- ఉద్యోగ నియామకాలు, టీకా పంపిణీ, తదితర అంశాలపై.. మంత్రులు, కలెక్టర్లు, తదితరులతో భేటీ
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 11న వివిధ సమస్యలపై మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రగతిభవన్లో సమావేశం కానున్నారు. ఉద్యోగ నియామకాలపై నిర్ణయంతో పాటు, కొరోనా టీకా పంపిణీ తదితర అంశాలపై చర్చించనున్నారు. అలాగే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలును సవి•క్షిస్తారు. ఉదయం 11:30 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. రాష్ట్ర రెవెన్యూ, పంచాయతిరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖ, అటవీ శాఖలతో పాటు ఇతర శాఖల ముఖ్యమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.
రెవెన్యూకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రగతిభవన్లో సీనియర్ అధికారులు, కొంత మంది కలెక్టర్లతో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో రెవెన్యూకు సంబంధించి పరిష్కరించాల్సిన కొన్ని అంశాలు ప్రస్తావనకు వొచ్చాయి. 11న జరిగే సమావేశంలో రెవెన్యూకు సంబంధించిన అంశాలను కూలంకషంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, ట్రిబ్యూనల్ల ఏర్పాటు, పార్ట్ బిలో చేర్చిన అంశాల పరిష్కారం తదితర విషయాలపై కూడా సమాశంలో చర్చిస్తారు. రెవెన్యూకు సంబంధించిన అన్ని అంశాలను సత్వరంగా పరిష్కరించేందుకు అవసరమైన కార్యాచరణను ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు. ఇకపోతే రాష్ట్రంలో కొరోనా వ్యాప్తి, నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమావేశంలో చర్చించనున్నారు. కొరోనా టీకా ప్రజలకు అందించే కార్యాచరణపై చర్చలు జరుపనున్నారు.