ఉన్నతస్థాయి సమీక్షలో నేతలకు పరిచయం
అనంతరం గ్రేటర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు
టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి సిఎం కేసీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి బీ ఫార్మ్ అందజేశారు. అనంతరం పార్టీ నేతలు వెంటరాగా ఆము జిహెచ్ఎంసి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. గెలుపునకు కృషి చేయాలన్నారు. టీఆర్ఎస్ నేతలు, మంత్రులకు వాణి దేవిని కేసీఆర్ పరిచయం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకుని వాణి దేవి గెలుపు కోసం పనిచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, తలసాని, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌రెడ్డి, మల్లారెడ్డి, రాజ్యసభ ఎంపీ కేకే, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం వాణిదేవి.. గన్‌పార్క్‌కు వెళ్లారు.
అక్కడ అమరవీరుల స్థూపానికి వాణిదేవి నివాళులర్పించారు. గన్ పార్క్ వద్ద నివాళులర్పించిన వారిలో మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, మహేశ్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. అనంతరం తన నామినేషన్‌ను దాఖలు చేసేందుకు జీహెచ్ఎంసీ కార్యాలయానికి బయల్దేరారు.