- బక్క కేసీఆర్ను కొట్టడానికి ఇంత మంది వస్తరా ?
- డిసెంబర్ 7 నుంచి మళ్లీ వరద సాయం
- ప్రధానిని రూ.1300 కోట్లు అడిగితే 13 పైసలు కూడా ఇవ్వలేదు
- వరద సాయం ఇవ్వకుండా ఎన్నికల ప్రచారానికి వరదలా వస్తున్నారు
- బిల్డర్లకు బి పాస్ కావాలా ? కర్ఫ్యూ పాసా ?
- కాస్మోపాలిటన్ నగరంలో విధ్వేషాలు జరిపే కుట్ర
- •మాయమాటలకు లొంగితే వ్యాపారాలు, ఉపాధి దెబ్బతింటయి
- గతంలో కంటే 4 సీట్లు ఎక్కువగనే వస్తయి
- టిఆర్ఎస్ ప్రగతి శంభారావం సభలో సీఎం కేసీఆర్
కొరోనాతో ప్రభుత్వ ఆదాయం పడిపోయినా సంక్షేమ పథకాలను ఆపలేదు. రాష్ట్రంలో ఏటా రూ. 42 వేట్లను ప్రజల సంక్షేమ పథకాల కోసమే వినియోగిస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో గాలివాటంగా వోటేయకూడదు. ప్రజలు ఆశీర్వదించి పంపిస్తే మరిన్ని అభివృద్ధి పథకాలు చేపడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హైదరాబాద్ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలలో వోటు వేసే ముందు నేతల పనితీరును ప్రజలు బేరీజు వేసుకోవాలనీ, ప్రభుత్వం నేతలు ఎలా అభివృద్ధి చేస్తున్నారు ? ఏ పద్దతిలో ముందుకు వెళుతున్నారో ఆలోచించాలనీ, ఎన్నికల ముందు పార్టీలు చెప్పే మాయమాటలకు లొంగిపోవద్దని సూచించారు. గతంలో కంటే నాలుగు సీట్లు ఎక్కువనే రాబోతున్నాయనీ, డిసెంబర్ 4న మళ్లీ ఇదే ఎల్బీ స్టేడియం నుంచి కొత్త శక్తితో ప్రయాణం ప్రారంభిద్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో వరద సాయం చూసి చలించిపోయాననీ, లక్షల మంది పేదల బతుకులు ఆగమవడం చూసి చలించి బాధతో ఆర్థిక సాయం చేద్దామని ముందుకు వస్తే కుట్రలతో ఆపివేశారని విమర్శించారు.
డిసెంబర్ 7 తరువాత వరద సాయం అందని వారికి అందజేస్తామని స్పష్టం చేశారు. శనివారం నగరంలోని ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల ప్రచార సభ టీఆర్ఎస్ ప్రగతి శంఖారావం సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని వరదలు అతలాకుతలం చేసిన సమయంలో ఆర్థిక సాయం చేస్తుంటే కొందరు కిరికిరి పెట్టారని విమర్శించారు. ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా నగరాల్లోనూ వరదలు వచ్చాయనీ, అయినప్పటికీ ఏ నగరంలోనూ ఇవ్వని విధంగా 6.5 లక్షల మంది బాధితులకు రూ. 650 కోట్లు ఇచ్చామని చెప్పారు. మంత్రులంతా మోకాళ్ల లోతులో తిరిగారనీ, డిసెంబర్ 7 తరువాత వరద సాయం అందని వారికి తిరిగి అందజేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రజలకు హామీ ఇస్తున్నా వరద బాధితులను ఆదుకునేందుకే అవసరమైతే మరో రూ. 300 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వెనుకాడదనీ, అర్హులైన ప్రతీ వొక్కరికీ సాయం అందిస్తామని చెప్పారు.
హైదరాబాద్ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రధానిని రూ. 1300 కోట్ల సాయం అడిగితే 13 పైసలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. మేం భారత దేశంలో లేమా ? బెంగళూరు, అహ్మదాబాద్ నగరాలకు వరద సాయం ఇవ్వలేదా ? అని ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తోందని విమర్శించారు.ఎన్నికలు ముగిసిన తరువాత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుందనీ, శాంతి భద్రతల విషయంలో ఆరేళ్లుగా రాజీ పడలేదనీ, రౌడీ మూకలను కఠినంగా అణచివేశామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్కు వస్తున్న కేంద్ర మంత్రులను పరోక్షంగా ప్రస్తావిస్తూ బక్క కేసీఆర్ను కొట్టడానికి ఇంతమంది వస్తరా ? కేసీఆర్ ఢిల్లీకి వస్తున్నాడని గజగజా వణుకుతున్నారనీ, యుపి, మహారాష్ట్రల నుంచి కూడా వస్తున్నారనీ, పక్క రాష్ట్రం వాళ్లు వచ్చి ఏదో మాట చెప్పి పోతరు..ఇలాంటి వారికి ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టాలని పిలుపునిచ్చారు.
ఢిల్లీకి వచ్చి ఎక్కడ ఆగం చేస్తడో అని హైదరాబాద్కు బీజేపీ నేతలంతా వస్తున్నారనీ, వరద సాయం అడిగితే చేయకుండా జీహెచ్ఎంసి ఎన్నికల ప్రచారానికి వరదలా వస్తున్న ఢిల్లీకి గట్టి సందేశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కాస్మోపాలిటన్ నగరంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్లో శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేసి విద్వేషాలు సృష్టించే కుట్ర జరుగుతోందని వెకిలి మాటలు, ప్రజలను విభజించే మాటలకు లొంగిపోతే శాంతియుతంగా ఉన్న నగరంలో భూముల ధరలు పడిపోతాయనీ, వ్యాపారాలు దెబ్బతింటాయనీ, పిల్లల భవిష్యత్తు నాశనమవుతుందనీ, ఈ విషయాన్ని నగర ప్రజలు, వోటర్లు, మేధావులు, విద్యా వంతులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. వ్యాపారాలు జరుగుతాయనీ, బిల్డర్లకు బీ పాస్ కావాలా ? లేక కర్ఫ్యూ పాస్ కావాలా ? ఈ నగరాన్ని కాపాడుకోవాలి. నగరం ప్రశాంతతను దెబ్బతీయొద్దు, హైదరాబాద్కు పరిశ్రమలు వెల్లువలా వస్తున్నాయి. వంచకుల మాటలకు మోసపోవద్దనీ, హైదరాబాద్లో అందరం కలసి ఉండే పరిస్థితులు ఉండాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏనాడూ పక్షపాత నిర్ణయాలు చేయలేదనీ, మిషన్ భగీరథ పథకం అద్భుతమనీ, ఛాలెంజ్ చేసి తొడగొట్టి ఈ పథకాన్ని 90 శాతం అమలు చేశామనీ, మిగతా భాగం కూడా త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు 24 గంటల మంచినీరు అందించాలన్నది తన కల అనీ, మీ అందరి దయ సహకారం ఉంటే అతి తక్కువ కాలంలోనే 24 గంటల పాటు నీళ్లు అదజేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రతీ ఇంటికీ 20 వేల లీటర్ల తాగు నీటిని అందించననున్నట్లు ఇప్పటికే హామీ ఇచ్చాననీ, దీనివల్ల 97 శాతం ప్రజలకు లబ్ది చేకూరుతుందన్నారు. అపార్ట్మెంట్లలో ఉండేవాళ్లకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ ఏ సంక్షేమం చేపట్టినా జాతి, మతం, ప్రాంతం, కులం, అనే బేధం ఉండదన్నారు. ప్రతీ ఇంటికి కంటి పరీక్షలు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, రైతు బీమా, బస్తీ దవాఖానాల ఏర్పాటు, నేత,గీత, మత్య్స కార్మికులు, గొర్రెల పంపిణి, రజకులు, నాయూ బ్రాహ్హణులకు ఉచిత విద్యుత్, పిల్లల కోసం వెయ్యి గురుకులాలు ఈ పథకాలన్నీ రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు.
హైదరాబాద్ చాలా చైతన్యవంతమైన నగరమనీ, ఈ నగరానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందనీ, ఎంతో మంది వచ్చి పోతుంటారు, యుపి, మహారాష్ట్ర వాళ్లు వచ్చి పోతుంటరు, వాళ్లది, నెత్తికాదు, కత్తి కాదు, రేపు ఎన్నికలు ముగిశాక కూడా ఇదే కేసీఆర్, కేశవరావు, పద్మారావు ఉంటారని మమ్మల్ని చూసి హైదరాబాద్ ప్రజలు జీహెచ్ఎంసి ఎన్నికలలో టీఆర్ఎస్కు వోటు వేయాలని విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతలకు హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే పేరొందిన నగరమనీ, ఎన్నికల పేరుతో శాంతి భద్రతలను విఘాతం కలిగించే వారి మాటలు విని వారి మాయలో పడొద్దని విజ్ఞప్తి చేశారు. సీఎం అని కూడా చూడకుండా తనను ఏకవచనంతో, పరుష పదజాలంతో దుర్భాషలాడుతున్నారనీ, తలచుకుంటే, మేం కూడా అంతకంటే ఎక్కువ అనగలం అంతకంటే ఎక్కువ తిట్టగలం కేసీఆర్ ఎత్తుకుంటే దుమ్ముదులుపుతడు, మాకు కార్యకర్తలు కాదు, కానీ, సంయమనం పాటిస్తున్నాం, సహనం కోల్పోకుండా బాధ్యతతో వ్యవహరిస్తున్నారని దీనిని హైదరాబాద్ ప్రజలు ఆలోచించి హైదరాబాద్ మహా నగర పాలికకు జరిగే ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని సీఎం కేసీఆర్ ఈ సందర్బంగా విజ్ఞప్తి చేశారు.