- బాలు లేని లోటు పూడ్చలేనిదని సంతాపం
- బాలుమృతికి మంత్రులు తదితరలు నివాళి
గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి తీవ్ర దిగ్భ్రాతిని వ్యక్తం చేశారు. బాలు కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాలు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది అని పేర్కొన్నారు. ఎన్నో సుమధుర గేయాలు పాడి ప్రజల అభిమానం సంపాదించారు అని గుర్తు చేశారు. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా సేవలు అందించారని సీఎం పేర్కొన్నారు. మహోన్నత గాయకుడు బాల సుబ్రహ్మణ్యం మృతి అటు సినీ ప్రపంచానికి, ఇటు సంగీత అభిమానులకు తీరని లోటు అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వేల పాటల ద్వారా ప్రజల మనుసుల్లో ఆయన సుస్థిరంగా నిలుస్తారు అని కేటీఆర్ పేర్కొన్నారు.
బాలు కుటుంబ సభ్యులకు మంత్రి కేటీఆర్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ గొప్ప గాయకుడిని కోల్పోయిందని మంత్రి హరీష్రావు, టీఆర్ఎస్ మాజీ ఎంపీ కవిత ట్వీట్ చేశారు. బాలు అసాధారణ కళాకారుడు అని కవిత పేర్కొన్నారు. బాలు మరణం తీరని లోటు అని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బాలు కుటుంబ సభ్యులకు కవిత ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం దురదృష్టకరం అని హరీష్రావు పేర్కొన్నారు. సినీ లోకానికి వారు చేసిన సేవలు వెలకట్టలేనివి. అనేక భాషలలో పాటలుపాడి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న బాలు లేని లోటు ఎన్నటికి పూడ్చలేనిది అని హరీష్రావు తెలిపారు.