Take a fresh look at your lifestyle.

అసెంబ్లీ గరం గరం.. మమ్మల్ని ఏమన్నా ఊరుకోం..

 • ఎన్నికల్లో ప్రజాతీర్పు కనపడదా
 • మేం గెలిస్తే డబ్బులు పెట్టి గెలిచినట్లా
 • చట్టబద్ధంగానే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల విలీనం
 • సుస్థిర పాలన మీకు ఇష్టం లేదు
 • ఇంటికో ఉద్యోగం ఇస్తామని అనలేదు
 • అసెంబ్లీలో కాంగ్రెస్‌పై భగ్గుమన్న సీఎం కేసీఆర్‌
 • ‌విద్యుత్‌ ‌చార్జీలు పెంచుతాం
 • పోడు భూములకు రైతుబంధు వర్తించదు
 • పాలన వికేంద్రీకరణ కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు
 • రూ. 1000 కోట్లు ఖర్చయినా కరోనాను
 • అడ్డుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటన
 • గవర్నర్‌ ‌ప్రసంగానికి ధన్యవాదాలు

శాసనసభలో ఏది పడితే అది మాట్లాడకూడదనే నియమం పెట్టాలనీ, పనిచేస్తే ప్రభుత్వాలపై విమర్శలు చేస్తే ఊరుకోకూడదని సీఎం కె.చంద్రశేఖరరావు అన్నారు. సింగపూర్‌ ‌వంటి దేశాలలో చట్టసభలలో విమర్శలు చేసి నిరూపించకుంటే శిక్షలు కూడా పడతాయని పేర్కొన్నారు. ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో అవసరం మేర కొన్ని చార్జీలు పెరుగుతాయనీ, ముఖ్యంగా విద్యుత్‌ ‌చార్జీలు స్వల్పంగా పెంచబోతున్నట్లు తెలిపారు. ఆర్టీసీ చార్జీలను సైతం ప్రజలకు చెప్పే స్వల్పంగా పెంచామనీ, అప్పులు తెచ్చి 24 గంటల ఉచిత కరంటు ఇస్తుంటే చార్జీలు స్వల్పంగా పెంచొద్దా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ‌నాయకులు రాష్ట్రంలో అభివృద్ధి నిరోధకులుగా తయారయ్యారనీ వారి తాపత్రయమంతా అధికారంపైనేనని విమర్శించారు. పరిపాలన వికేంద్రీకరణ కోసమే రాష్ట్రంలో 33 జిల్లాలను ఏర్పాటు చేశామనీ, దీనిని కూడా కొందరు కాంగ్రెస్‌ ‌నేతలు విమర్శిస్తే మరికొందరు కొత్త జిల్లాలకు డిమాండ్‌ ‌చేశారని చెప్పారు. కాంగ్రెస్‌ ‌నేతలు విమర్శిస్తున్నట్లుగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని తామెప్పుడూ చెప్పలేదనీ, లేని ఉద్యోగాలను తామెక్కడి నుంచి తేగలమని ప్రశ్నించారు. శాసనసభ బడ్జెట్‌ ‌సమావేశాలలో భాగంగా రెండో రోజైన శనివారం గవర్నర్‌ ‌ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చకు ఆయన సమాధానమిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలు వేలల్లో ఉంటే ప్రైవేటు రంగంలో లక్షల్లో ఉన్నాయనీ, ప్రభుత్వం ఇవ్వలేని ఉద్యోగాలను ఇస్తామని తామెందుకు చెప్పాలనీ, ఇంటికో ఉద్యోగం ఇస్తామని నేనెప్పుడూ చెప్పలేదు.

అసలు ఆ అంశం మా ఎన్నికల మేనిఫెస్టోలోనే లేదని స్పష్టం చేశారు. అంతకు ముందు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను అక్రమంగా టీఆర్‌ఎస్‌లో విలీనం చేసుకున్నారని చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ చట్టబద్దంగానే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో విలీనమయ్యారనీ, దేశంలో ఏ పార్టీ అయినా చీలి వస్తే వద్దని చెప్తాయా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాల నిర్మాణం తెలంగాణలో మినహా దేశంలో మరెక్కడా జరగలేదనీ, ఎమ్మెల్యేలకు ఆ గౌరవం ఉండాలన్న ఉద్దేశ్యంతోనే ప్రత్యేకంగా క్యాంపు కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 104 నియోజకవర్గాలకు క్యాంపు కార్యాలయాలు మంజూరు చేశాం ఇప్పటికి 82 నియోజకవర్గాలలో వీటి నిర్మాణం పూర్తయింది 8 నియోజకవర్గాలలో మాత్రమే భూవివాదాలు ఉన్నాయని కేసీఆర్‌ ‌వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ క్యాపి•ల్‌ ఎక్స్‌పెండేచర్‌ ‌కేవలం రూ. 59వేల కోట్లుగా ఉండేదనీ, కానీ గత ఐదేళ్లలో టీఆర్‌ఎస్‌ ‌పాలనలో ఆ వ్యయం రూ. 1.60వేల కోట్లకు చేరిందని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఏర్పడ్డాక జీఎస్‌డీపీ రూ. 4 లక్షల కోట్లు అనీ, టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ హయాంలో అది రూ. 8.66 లక్షల కోట్లు దాటిందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న దృష్ట్యా ఇటీవలి కాలంలో రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని సీఎం కేసీఆర్‌ ‌వెల్లడించారు. యాసంగిలో రాష్ట్రంలో మొత్తం 38.19 లక్షల ఎకరాలలో వరి సాగైందనీ, వర్షాకాలంలో మరో 2 లక్ష) ఎకరాలు పెరిగి అది 40 లక్షల ఎకరాలకు పెరిగిందని చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రంలో రెండు పంట కాలాల వరి ఉత్పత్తి 225 లక్షల టన్నులు వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో పండే ప్రతీ వరి గింజనూ కొంటామని ఈ సందర్భంగా కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, శాంతిభద్రతలకు కాపాడే విషయంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు.

- Advertisement -

టీఆర్‌ఎస్‌ ‌హయాంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామనీ, దేశవ్యాప్తంగా వినియోగిస్తున్న సిసి కెమెరాలలో 66 శాతం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయనీ, పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే అన్ని జిల్లాలు ఎందుకుని కాంగ్రెస్‌ ‌నేతలు విమర్శించారని చెప్పారు. దేశ చరిత్రలో పశ్చిమబెంగాల్‌, ఆం‌ధ్రప్రదేశ్‌ ‌మినహా మిగతా అన్ని రాష్ట్రాలూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాయని చెప్పారు. తెలంగాణను చూశాకే ఏపీ ప్రబుత్వం కూడా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే యోచనలో ఉందని వెల్లడించారు. ఏపీ సీఎం జగన్‌ ‌తనతో మాట్లాడిన దాన్ని బట్టి తనకున్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్‌లో 25 జిల్లాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని సీఎం కేసీఆర్‌ ‌వెల్లడించారు. కాంగ్రెస్‌ ‌నేతలకు రాష్ట్రంలో సుస్థిర పాలన జరగడం ఇష్టం ఉండదనీ, 2014 ఎన్నికల సమయంలో ఆ పార్టీ నేత భట్టి విక్రమార్క టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఉండదు కూలిపోతుందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే, 2019 ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ ‌విజయం సాధించినప్పుడు ఈవీఎంలు గోల్‌మాల్‌ ‌చేసి గెలిచారని దుష్ప్రచారం చేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ‌వాళ్లు గెలిస్తే చక్కగా గెలిచినట్లు మేం గెలిస్తే డబ్బులు పెట్టి గెలిచినట్టా అని ప్రశ్నించారు. ఈవీఎంలు ఎక్కడి నుంచి వస్తాయో కూడా తమకు తెలియదని చెప్పారు. బ్యాలెట్‌ ‌పద్దతిలో రాష్ట్రంలోని 32కు 32 జిల్లా పరిషత్‌లను టీఆర్‌ఎస్‌ ‌గెలుచుకుందనీ, అలాగే, సహకార సంఘాల ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలలో సైతం ప్రజలు తమ పార్టీకే అఖండ విజయాన్ని కట్టబెట్టారనీ, టీఆర్‌ఎస్‌కు ప్రజలు ఇస్తున్న మద్దతు కాంగ్రెస్‌ ‌నేతలకు కనబడదని వ్యాఖ్యానించారు. ఎన్నిక ఏదైనా విజయం టీఆర్‌ఎస్‌ ‌పార్టీదేననీ, ఎవరు తప్పు మాట్లాడితే వాళ్లకు ప్రజలు అప్పుడే సమాధానం చెబుతారని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో మంచి జరిగినా, చెడు జరిగినా ప్రజలు నిశితంగా గమనించి వెంటనే తీర్పు ఇస్తుంటారనీ, ఈ విషయాన్ని కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు గమనించాలని సూచించారు.

తప్పులు చేసి ఉంటే తాము ఈ స్థాయికే వచ్చి ఉండే వాళ్లం కాదనీ, అందుకే ఈ రోజు టీఆర్‌ఎస్‌ ‌తిరుగులేని రాజకీయ శక్తిగా ఆవిర్భవించిందని చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు బీజేపీతో కుమ్మక్కయ్యారనీ, లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికలలో సైతం ఏం జరిగిందో ప్రజలంతా చూశారని వ్యాఖ్యానించారు. దబ్బులు ఖర్చు గత ఎన్నికలలో గెలిచారని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన విమర్శను ప్రస్తావిస్తూ డబ్బులు ఖర్చు చేసి గెలిచేది ఎవరో నల్లగొండ జిల్లా ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ‌పాలకులు నిర్లక్ష్యం చేసిన నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ ‌సమస్యను శాశ్వతంగా నిర్మూలించామన్నారు. 2020-21 వార్షిక బడ్జెట్‌లో విద్యుత్‌ ‌చార్జీలు స్వల్పంగా పెరుగుతాయని సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు. ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో అవసరం మేర కొన్ని చార్జీలు పెరుగుతాయనీ, ముఖ్యంగా విద్యుత్‌ ‌చార్జీలు స్వల్పంగా పెంచబోతున్నట్లు తెలిపారు. ఆర్టీసీ చార్జీలను సైతం ప్రజలకు చెప్పే స్వల్పంగా పెంచామనీ, అప్పులు తెచ్చి 24 గంటల ఉచిత కరంటు ఇస్తుంటే చార్జీలు స్వల్పంగా పెంచొద్దా అని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్‌, ‌టీడీపీ ప్రభుత్వాలు చెరువులను ధ్వంసం చేశాయని విమర్శించారు. కాంగ్రెస్‌ ‌పాలనలో ఒక్క డయాలసిస్‌ ‌కేంద్రం కూడా లేదనీ, టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం వచ్చాక వీటిపై దృష్టి సారించిందని వెల్లడించారు.ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా సాధ్యమైనంత వరకు నిరుపేదలకు డబుల్‌ ‌బెడ్‌రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించి ఇస్తుందని స్పష్టం చేశారు. పోడు భూములకు రైతు బంధు పథకం వర్తించదనీ, కానీ గిరిజనుల పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయనీ, ఇందుకోసం టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక చర్యలే కారణమని వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రానికి కరోనా భయం లేదని సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ ‌భయం లేదనీ, అసెంబ్లీలో ఉన్న ఎవరైనా మాస్కులు పెట్టుకున్నారా అని ప్రశ్నిస్తూ అసలు కరోనా వస్తుందనే భయమే లేనప్పుడు ఇక మాస్కులు లేవనే భయం ఎందుకని అన్నారు. అసలు రాష్ట్రానికి కరోనా రాలేదనీ, మన రాష్ట్రంలో పుట్టిన జబ్బు కాదన్నారు. కరోనా ప్రభావిత దేశాల నుంచి మన దగ్గరికి ప్రయాణించిన వారి నుంచే ఇది వ్యాప్తిచెందుతుందని చెప్పారు. భారత్‌ ‌లాంటి పెద్ద దేశంలో ఇప్పటి వరకు కేవలం 30 మందికి మాత్రమే కరోనా వచ్చిందనీ, దుబాయ్‌ ‌నుంచి వచ్చిన ఒక హైదరాబాదీకి కరోనా సోకినట్లు గుర్తించామనీ, ఆయనకు ప్రస్తుతం అత్యుత్తమ వైద్య చికిత్సలు అందుతున్నాయని చెప్పారు. తెలంగాణలో ఒక్కరికి కూడా కరోనా వైరస్‌ ‌లేదనీ, అవసరమైతే రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేసయినా కరోనాను రానివ్వబోమని స్పష్టం చేశారు. ఎవరి నియోజకవర్గంలో వాళ్లం నిలబడి మాస్కులు లేకుండా పనిచేద్దామనీ, సూచించారు. దీనిపై అపోహలు దుష్ప్రచారాలు నమ్మొద్దనీ, కరోనా రావొద్దని కోరుతున్నట్లు చెప్పారు. కరోనా వ్యాధిపై ఒక సైంటిస్తు తనతో మాట్లాడారనీ, దీనిపై హైరానా పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసినట్లు తెలిపారు. పారాసెటిమాల్‌ ‌టాబ్లెట్‌ ‌వేసుకుంటే సరిపోతుందనీ, ఆయన సలహా ఇచ్చారనీ అంతకు మించి ఏమీ లేదని వెల్లడించారు.తెలంగాణ వంటి అధిక ఉష్ణోగ్రత కలిగిన రాష్ట్రంలో కరోనా వైరస్‌ ‌మనజాలదనీ, 22 సెంటిగ్రేడ్‌) ఉష్ణోగ్రతలో ఆ వైరస్‌ ‌బతకదని చెప్పారు. దండం పెట్టి రమ్మన్నా రాదనీ, కరోనా సమస్య రాష్ట్రానికి లేదని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌వెల్లడించారు.

Leave a Reply