సీఎస్, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
రాష్ట్రంలో కొరోనా వ్యాప్తి నివారణ, లాక్డౌన్ పరిస్థితులపై సీఎం కేసీఆర్ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్లో నిర్వహించిన ఈ సమీక్షకు సీఎస్ సోమేశ్ కుమార్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల రాష్ట్రస్థాయి అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో కొరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అమలవుతున్న తీరు, లాక్డౌన్ ఎలా అమలవుతోంది ?, కంటైన్మెంట్ జోన్లపై హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాలలోని పరిస్థితిపై ఉన్నతాధికారులతో చర్చించారు.
కొరోనా వ్యాప్తి ఉధృతమవుతున్న నేపథ్యంలో తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో పర్యటించాలని ఈ సందర్భంగా సీఎస్‌తో పాటు వైద్య, ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖల అధికారులను ఆదేశించారు. కొరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని సూచించారు. దీంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బుధవారం సీఎస్ సోమేశ్‌కుమార్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రజారోగ్య శాఖ సంచాలకుడు శ్రీనివాసరావు సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు.