- బీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలి
- తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగంలోకి తీసుకోవాలి
- సత్యాగ్రహ దీక్షలో ఆర్.కృష్ణయ్య డిమాండ్
ముషీరాబాద్, ఆగస్టు 24 (ప్రజాతంత్ర విలేఖరి) : బిసి కులాలకు బిసిల బంధు ప్రవేశ పెట్టి, ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు మంజూరు చేయాలని, చట్ట సభలలో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిందాలని, తొలగించిన 7651 మంది పిల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగంలోకి తీసుకోవాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఇందిరా పార్క్ ధర్నాచౌక్ లో సంఘం ఆధ్వర్యంలో సత్యాగ్రహ మహాదీక్ష చేపట్టారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అధ్యక్షతన వహించిన ఈ దీక్షకు బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ కృష్ణ, సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ సమన్వయ పరిచారు. టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు హాజరై మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి ‘దళిత బందు’ పథకం ప్రవేశపెట్టిన సందర్భంగా మాట వరసకు కూడా బీసీల పేరు ఉచ్చరించలేదని, దీంతో రెండు కోట్ల మంది బీసీలు తీవ్ర ఆందోళన, అసంతృప్తి వెళ్లబుచ్చుతున్నారన్నారు. బిసి బంధు పదకం ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి బిసి కుటుంబానికి రూ.10 లక్షల మంజూరు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. పల్లె పల్లెకు, ఇంటింటికీ ఉద్యమాన్ని చేరవేస్తామన్నారు. బీసీలలో అత్యంత వెనుకబడిన 130 కులాలు వృత్తులు కోల్పోయి రోడ్డున పడ్డారన్నారు. అసెంబ్లీ-పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వాన అఖిలపక్షాన్ని, బిసి సంఘాలను తీసుకెళ్లి ప్రధాన మంత్రితో చర్చలు జరిపి బీసీ బిల్లు పెట్టించాలని, లేని దేశంలో తిరుగుబాటు జరుగుతుందని హెచ్చరించారు.
18 నెలల క్రితం తొలగించిన గ్రామీణ ఉపాధి పథకం కింద పని చేసే ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకునే వరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. మనో వేదనతో 46 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు చనిపోయారన్నారు. ఈ ధర్నాలో కోలా జనార్దన్, నీల వెంకటేష్, శేఖర్ సగర, అంజి, ఉదయ్, ఆలే భాస్కర్, వేముల వెంకటేష్, మట్ట జయంతి, రామకృష్ణ, ఎల్లన్న తదితరులు పాల్గొన్నారు.