Take a fresh look at your lifestyle.

ఐఏఎస్‌ల నిబంధనల సవరణ ప్రతిపాదనలు..

  • రాష్ట్రాల హక్కులను హరించడమే..!
  • సీఎం కేసీఆర్‌ అసంతృప్తి.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: కేంద్రం ప్రతిపాదించిన ఐఏఎస్‌ల నిబంధనల సవరణలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు రాష్ట్రాల హక్కులను హరించే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈమేరకు సీఎం కేసీఆర్‌ ‌సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఐఏఎస్‌ల నిబంధనల సవరణపై కేంద్రం తాజా ప్రతిపాదనలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు.ప్రతిపాదిత సవరణలు రాజ్యాంగ స్ఫూర్తికి, సమాఖ్య స్పూర్తికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలలో పనిచేసే అధికారులను కేంద్రం పరోక్షంగా నియంత్రించే ఎత్తుగడగా లేఖలో పేర్కొన్న కేసీఆర్‌ ‌నిబంధనలను సవరించడం పట్ల రాష్ట్ర పరిపాలన చిక్కుల్లో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సవరణలు ఫెడరల్‌ ‌స్ఫూర్తికి పూర్తి విరుద్దంగా ఉన్నాయనీ, రాష్ట్ర ప్రభుత్వాలకు ఐఏఎస్‌లపై పాలనాపరమైన హక్కులు లేకుండా చేసేందుకే ఐఏఎస్‌ ‌కేడర్‌ ‌రూల్స్ 1954‌ను కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిందని ఆరోపించారు.కేంద్రం తాజా ప్రతిపాదనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే ఏ ఐఏఎస్‌ అధికారిని అయినా కేంద్ర ప్రభుత్వం డిప్యుటేషన్‌పై తీసుకోవచ్చు. ఈ సవరణలను ఇప్పటికే పలు రాష్ట్రాలు వ్యతిరేకించాయి. పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌, ‌కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ‌కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీకి లేఖలు రాశారు. తాజాగా ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ ‌కూడా ప్రధానికి లేఖ రాయడం విశేషం.

Leave a Reply