- దుబ్బాకలో టికెట్ ఎవరికి ఇవ్వాలో సిఎం కేసీఆర్ నిర్ణయిస్తారు
- బాబుకు చెప్పినట్లుగానే బిజెపికి గుణ పాఠం చెప్పాలి
- దుబ్బాకలో ప్రజలకు పిలుపునిచ్చిన మంత్రి హరీష్‌రావు
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ సర్కార్‌పై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, టిఆర్‌ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ తన్నీరు హరీష్‌రావు తనదైనశైలిలో మండిపడ్డారు. బిజెపి నేతల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దున్నపోతుకు గడ్డేసి బర్రెను పాలివ్వమన్నట్లుగా కేంద్రంలోని బిజెపి నేతల మాటలున్నాయన్నారు. బిజెపి నేతల మాటలు నమ్మి ప్రజలు మోసపోకూడదన్నారు. మీ ప్రేమను మాకివ్వండి. మీ సేవకులుగా పనిచేసి మీ రుణం తీర్చుకుంటామన్నారు మంత్రి హరీష్‌రావు. సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో గల చల్లాపూర్, మనెమ్మ గడ్డ, లచ్చపేటలో సోమవారం మంత్రి పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ…రైతుల ఉసురుపోసుకునే ప్రభుత్వం కేంద్రానిదైతే.. రైతుల సంక్షేమం కోరేది తెలంగాణ ప్రభుత్వందన్నారు. బిజెపి నాయకుల మాటలు వింటుంటే.. చెట్లమీద విస్తారాకులు కుట్టినట్లు ఉన్నాయన్నారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు బాయిల కాడ బోర్లకు మీటర్లు పెడతానంటే.. రైతులంతా బాబుకు మీటర్లు పెట్టి వెనక్కి పంపారని, అదే విధంగా బిజెపి ప్రభుత్వానికి దుబ్బాక ప్రజలు తగిన గుణపాఠం వోటు రూపంలో చెప్పాలని కోరారు. బాయిలకాడ మీటర్లు పెడితే.. 2500 కోట్లు ఆఫర్ ఇస్తామని కేంద్రం ఆఫర్ ఇస్తే .. మీటర్లు వద్దు, 2500 కోట్లు వద్దు.. మా తెలంగాణ రైతుల సంక్షేమమే మాకు ముద్దు అని సిఎం కేసీఆర్ తిరస్కరించినట్లు మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు వస్తుందన్నారు. కొరోనా ప్రభావంతో ప్రభుత్వ పై భారం పడి 8 వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిందనీ, అయినా సంక్షేమాన్ని ఆపలేదన్నారు.
చల్లాపూర్ బీసీ, ఎస్సీ కాలనీలో డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.15 లక్షల రూపాయలు మంజూరయ్యాయనీ, వివిధ కుల సంఘాలకు రూ.60 లక్షలు మంజూరయ్యాయన్నారు. మల్లాయపల్లి మారెమ్మ గడ్డలో రూ.20 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్, రూ.20 లక్షలతో డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపన చేసుకున్నాం. దశల వారీగా మోరీల నిర్మాణాలు చేయిస్తానని భరోసా ఇచ్చారు. ఏడాదిలోపు దుబ్బాకలో పందులు లేకుండా చేద్దామనీ, సంచార జాతులు, నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామని, మిగిలిన వారికి ఎవరి స్థలంలో వారే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టుకునే అవకాశం కల్పిస్తాం. లచ్చపేటకు రెండు రోజుల్లో రూ.2కోట్లు మంజూరు చేస్తా. లచ్చపేటలో మహిళా భవనం, వార్డు ఆఫీసు, వైకుంఠ ధామం, జిమ్, ఇతర కుల సంఘ భవనాలకు కావాల్సిన నిధులు త్వరలోనే మంజూరు చేస్తానని మంత్రి వెల్లడించారు. దుబ్బాక నియోజకవర్గంలో 3 వేల ఇండ్ల నిర్మాణానికి కాలనీలు నిర్మించామని, త్వరలోనే ఎవరి జాగలో మీరే ఇళ్లు కట్టుకోవచ్చునని, ఇందుకోసం గతంలోనే అసెంబ్లీలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇచ్చినట్లు, కొరోనా నేపథ్యంలో కొద్దిగా ఆలస్యం జరుగుతున్నదని మంత్రి పేర్కొన్నారు. ప్రతీ నియోజకవర్గ పరిధిలో వెయ్యి ఇండ్లు వారి సొంత స్థలంలో నిర్మించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు, దుబ్బాకకు వెయ్యితో పాటు అదనంగా వెయ్యి ఇండ్ల నిర్మాణాలు చేసుకునేలా సిఎం కేసీఆర్ అనుమతి తీసుకుందామన్నారు.
కొరోనా దృష్ట్యా ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించాం. కానీ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఎక్కడా ఆపలేదు. ఇంటింటికీ తాగునీరు అందించినట్లుగానే ఏడాదిలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామనీ, పెళ్లి బరువు తల్లికి తెలుసని తల్లి పేరిట కల్యాణ లక్ష్మీ చెక్కులను అందిస్తున్నామన్నారు. ఇప్పటి దాకా తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల పెళ్లిలకు 5వేల555 కోట్ల రూపాయలు సిఎం కేసీఆర్ సాయం చేశారు. కాంగ్రెసోల్లు పొద్దుం దాకా 3 గంటలు, రాత్రిలో 3 గంటలు దొంగ కరెంటు ఇచ్చిండ్రనీ, తెలంగాణలో ముఖ్యమంత్రి తెచ్చిన చట్టానికి రైతులు పాలాభిషేకం చేస్తే.. రైతుల నడ్డి విరిచే చట్టం తెచ్చిన కేంద్ర ప్రభుత్వంపై నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు. కార్పోరేట్ కంపనీల ఒప్పందంతో చేసుకుని నయా జమీందారి వ్యవస్థను తెచ్చిందని ఎవరి ప్రయోజనాల కోసం చేశారని ఆరోపించారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రైతు బంధు సాయం రైతులకు అందుతుందా? అని ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వం బావుల దగ్గర మీటర్లు పెట్టి రైతుల నుంచి కరెంటు బిల్లు వసూలు చేయాలంటోందనీ, తెలంగాణలో సిఎం కేసీఆర్ మాత్రం తెలంగాణ రైతాంగానికి ఉచిత కరెంటు ఇస్తామని చెప్పారనీ గుర్తు చేశారు. మీటర్లు పెట్టాలన్న బిజెపికి తెలంగాణలో ఏం పని అని నిలదీశారు. రైతులకు బిజెపి ఏం సాయం చేసిందని…మళ్లీ గ్రామాలకు ఆ పార్టీ నేతలు వస్తున్నారన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలో సిఎం కేసీఆర్ నిర్ణయిస్తారనీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.