- ఉద్యమ సమయంలో అవహేళన చేసినా వెనక్కి తగ్గలేదు
- కౌషిక్ రెడ్డి టిఆర్ఎస్లో చేరిన సందర్భంగా సిఎం కెసిఆర్
- ఆయనకు ఉజ్వల భవిష్యత్ ఉందన్న కెసిఆర్
రాష్ట్రంలో నేడు రైతులు 3 కోట్ల టన్నుల వడ్లు పండించారని, 90 లక్షల టన్నుల వడ్లు ఎఫ్‌సీఐకి ఇచ్చినట్లు చెప్పారని, రైతుబంధుపై కొందరు విమర్శలు చేస్తున్నారని సిఎం కెసిఆర్ అన్నారు. తెలంగాణలో ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు ఆగిపోయినట్లు సీఎం తెలిపారు. ప్రజాస్వామ్యంలో పార్టీలు ఓడడం, గెలవడం నిరంతర పక్రియ అన్నారు. శాశ్వతంగా ఎవరూ అధికారంలో ఉండరన్నారు. ఇది రాచరిక వ్యవస్థ కాదన్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఫలితాలు ప్రజల కళ్లముందున్నట్లు సీఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఇటీవలే కాంగ్రెస్ నుంచి వైదొలగిన పైడి కౌశిక్‌రెడ్డి బుధవారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ టీఆర్ఎస్ పార్టీలో చేరిన కౌశిక్‌రెడ్డికి ఉజ్వల భవిష్యత్ ఉందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అన్నారు. కౌశిక్‌రెడ్డి భవిష్యత్‌కు మంచి మార్గం ఏర్పాటు చేస్తానని మాటిస్తున్నట్లు సీఎం తెలిపారు. కౌశిక్ కేవలం హుజూరాబాద్‌కే పరిమితం కారని కూడా అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ..రాష్ట్ర అభ్యుదయాన్ని కాంక్షించి, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశ్యంతో టీఆర్ఎస్లోకి వొచ్చిన మిత్రులందరికీ స్వాగతం పలికారు.
మలిదశ ఉద్యమంలో కౌశిక్‌రెడ్డి తండ్రి సాయినాథ్‌రెడ్డి తనతోని భుజం కలిపి పనిచేసినట్లుగా సీఎం చెప్పారు. ‘ఎన్నో అవమానాలు ఎదుర్కుని ఉద్యమం కొనసాగించాం. ప్రొ.జయశంకర్ సలహాలతో ఉద్యమాన్ని నడిపాం. రాష్ట్రాన్ని సాధించాం. రాష్ట్రం వొచ్చినప్పుడు ఒక విపత్కర పరిస్థితి. కరెంట్ కోతలు, తాగేందుకు మంచినీళ్లు లేవు, చేనేత కార్మికుల ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు ఇలా ఎన్నో సమస్యలు. అవగాహనతో ఒక్కో సమస్యను అధిగమిస్తూ వొస్తున్నం. ఒక్కో పథకం రూపకల్పన వెనుక ఎంతో మేథో మధనం ఉంది. తెలంగాణ ప్రజలు గర్వంగా బతకాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యం’ అని తెలిపారు. ఎవరు ఎంత మొత్తుకున్నా తెలంగాణలో ఇకపై కరెంట్ పోదన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో నే మొదటిస్థానంలో ఉన్నట్లు తెలిపారు. గొర్రెల పెంపకంలో తెలంగాణ నెంబర్ వన్ అయిందన్నారు.
గొర్రెల పంపిణీ అంటే పప్పు, బెల్లం లాంటి పథకం కాదన్నారు. ఎన్టీఆర్ అవకాశమిస్తే రాజకీయాల్లోకి వొచ్చానని కేసీఆర్ తెలిపారు. ప్రొ.జయశంకర్ సలహాలతో ఉద్యమాన్ని నడిపానని చెప్పారు. ఎన్నో అవమానాలు ఎదుర్కుని ఉద్యమాలు కొనసాగించామని చెప్పారు. ప్రజాస్వామ్య పక్రియలో రాజకీయాలు సహజమన్నారు. కౌశిక్‌రెడ్డికి ఉజ్వలమైన భవిష్యత్ ఉందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన శరీర భాగాలపైనా కొందరు అవహేళన చేశారని, అయినా ముందుకెళ్లామని సీఎం కేసీఆర్ అన్నారు.
తనను తిట్టిన తిట్లు ప్రపంచంలో ఎవరినీ తిట్టుండరన్నారు. ఎవరు ఏమనుకున్నా తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించామని చెప్పారు. తన ముక్కుతో వాళ్లకు పనేంటోనని కేసీఆర్ ఘాటుగా స్పందించారు. హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో దళిత బంధు పైలెట్ ప్రాజెక్ట్ పెట్టారంటూ వొస్తున్న విమర్శలపై కూడా సీఎం కేసీఆర్ స్పందించారు. ఎన్నికల్లో లబ్ది కోసం కచ్చితంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఎన్నికల కోసమే హుజూరాబాద్‌లో దళిత బంధు పెట్టామనేది వందకు వంద శాతం నిజం.. పెట్టిందే అందుకోసమనేనన్నారు. గెలవాలంటే పెట్టుకోవాలి కాబట్టి పెట్టామని చెప్పారు. గెలవని వారే హావి•లు ఇస్తుంటే..గెలిచే పార్టీ తమదని..ఎందుకు ఇవ్వమని కేసీఆర్ వ్యాఖ్యానించారు.