Take a fresh look at your lifestyle.

నయవంచనలో సిఎం కేసీఆర్‌ ‌నెంబర్‌ 1 ‌బిజెపి నేత విజయశాంతి ఫైర్‌

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై బిజెపి సీనియర్‌ ‌నాయకురాలు, ప్రముఖ సినీ నటి విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ మరోసారి తనదైనశైలిలో నిప్పులు చెరిగారు. సోమవారం ఆమె సోషల్‌ ‌మీడియాలో ఓ పోస్టు చేస్తూ…బూటకపు కబుర్లతో నయవంచన చెయ్యడంలో కేసీఆర్‌ ‌నెంబర్‌ 1 అనిపించుకున్నారనీ మండిపడ్డారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సిఎం కేసీఆర్‌ ‌చేసిన ప్రసంగం వింటే అరచేతిలో వైకుంఠం చూపించడమంటే ఏమిటో బాగా అర్థమవుతుందనీ,  మరీ ముఖ్యంగా ఆయన దళితబంధు పథకం గురించి మాట్లాడుతూ రకరకాల గణాంకాలు, బడ్జెట్‌ ‌కేటాయింపులంటూ అంకెల గారడీ చేశారన్నారు. తెలంగాణలోని దళితుల సమస్యలన్నింటికీ ఏకైక పరిష్కారం ఈ పథకమే అన్నట్టుగా చెప్పుకొచ్చారనీ,  గతంలో ఆయన దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి వంటి హామీలిచ్చినప్పుడు కూడా ఇలాంటి మాటలే మాట్లాడారనీ గుర్తు చేశారు. ఆ తర్వాత దళిత ఉప ముఖ్యమంత్రులిద్దరినీ పక్కకు నెట్టేసి దళితులకు ఆయన ఇచ్చిన గౌరవం ఏమిటో కళ్లారా చూశామన్నారు.

ఆరంభ శూరత్వం తప్ప మరొకటి తెలియని కేసీఆర్‌  ‌నైజం అందరికీ తెలిసిందేననీ, ఆయన ప్రసంగంలోని మిగతా అంశాల్ని గమనిస్తే…దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉందన్నారు. తెలంగాణ రైస్‌ ‌బౌల్‌ ఆఫ్‌ ఇం‌డియాగా అవతరించిందన్నారు. పరిస్థితులు ఇంత గొప్పగా ఉన్నప్పుడు నిరుద్యోగుల ఆత్మహత్యలు, రైతులకు సమస్యలు ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. హరితహారంతో పచ్చదనం పెరిగిందన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌…. ఈ ‌పథకం కోసం స్వంత డబ్బులు ఖర్చు చేసి అప్పుల పాలైనవారి గురించి తెలియదా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సర్కారు అంత గొప్పగా అభివృద్ధి చేసి ఉంటే…పట్టణప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఎందుకు నిరసన జ్వాలలు ఎదుర్కోవలసి వొచ్చిందో చెప్పాలని ఆ పోస్టులో విజయశాంతి సిఎం కేసీఆర్‌ను డిమాండు చేశారు.

Leave a Reply