ఏ ఒక్క వినతినీ పట్టించుకోని సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆగస్టు 7న అఖిలపక్ష నేతలను అరెస్టు చేసి దుర్మార్గంగా వ్యవహరించిందని విమర్శించారు. అయినప్పటికీ కొరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న ప్రజల కోసం అలుపు లేని పోరాటం చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. కొరోనా వైరస్ వ్యాప్తితో ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లిందనీ, సామాజిక, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం హైకోర్టు చెప్పిన విధంగా విస్త•తంగా పరీక్షలు నిర్వహించాలనీ, కొరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారందరికీ ప్రతీ నెలా రూ. 7500 నిరుద్యోగ భృతి చెల్లాంచాలని విజ్ఞప్తి చేశారు. తొలగిన కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలనీ ఈ అంశాలన్నింటిపై శనివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ స్పష్టమైన హామీ ఇవ్వని పక్షంలో సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు స్పష్టం చేశారు.