Take a fresh look at your lifestyle.

శాంతిభద్రతలకు సిఎం కేసీఆర్ ‌ప్రాధాన్యం పోలీస్‌ ‌శాఖ అభివృద్దికి కూడా పెద్దపీట: డిజిపి

హైదరాబాద్‌,‌జూన్‌5: ‌దేశానికే తెలంగాణ పోలీస్‌ ‌శాఖ ఆదర్శంగా ఉందని తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. పోలీస్‌ ‌శాఖకు సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలీస్‌ ‌శాఖలో ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు.రాష్ట్రంలో శాంతి భద్రతలను చక్కదిద్ది, తెలంగాణ పోలీసులు శాంతి భద్రతల పర్యవేక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా ముఖ్యమంత్రి చేశారని కొనియాడారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ షీ టీమ్స్‌ను ఏర్పాటు చేశారని, ఈవ్‌టీజింగ్‌లు లేకుండా చేయడంలో షీ టీమ్స్ ‌విజయం సాధించి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు.

పోలీస్‌ ‌శాఖలో మహిళలకు 33 శాతం రిజిర్వేషన్లు ఇస్తున్నామన్నారు. వ్యవస్తీకృత నేరాలను పూర్తిగా అణిచివేశామని, పీడీ యాక్టులతో నేరాలు పూర్తిగా తగ్గాయన్నారు. తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణకు సీఎం కేసీఆర్‌ ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారని రాష్ట్ర డీజీపీ మహేందర్‌ ‌రెడ్డి అన్నారు. పోలీస్‌ ‌శాఖకు తెలంగాణ ప్రభుత్వం తగిన కేటాయింపులు చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఆ తర్వాత పోలీస్‌ ‌శాఖలో మార్పులను స్పష్టంగా గమనించొచ్చని అన్నారు. సీఎం ఆధ్వర్యంలో పోలీస్‌ ‌శాఖలో ఎన్నో మార్పులు తెచ్చామని డీజీపీ గుర్తుచేశారు. నేరాలు అరికట్టడం, ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో దేశానికే ఆదర్శంగా నిలిచామని చెప్పారు. ఆధునాతన సౌకర్యాలతో పోలీస్‌ ‌స్టేషన్‌ ‌భవనాలు నిర్మిస్తున్నామని, పోలీసులపై ప్రజల్లో నమ్మకాన్ని తీసుకొచ్చామని డీజీపీ పేర్కొన్నారు. జీహెచ్‌ఎం‌సీలో 6 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. నేరాలను అరికట్టడంలో సీసీకెమెరాలు ఎంతగానో దోహదం చేస్తాయని ఆయన అన్నారు.

Leave a Reply