వచ్చే నెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కార్యాచరణకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. గతంలో వాయిదా పడ్డ ఈ భేటీ 6న జరపాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి ఇరు తెలుగు రాష్ట్రాల సిఎంలను ఆహ్వానించారు. దీంతో సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్లో నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖకు సంబంధించిన సమగ్ర వివరాలను, కేంద్రానికి చెప్పాల్సిన అన్ని విషయాలకు సంబంధించిన వివరాలను తీసుకొని సమావేశానికి రావాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రాల పునర్విభజన చట్టాల ప్రకారం దేశంలో ఎప్పుడైనా కొత్త రాష్ట్రం ఏర్పడితే వెంటనే ఆ రాష్ట్రానికి జరిగే నీటిని కేటాయించాలి. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఏర్పడితే జూన్ 14న ప్రధాన మంత్రికి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రానికి నీటి కేటాంయిపులు జరపాలని కోరారు. ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ 1956 సెక్షణ్ 3 ప్రకారం ప్రత్యేక ట్రిబ్యూనల్ వేసైనా, లేదంటే ఇప్పుడున్న ట్రిబ్యూనల్ ద్వారా అయినా తెలంగాణాకి నీటి కేటాయింపులు జరపాలని కోరారు.
ఆంధప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్యనైనా, లేదంటే నదీపరివాహాల ప్రాంతాల్లోని మొత్తం రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరపాలని కోరామని సిఎం వెల్లడించారు. ఏడేళ్ల సమయం గడిచినా ప్రధాన మంత్రికి రాసిన లేఖకు ఈ నాటికి స్పందన లేదు. అందుకే 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా గట్టిగా ఎండగట్టాలని, తెలంగాణాకు నీటి కేటాయింపుల విషయంలో స్పష్టత ఇవ్వాలని పట్టుపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు చెప్పారు. ఆంధప్రదేశ్ రాష్ట్రం నదీ జలాల విషయంలో కావాలనే కెలికి కయ్యం పెట్టుకుంటున్నదని, అపెక్స్ సమావేశంలో ఆంధప్రదేశ్ రాష్ట్రం చేస్తున్న వాదనలకు ధీటైన సమాధానం చెప్పాలని, మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండబద్ధలు కొట్టినట్లు స్పష్టం చేయాలని, అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ నిష్కియ్రా పరత్వాన్ని, ఏడు సంవత్సరాల అలసత్వాన్ని ఈ సమావేశంలో తీవ్రంగా ఎండగట్టాలని, తెలంగాణ ప్రజల హక్కులను హరించడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రతిఘటించాలని, నిజానిజాలను ఈ సమావేశం సందర్భంగా యావత్ దేశానికి తేటతెల్లం చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోరుతున్న న్యాయమైన డిమాండ్ల విషయంలో అవసరమైన అన్ని వాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ మేరకు గురువారం జరిగే సమావేశంలో అన్ని అంశాలను చర్చించనున్నారు.